తండ్రి ఓటమిని గుర్తు చేసుకొని కంటనీరు పెట్టుకున్న కేంద్రమంత్రి
Himachal Pradesh Election: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఎవరి వాదనలు వాళ్లు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
Himachal Election: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రమంత్రులు, పార్టీలోని అగ్రనాయకులు పర్యటనలో జోరు పెంచారు. అందులో భాగంగానే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అక్కడ ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సుజన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో తన తండ్రి ఓటమిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. 2017 ఎన్నికల్లో తండ్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఓటమిని గుర్తుచేసుకుంటూ కంటనీరు పెట్టుకున్నారు. మాజీ సిఎం ప్రేమ్‌కుమార్ ధుమాల్ గత ఎన్నికల్లో సుజన్‌పూర్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓటమిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గుర్తు చేస్తూ, "మీ మనోభావాలను నేను బాగా అర్థం చేసుకున్నాను. యువమోర్చా నుంచి పార్టీ మండలాధ్యక్షుడి, రాష్ట్ర నాయకుడి వరకు మీతో కలిసి పని చేసిన నాయకుడిని. ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదొక ఫ్యామిలీ ఫీలింగ్.
మేము అటువంటి జిల్లాలో జన్మించి, మీలాంటి కార్యకర్తలు ఉన్న లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక్కసారి కాదు, మీరు నన్ను నాలుగుసార్లు ఎంపీని చేశారు. ధుమాల్ (ప్రేమ్ కుమార్ ధుమాల్)ను ముఖ్యమంత్రిని చేశారు.
ये आँसू बहुत कुछ कह गये..@ianuragthakur @BJP4India @INCIndia @jairamthakurbjp @JPNadda pic.twitter.com/5yLE9wK72h
— Jagwinder Patial (@jagwindrpatial) October 21, 2022
సజన్ పూర్‌లో బిజెపి అభ్యర్థి కెప్టెన్ రంజిత్ సింగ్ నామినేషన్ కార్యక్రమం తరువాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనురాగ్ ఠాకూర్ ప్రసంగించారు.
హిమాచల్ తదుపరి సిఎం ఎవరు?
హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తదుపరి ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటమి కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో నవంబర్ 12న ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరుగుతుంది.
కాంగ్రెస్‌కు ఆ ఫలితాలే రిపీట్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎక్కడా కాంగ్రెస్ విజయం సాధించలేదన్నారు అనురాగ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అదే రిపీట్ అవుతుందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం అభివృద్ధి కోసం పని చేసిందని ఆయన అన్నారు.