(Source: ECI/ABP News/ABP Majha)
NEET PG Seats Supreme Court : మెడికల్ పీజీ విద్యార్థులతో కేంద్రం ఆటలు - సుప్రీంకోర్టు ఆగ్రహం !
మెడికల్ పీజీ సీట్లను భర్తీ చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడింది.
NEET PG Seats Supreme Court : దేశంలో వైద్య విద్య అందని ద్రాక్షలా మారిందని విద్యార్థులు దేశం విడిచి ఉక్రెయిన్ లాంటి చోట్ల చదువుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ సీట్లు తక్కువగా ఉండటమే కారణం.. అయితే ఉన్న సీట్లనూ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు అందకుండా చేస్తున్న వైనంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఖాళీగా ఉన్న 1,450 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదంటూ కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది.
దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో మెడికల్ సీట్లను ఖాళీగా ఉంచడం సరికాదని పేర్కొంది. ఈ ఏడాది నీట్ పీజీ ఆల్ ఇండియా కోటాలో 1456 సీట్లు ఖాళీగా ఉండటంతో ఆ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలివ్వాంటూ కొందరు వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధా బోస్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, ఒక్క మెడికల్ సీటు ఖాళీగా ఉన్న భర్తీ చేయాల్సిందేనని స్పష్ట చేసింది.
The #SupremeCourt of India came down heavily upon the Medical Counselling Committee on Wednesday, stating that leaving seats in #NEETPG vacant not only puts aspirants into difficulty but also leads to dearth of qualified doctors.
— Live Law (@LiveLawIndia) June 8, 2022
Read more: https://t.co/8IsMB5cJgl pic.twitter.com/yDvHxSHpOn
అదనంగా మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించి ఈ సీట్లను ఎందుకు భర్తీ చేయలేదో వివరిస్తూ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని ఆదేశించింది. వైద్యుల జీవితాలు, భవిష్యత్తుతో ఆడుకుంటున్నందుకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. వైద్యులు, సూపర్ స్పెషలిస్టులు అవసరమైనపుడు, ఈ సీట్లను ఖాళీగా ఉంచుకోవడం వల్ల కేంద్రానికి వచ్చే ప్రయోజనమేమిటని ప్రశ్నించింది. మరొక మాప్ అప్ రౌండ్ నిర్వహించి ఉండవలసిందని వ్యాఖ్యానించింది.
ప్రతిసారీ కోర్టు జోక్యం చేసుకోవలసి వస్తోందని, కోర్టు ఆర్డర్ కోసం ఎందుకు వేచి చూస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆ సీట్లను కేంద్రం భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.