ఇళ్లు కావు ఇంద్ర భవనాలు - 2022లో ఈ సెలబ్రిటీలు కొన్న బంగ్లాల ధరలు తెలిస్తే జ్వరమొస్తాది!
2022లో బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక ఇంటివారయ్యారు. రూ.కోట్లు విలువ చేసే బంగ్లాలను కొనుగోలు చేసి తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. ఆ సెలబ్రిటీలు ఎవరో చూసేయండి.
సొంతింటి కలను సాకారం చేసుకోవడం అంటే మాటలు కాదు. కానీ.. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ఎంత డబ్బు పెడితే అన్ని సౌకర్యాలు ఉన్న ఇంటిని నిర్మించుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే... వారి ఇళ్లే ఇంద్రభవనాల్లా దర్శనమిస్తాయి. అందులోనూ బాలీవుడ్ నటీనటుల ఇళ్లయితే స్వర్గసీమలను తలపిస్తాయి. 2022లో బాలీవుడ్ సెలబ్రిటీస్‌లో కొందరు తమ సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. మరికొందరు స్థలాలను కొనుగోలు చేసి రియల్‌ఎస్టేట్‌లో అడుగుపెట్టారు. మరి వారెవరో చూసేద్దామా!
రణ్‌వీర్ - దీపికా
విలాసవంతమైన ఇళ్లు.. కొనుగోలు చేసిన వారిలో రన్‌వీర్ కపూర్-దీపికా పదుకొనే దంపతులు ముందున్నారని చెప్పవచ్చు. వీరు ఏకంగా రూ.119 కోట్లు వెచ్చించి ముంబయిలోని హై రైస్ రెసిడెన్షియల్ టవర్‌లో క్వాడ్రాఫ్లెక్స్ హౌస్‌ను కొనుగోలు చేసి తమ కలను నెరవేర్చుకున్నారు. ఈ ఇల్లు నాలుగు భాగాలుగా ఉండి.. ఎంతో విలాసవంతంగా ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇంటికి సమీపంలోనే ఈ ఇల్లు ఉంది. ఆ ఇంటి కార్పెట్ ఏరియా సుమారు 11,266 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. టెర్రస్ 1300 చదరపు అడుగులు విస్తరించి ఉంది. 19 కార్లు పట్టేంత పార్కింగ్ స్థలం కూడా ఉండటం ప్రత్యేకంగా చెప్పవచ్చు.
విరాట్ కొహ్లీ - అనుష్క శర్మ
విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ నాలుగు గదుల విల్లాను సుమారు రూ.13 కోట్ల వరకు వెచ్చించి కొనుగోలు చేశారని సమాచారం. దీనికి కొన్ని రోజుల ముందే రూ.19 కోట్లు పెట్టి.. అలీభాగ్‌లో ఎనిమిది ఎకరాల స్థలాన్ని కొన్నారు. వీరే కాకుండా బాలీవుడ్ సీనియర్ నటులు, నిర్మాతలు, దర్శకులు సొంత విల్లాలను కొనుక్కున్నారు.
ఇంకా ఎవరెవరంటే..
❄ బాలీవుడ్ సీనియర్ నటులు బిగ్‌బీ అమితాబచ్చన్ రూ.14 కోట్లు పెట్టి ముంబయిలోని పార్థినాన్ బిల్డింగ్‌లో విల్లాను కొన్నారు. స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్, మినీ థియేటర్ తదితర సదుపాయాలు ఉన్న లగ్జరీ ఇంటిని సొంతం చేసుకున్నారు.
❄ నటి మాధురీదీక్షిత్ రూ.48 కోట్లు వెచ్చించి సౌత్ ముంబయిలో ఓ సుందరమైన ఇంటిని కొనుగోలు చేశారు.
❄ బోనీ కపూర్, దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ తన పాత ఇంటిని అమ్మేసి... రూ.64 కోట్లు వెచ్చించి బాంద్రాలోని పోష్ ఏరియాలో విలాసవంతమైన డూప్లెక్స్ హౌస్‌ను కొన్నారు. ఈ ఇంటిలో తన తండ్రి బోనీ కపూర్‌తోపాటు, ఆమె సోదరి ఖుషి కపూర్ ఉండనున్నారు.
❄ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆయుష్మాన్ ఖురానా, అతని సోదరుడు అపరశక్తి ఖురానా కలిసి ఇటీవల విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించిన వివేక్ అగ్నిహోత్రి అమితాబచ్చన్ కొనుగోలు చేసిన టవర్స్ లోనే ఆయన కూడా అన్ని సదుపాయాలు ఉన్న ఇంటిని కొనుక్కున్నారు.
❄ టీవీ యాక్టర్ రామ్‌కపూర్‌కు ఇప్పటికే గోవాలో రెండు విల్లాలు ఉన్నాయి. వీటితోపాటు అలీభాగ్‌లో రూ.20 కోట్లు పెట్టి ఓ పెద్ద విల్లాను కొన్నారు.
❄ ఓంకార్, మక్‌బూల్ చిత్రాలను నిర్మించిన విశాల్ భరద్వాజ్, మోడల్‌గా వచ్చి నటుడిగా మారిన మిలింద్ సోమన్‌లు విలాస వంతమైన విల్లాలను కొనుగోలు చేశారు. వీటి ప్రత్యేక అరేబియా సముద్రాన్ని ఫేస్ చేస్తూ ఈ విల్లాలు ఉంటాయి.
❄ నటుడు రాజ్‌కుమార్, అతని భార్య కలిసి రూ.44 కోట్లు పెట్టి బోనీ కపూర్ కుమార్తె జాహ్నవి కపూర్ ఇంటిని కొనుగోలు చేశారు. ఇది ముంబయిలోని హై-రైస్ రెసిడెన్షియల్ టవర్‌లో ఉంటుంది.