TG DEECET Results: తెలంగాణ డీఈఈసెట్ ఫలితాలు విడుదల, 71.53 శాతం ఉత్తీర్ణత నమోదు
DEECET 2024 results: తెలంగాణలో డీఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కళాశాలల్లో సీట్ల భర్తీకి జులై 10న నిర్వహించిన డీఈఈసెట్-2024 ఆన్‌లైన్ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
Telangana DEECET 2024 Results Out: తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(DLEd), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (DPSE) కోర్సుల్లో ప్రవేశాల కోసం జులై 10న నిర్వహించిన డీఈఈసెట్-2024 ఆన్‌లైన్ పరీక్ష ఫలితాలు జులై 24న విడుదలయ్యాయి. డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాస చారి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డీఈఈసెట్ ఫలితాలకు సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాలు కలిపి మొత్తం 71.53 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు సెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
డీఈఈసెట్-2024 పరీక్ష కోసం మొత్తం 17,595 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 15,150 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 12,032 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో తెలుగు మీడియంలో 6,644 మంది అభ్యర్థులు, ఇంగ్లిష్ మీడియంలో 5,024 మంది అభ్యర్థులు, ఉర్దూ మీడియంలో 364 మంది అభ్యర్థులు ఉన్నారు. ఫలితాలకు సంబంధించి తెలుగు మీడియంలో బానోతు నవీన్ 77 మార్కులతో, ఇంగ్లిష్ మీడియంలో వడ్ల వైష్ణవి 80 మార్కులతో, ఉర్దూ మీడియంలో సుమయ్య 71 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కులు, ర్యాంకు కార్డులను జులై 25 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామని సెట్ కన్వీనర్ శ్రీనివాస చారి తెలిపారు.
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ (ఎలిమెంటరీ టీచర్) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2024' (TG DEECET) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ జూన్ 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రెండేళ్ల కాలపరిమతితో ఉండే డీఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి జూన్ 8 నుంచి జులై 1 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జులై 5న పరీక్ష హాల్‌టికెట్లను విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అభ్యర్థులకు జులై 10న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను ప్రకటించారు. ప్రవేశాలకు సంబంధించిన స్థానిక విద్యార్థులకు 85 సీట్లను, ఇతరులకు 15 శాతం సీట్లను కేటాయిస్తారు. మొత్తం సీట్లలో కన్వీనర్ కోటా (కేటగిరి-ఎ) కింద 80 శాతం సీట్లను, మేనేజ్‌మెంట్ కోటా (కేటగిరి-బి) కింద 20 శాతం సీట్లను భర్తీచేస్తారు.
పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు డీఈఈసెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. వీటిలో పార్ట్-1: జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, పార్ట్-2: జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ తెలుగు/ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-3లో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఫిజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, బయోలాజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
ALSO READ: గేట్ - 2025' దరఖాస్తు తేదీలు వెల్లడి, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?