Telangana elections 2023: సోషల్ మీడియా బాండ్ - అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీల న్యూ ట్రెండ్
Telangana elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు కొత్త ట్రెండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియానే వేదికగా కొత్త పుంతలతో తమ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
మొబైల్, సోషల్ మీడియా.. ఇప్పుడు ఈ రెండూ చాలా పవర్ ఫుల్. సామాన్యులు తమకున్న టాలెంట్ ను ప్రపంచానికి చూపించాలన్నా, రాజకీయ నేతలు తాము ఏం చేస్తున్నది ప్రజలకు తెలియాలన్నా, ప్రజల సమస్యలు వారికి తెలియాలన్నా సామాజిక మాధ్యమమే ఓ ఆయుధంగా మారింది. వీధి లైట్ వెలగకపోవడం దగ్గర నుంచి తమకున్న పెద్ద సమస్యలను సైతం సోషల్ మీడియాలో వివరిస్తూ చాలా మంది అవి పరిష్కారమయ్యేలా చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే సోషల్ మీడియానే సరైన వేదికని భావిస్తూ, నూతన ట్రెండ్ సెట్ చేస్తూ తమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం పోటాపోటీగా నెట్టింట ప్రచారంలో మునిగిపోతున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్ తమను అధికారంలోకి తెచ్చే బాండ్ గా అన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి.
సంక్షేమ పథకాలపై ప్రచారం
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం వంటి సోషల్ మీడియా సంస్థల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల గురించి ప్రజలకు వివరిస్తోంది. ఎదుటి పార్టీలను సోషల్ మీడియా ద్వారానే ఎత్తి చూపుతోంది. తమ మేనిఫెస్టోను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేస్తోంది. అలాగే, యువత మైండ్‌లోకి పార్టీని తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి.
మూడోసారి అధికారమే ధ్యేయం
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ప్రతి రోజు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రచారంలో స్టైల్ మార్చేసింది. 24 గంటల ఉచిత విద్యుత్, తెలంగాణ రైతుల జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మత్స్యకారులకు కోసం చెరువుల్లోకి 75 కోట్ల చేప పిల్లల పంపిణీ, గొల్లకుర్మలకు గొర్రెల పిల్లల పంపిణీ, కంటి వెలుగు పథకం, వికలాంగులు, వితంతువులు, 60 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు పథకాల ఉన్న సైన్ బోర్డులతో ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసింది. వాహనాల్లో ప్రతి పథకం గురించి స్పష్టంగా తెలిసేలా, చూడగానే ఆకట్టుకునేలా వాహనాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
యూట్యూబ్ స్టార్లతో ప్రచారం
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారితో కూడా ప్రచారం చేయిస్తోంది బీఆర్‌ఎస్. ఇన్‌ఫ్ల్యూయన్సర్‌లతో చిన్న చిన్న వ్లాగ్స్ చేయించి కారు గుర్తుకే ఓటెయ్యాలని చెబుతోంది. కొందరు మీమర్స్‌ను కూడా తీసుకొచ్చి క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు వారికి సహకరిస్తూ వైరల్ అవుతున్నారు. ఇన్ స్టా స్టార్లు లేదా ఇన్ ఫ్లూయెన్సర్ల టైపులో స్లోగన్స్ చెప్తూ సోషల్ మీడియాలో యూత్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈ మధ్య మంత్రి మల్లారెడ్డి చేసిన ఓ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్లింది. వేలికి ఇంకు, 30 తర్వాత స్టేటంతా పింకు... అంటూ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత గంగుల కూడా అదే బాటలో మరో ప్రచారం అందుకున్నారు. ఎదిగింది కరీంనగర్.. కారణం గంగుల కమలాకర్. ఇదో స్లోగన్. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ. ఇంకు,ప్రతిపక్షాల జంపు అంటూ ఇంకొకటి. క్రౌడ్, శ్రీనివాస్ గౌడ్ అంటూ వింత ప్రాసతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం చేశారు. 'మేమ్ ఫేమస్' సినిమాలో చూపించినట్లుగా ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
పోటీగా కొత్త ప్రచారంలో కాంగ్రెస్
అటు, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. ప్రసంగాలతో ప్రభుత్వ అవినీతి ఎండగట్టడంతో పాటు... తమ వాదనను ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లే మార్గాలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఈ దిశగా వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించింది. కాళేశ్వరం ఏటీఎంను ఆవిష్కరించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాళేశ్వరం పేరుతో ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేసింది. ఆ ఏటీఎం మిషన్లపై కాళేశ్వరం కరప్షన్ రావు KCR అంటూ ఫొటోలు అతికించింది. ఈ శతాబ్దపు అతిపెద్ద స్కాం కాళేశ్వరం అంటూ ఆ ఏటీఎంపై కొటేషన్లు కూడా పెట్టింది.
అంతేకాదు, ఆ ఏటీఎం మిషన్ల నుంచి రూ.లక్ష కోట్ల రూపాయల నోటు వచ్చేలా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని ద్వారా... కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. లక్ష రూపాలయ డూప్లికేట్ నోటు వెనుక... సీఎం కేసీఆర్ ఫొటో ముద్రించి.. కాళేశ్వరం కరప్షన్ రావు అంటూ పేరు పెట్టారు. ఈ నోటుపై కారు గుర్తును కూడా ముద్రించారు. ఏటీఎం నుండి లక్ష కోట్ల రూపాయల నోటు బయటికి రావడం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తూ దూసుకుపోతున్నారు.