ఆ గుర్తులు తొలగించండి- బండి సంజయ్‌పై చర్యలు తీసుకోండి- ఈసీకి టీఆర్‌ఎస్ ఫిర్యాదు
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల ప్రధానాధికారికి అభ్యర్థించింది టీఆర్‌ఎస్. కేసీఆర్‌పై ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసిన బండి సంజయ్‌పై చర్యలకు రిక్వస్ట్ చేసింది.
ఎన్నికల కోడ్ ఉండగానే సీఎం కేసీఆర్‌పై అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ లీడర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. బుద్ధ భవన్‌లో సీఈఓ వికాస్ రాజ్‌ని కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్,టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జనరల్ సోమ భరత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. అదే టైంలో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులను ఫ్రీజాబితా నుంచి తొలగించాలని అభ్యర్థించారు.
సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేశారంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చర్యల తీసుకోవాలని సీఈఓకి ఫిర్యాదు చేశారు టీఆర్‌ఎస్ లీడర్లు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు పిచ్చి పట్టిందన్నారు. దేవుడితో సమానమైన సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిచ్చి పట్టిన సంజయ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఆయన పద్ధతి మార్చుకునేలా లేరని... అందుకే సీఈఓ కలిసి ఫిర్యాదు చేశామన్నారు. బీజేపీకి రోజురోజుకు తెలంగాణలో ఆదరణ తగ్గుతోందని అందుకే ఇలాంటి కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ భాను ప్రకాశ్.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మెదడుకు నోటికి కనెక్షన్ పూర్తి తెగిపోయిందని కామెంటస్ చేశారు భాను ప్రకాశ్.
అందుకే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారన్నారు. అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. బండి సంజయ్‌కు మతిస్థిమితం లేకుండా వాగుతుంటే.. అదే కామెంట్స్ నిర్మలా సీతారామన్ చేయడమేంటని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ నేతలు. బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే ఆమె చదవుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ లీడర్లు తట్టుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.
కారు గుర్తును పోలిన గుర్తులు ఎనిమిది ఫ్రీజాబితాలో ఉన్నాయని దీని వల్ల తమకు చాలా నష్టం వాటిల్లోతందిని అభిప్రాయపడ్డారు టీఆర్‌ఎస్ నేతలు. వాటిని తొలగించి జాబితా రూపొదించాలని రిక్వస్ట్ చేశారు. గతంలో కారును పోలిన సింబల్స్‌తో స్వల్ప మెజార్టీతో తమ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు. అందుకే అలాంటి 8 గుర్తులు తొలగించాలని కోరామన్నారు వినయ్ భాస్కర్. ఎన్నికల అధికారికి ఆధారాలు కూడా సమర్పించామని అన్నారు.
ఆగని బండి విమర్శల దాడి
కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విమర్శల దాడి కొనసాగుతోందని ఉంది. మొన్న తాంత్రిక పూజలు అంటూ కామెంట్ చేసిన బండి సంజయ్... ఇవాళ ఆయన ఆస్తులపై సీరియస్ అలిగేషన్స్ చేశారు. "తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వద్ద రూపాయి కూడా లేదు. ఫైనాన్స్ కట్టలేదని కేసీఆర్ ప్రచార రథాన్ని గుంజుకపోయిండ్రు. ఈఎంఐలు కట్టలేదని కేసీఆర్ కారును మంజీరా గ్రామీణ బ్యాంక్ వాళ్లు తీసుకుపోయిండ్రు. అట్లాంటోడు ఇయాళ రూ.100 కోట్లు పెట్టి సొంత విమానం ఎట్లా కొన్నారు? సమాధానం చెప్పాలి?. 8 ఏండ్ల పాలనలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల సొమ్మును దండుకున్నడే తప్ప అదనంగా ఒక్క ఎకరాకు కూడా కొత్తగా నీరియ్యలే. కేసీఆర్ పాలనతో విసిగిపోయి మరో ఏడాది పదవిలో ఉండే అవకాశమున్నా మునుగోడు అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. ఆయన రాజీనామాతో గట్టుప్పల్ ను కొత్త మండలం చేశారు. ఈ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. చౌటుప్పల్ నుంచి తంగెడుపల్లి రోడ్డును ఆగమేఘాల మీద వేసిండ్రు."- బండి సంజయ్ అని సీరియస్ కామెంట్స్ చేశారు.