Sharmila On BRS Manifesto: పాత హామీలకే దిక్కులేదు, విడతల వారీగా పెన్షన్ల పెంపు పెద్ద జోక్- బీఆర్ఎస్ మేనిఫెస్టోపై షర్మిల సెటైర్లు
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు లాంటి పథకాలతో ఆర్థిక సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం ప్రకటించారు. మహిళకు నెలకు రూ.3 వేలు, కేసీఆర్ బీమా లాంటి కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో అన్నారు.
గత ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు... కానీ కేసీఆర్ మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండు అంటూ సెటైర్లు వేశారు. ‘బతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట కేసీఆర్. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర గారు ప్రతి మహిళకు నెలకు 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదం. నిరుద్యోగ భృతి అని గత మ్యానిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ ఇప్పుడు 3 వేలు ఇస్తామంటే నమ్మాలా?
విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్ అన్నారు షర్మిల. రైతు రుణమాఫీ పై దొర కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారు. ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదని... బందిపోట్లు సమితి మ్యానిఫెస్టో ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
కేసీఆర్ ను విమర్శించారా? అన్న జగన్ ను టార్గెట్ చేశారా!
విడతల వారీగా పెన్షన్ల పెంపు పెద్ద జోక్ అని షర్మిల కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ ను విమర్శించారా, లేక తన అన్న ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారా అని చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఏపీలో విడతల వారీగా పింఛన్ మొత్తం పెంచుతున్నారని, తెలంగాణలో అదే విధంగా పెన్షన్ సాయాన్ని పెంచుతామన్నారు కేసీఆర్. ఏపీ తరహాలోనే తెలంగాణలో ఆసరా పింఛన్లను పెంచనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అందిస్తున్న రూ.2016 పింఛన్లను రూ.5000 పెంచుతామని ఆదివారం స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పెన్షన్ ను ఒకటేసారి రూ.5 వేలకు పెంచుతామని ప్రజలను తాము మోసం చేయడం లేదన్నారు.
రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టిన కేసీఆర్ హ్యాట్రిక్ లక్ష్యంగా బీఆర్ఎస్ సంక్షేమ మేనిఫెస్టోను రూపొందించారు. ప్రజలందరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా కల్పిస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తాం. ప్రస్తుతం ఎకరానికి అందిస్తున్న రూ.10 వేల రైతు బంధు సాయాన్ని మొదట రూ.12 వేలకు పెంచి, ఆపై ఏడాకి వెయ్యి చొప్పును పెంచుతూ రూ.16 వేలకు రైతు బంధు సాయం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు మూడు వేలభృతి ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన ప్రజలకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందించాలని ప్రకటించారు.