మునుగోడులో 130 మంది నామినేషన్లు- అసంతృప్తులను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు
మునుగోడులో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది పోటీకి సై అన్నారు.
మునుగోడు బైపోల్ ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టం ముగిసింది. శుక్రవారంతో నామినేషన్ దాఖలు గడువు పూర్తైంది. ఇప్పటి వరకు 130 మంది అభ్యర్థులు, 199 సెట్ల నామినేషన్లు వేశారు. శుక్రవారం ఒక్కరోజే 74 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఇప్పుడు వాటిని స్క్రూట్నీ చేసే పనిలో అధికారులు ఉన్నారు.
మునుగోడులో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది పోటీకి సై అన్నారు. ఇప్పడున్న పార్టీలపై కోపంతో కొందరు... తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరికొందరు... ప్రభుత్వంపై కోపంతో ఇంకొందరు నామినేషన్లు వేశారు. అందుకే సుమారు రెండు వందల వరకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 2018 ఎన్నికల్లో 33 మంది మాత్రమే నామపత్రాలు దాఖలు చేశారు. స్క్రీట్నీ, బుజ్జగింపుల తర్వాత బరిలో నిలిచింది 15 మందే. ఇప్పుడు ఎంత మంది నిలుస్తారన్నది సస్పెన్ష్‌గా మారింది.
ప్రధాన పార్టీలను పరిశీలిస్తే.. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, టీఆరెఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాలుగు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అధికారులకు ఇచ్చారు. వీరితోపాటు డిండి రిజర్వాయర్ భూ నిర్వాసితులు, నిరుద్యోగులు, వివిధ ప్రజాసంఘాల నేతలు పోటీకి సై అన్నారు. కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టిన లెంకల పల్లి గ్రామం నుంచి కూడా నామినేషన్లు పడ్డాయి. ఓయూ జేఏసీ నాయకుడు ఏర్పుల నగేష్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు ఇచ్చారు.
ఇంత మంది నామినేషన్ వేయడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారనుంది. ఆల్ఫాబేట్ ప్రకారం అభ్యర్థుల పేర్లు ఈవీఎంపై రానున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎక్కడో మధ్యలోనో చివరిలోనో కనిపిస్తారు. వాళ్లను వెతుక్కోవడం చాలా కష్టంగా మారనుంది.
వీళ్లకు కేటాయించిన గుర్తులతో కూడా ప్రధాన పార్టీలకు చిక్కొచ్చి పడనుంది. ప్రధాన పార్టీలకు పోలిన గుర్తులు వస్తే మాత్రం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి తాము వేయాల్సిన అభ్యర్థికి కాకుండా వేరే గుర్తుపై ఓటు వేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌ను కలిసి తమ కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇలాంటి బెడద లేకుండా ఉండేలా ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన వారిలో చాలా మందిని తప్పుకునేలా ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వారు నామినేషన్ దాఖలు చేయడానికి గల ప్రధాన కారణాన్ని తెలుసుకొని వాటిని తామే పరిష్కరిస్తామని బుజ్జగించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ప్రధాన పార్టీల్లో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నా అధికార పార్టీకి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. అందుకే ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న చాలా వర్గాలు మునుగోడులో పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేశాయి. అందులో లారీ ఓనర్స్ అసోసియేషన్, వీఆర్‌ఏలు ఉన్నారు. వారిని ప్రభుత్వం, టీఆర్‌ఎస్ అధిష్ఠానం బుజ్జగించింది. మునుగోడులో వాళ్లు పోటీ చేయకుండా వారి సమస్యల పరిష్కారానికి ప్రధాన్యత ఇస్తామంటూ హామీ ఇచ్చింది. డిండీ ప్రాజెక్టు నిర్వాసితులు ఇప్పుడు బరిలో ఉన్నారు. వారిని ఒప్పించి బరి నుంచి తప్పించేందుకు అధికార పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.