Raghu Rama News: నరసాపురం నుంచి పోటీ చేసేది నేనే- తాడేపల్లిగూడెం సభలో ప్రకటించిన రఘురామకృష్ణరాజు
RRR News: తెలుగుదేశం-జనసేన కూటమి నుంచి బరిలో దిగనున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు.నరసాపురం నుంచే తాను పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెంలో జెండా సభకు వచ్చి చంద్రబాబు, పవన్ అభినందిచారు.
Tadepalligudem Meeting : ఇటీవలే వైసీపీ(YSCP)కి రాజీనామా చేసిన ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghurama Krishnaraju) తెలుగుదేశం- జనసేన నుంచే పోటీ చేయనున్నట్లు తెలిపారు. తాను ఇంకా ఏ పార్టీలో చేరనప్పుటికీ కూటమి నుంచే బరిలో దిగుతానని....నరసాపురం(Narsapuram Parliamentary Constituency) ఎంపీగానే పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెంలోని జెండాసభకు హాజరైన ఆయన....ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక్కటైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను అభినందించడానికే వచ్చానన్నారు.
నరసాపురం నుంచే పోటీ
ఫైర్ బ్రాండ్ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం(TDP)- జనసేన(Janasena) కూటమి లోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగుదేశం-జనసేన ఉమ్మడి బహిరంగ సభ జెండాలో పాల్గొన్నారు. తాను ఈ రెండుపార్టీల్లో చేరనప్పుటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక్కటైన చంద్రబాబు(CBN)- పవన్(Pawan) ను అభినందించడగానికే వచ్చానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అయితే తాను తప్పకుండా ఈ కూటమి నుంచే నరసాపురం ఎంపీగా పోటీచేస్తానని ఆయన సభా వేదికపైనే ప్రకటిచారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే తాను తెలుగుదేశంలోగానీ, జనసేనలోగానీ చేరతానని చెప్పలేదు. ఒకవేళ ఈ కూటమితో బీజేపీ(BJP) సైతం కలిసే అవకాశాలు ఉండటంతో ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయన కేంద్రంలో బీజేపీ పెద్దలకు చాలా దగ్గరయ్యారు. కాబట్టి ఆయన కమలదళంలో చేరి నరసాపురం నుంచి బరిలో దిగుతారా లేక...ఈ రెండు పార్టీల్లోనే ఏదో ఒకదానిలో చేరతారా అన్నది తేల్చకుండా సస్పెన్స్ లో పెట్టేశారు.
జగన్ తో ప్రత్యక్ష పోరాటం
వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచినా....ఏడాది తిరక్క ముందే సొంతపార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన వ్యవహారశైలి, పార్టీ పనితీరు నచ్చక దూరంగా జరిగినా... రాజుగారు పార్టీలోనే ఉంటూ కంటిలో నలుసు మాదిరిగా జగన్(Jagan) ను గుచ్చుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ ఆయన జగన్ పనులను విమర్శిస్తూ వచ్చారు. దీంతో కక్షగట్టిన జగన్ ఆయన్ను సీఐడీ(CID) కేసులో ఇరికించి హైదరాబాద్(Hyderabad) లో అరెస్ట్ చేయించారు. అంతేకాకుండా విచారణ పేరిట చితకబాదించారని రఘురామకృష్ణరాజు పలు సందర్భాల్లో చెప్పారు. బెయిల్ పై బయటకు వచ్చిన రఘురామ జగన్ పై విమర్శల దాడి పెంచడమే గాక ఆయన అవినీతి కేసులను తిరగతోడేలా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వారిద్దరి మధ్య దూరం మరింత పెరుగుతూ వచ్చింది. చివరకు రఘురామను ఆయన సొంత నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వకుండా జగన్ కట్టడి చేశారు. ఇటీవలే ఆపార్టీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు ఇంకా ఏపార్టీలోనూ చేరలేదు. అయితే మరోసారి కచ్చితంగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. జగన్ కక్షగట్టి నాలుగేళ్లుగా తనను నియోజకవర్గానికి దూరం చేశారని...కనీసం సొంత ఊరికి కూడా రానివ్వలేదని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు తనకు స్వేచ్ఛ వచ్చిందని...త్వరలోనే నియోజవర్గంలో పర్యటించి ప్రజలందరినీ కలుస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఓటుతో జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తథ్యమని రఘురామకృష్ణరాజు అన్నారు.