Kiccha Sudeep On Rashmika Ban: కన్నడలో రష్మిక బ్యాన్‌పై స్పందించిన కిచ్చా సుదీప్ - చురకలు ఆమెకేనా?
నటి రష్మిక మందన్నపై కన్నడ సినీ పరిశ్రమ నిషేధం విధించిందనే వార్తలపై కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ తనదైన శైలిలో స్పందించాడు.
నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ఇప్పుడు వివాదాలతో సావాసం చేస్తోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి గతంలో ఆమె చేసిన కామెంట్స్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి పేరు ప్రస్తావించకుండా సైగలు చేయడం, దక్షిణాది సినిమాల్లోని సాంగ్స్‌ను తక్కువ చేసి మాట్లాడటంతో ఆమె సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. మరోవైపు కన్నడ ఇండస్ట్రీ సైతం ఆమెపై బ్యాన్ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తనదైన రీతిలో స్పందించాడు.
సుదీప్ ఓ ఇంటర్వ్యూలో రష్మికపై కన్నడ ఇండస్ట్రి బ్యాన్ విధించడంపై వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘ప్రస్తుతం మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. స్వర్గీయ రాజ్ కుమార్ సమయంలో కేవలం దూరదర్శన్ ఒకట్రెండు న్యూస్ పేపర్లు మాత్రమే ఉండేవి. ఈ కాలంలో న్యూస్ చానెల్స్, ముఖ్యంగా సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఒక్కోసారి తప్పుడు సమాచారం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. వాటిని మనమే నియంత్రించుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పూల దండలే కాదు.. అప్పుడప్పుడూ గుడ్లు టమోటాలు, రాళ్లు కూడా పడతాయ్. మనపై ఏదైనా వ్యతిరేకంగా బయటకు వెళ్తుంది అంటే ఆచితూచి మాట్లాడాలి. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి’’ అని అన్నాడు. దీంతో సుదీప్ పరోక్షంగా రష్మిక చురకలు అంటించాడని ఫ్యాన్స్ అంటున్నారు. మరి, రష్మిక దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
నటి రష్మిక మందన్న కన్నడ నుంచే తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ‘కిరాక్ పార్టీ’ సినిమాలో రష్మిక నటించింది. ఆ మూవీ భారీ సక్సెస్ కావడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తర్వాత వరుసగా అవకాశాలు వెళ్లువెత్తాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా రష్మిక నటిస్తోంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ‘కాంతార’ సినిమా, కన్నడ పరిశ్రమ గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంతో జీవితాన్ని ఇచ్చిన కన్నడ పరిశ్రమ పైనే ఇలా మాట్లాడతావా అంటూ నెటిజన్స్ ఫుల్ ఫైర్ అయిపోయారు. ఓ దశలో రష్మికను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత రష్మిక తనపై వస్తోన్న విమర్శలకు వివరణ ఇచ్చింది. తనపై ఎలాంటి బ్యాన్ విధించలేదని, తాను కన్నడ పరిశ్రమ లో అందరితోనూ బానే ఉన్నానని, ఇది తెలియక తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. రష్మిక వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమెపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ‘కిరాక్ పార్టీ’ సినిమా గురించి మాట్లాడుతూ ఆ మూవీ దర్శకుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.