NEET PG Exam 2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా.. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన, కారణం ఏంటంటే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021 కూడా అదే సమయానికి వస్తున్నందున ఈ పరీక్షను 6 నుంచి 8 వారాలు వాయిదా వేసినట్లుగా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) 2022 వాయిదా పడింది. ఈ పరీక్షను ఆరు నుంచి 8 వారాలు వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం నీట్ పరీక్ష మార్చి 12వ తేదీన నిర్వహించాల్సి ఉంది. నీట్ పీజీ కౌన్సెలింగ్ 2021 కూడా అదే సమయానికి వస్తున్నందున ఈ పరీక్షను 6 నుంచి 8 వారాలు వాయిదా వేసినట్లుగా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Union Health Ministry postpones NEET PG exam 2022 by 6-8 weeks
— ANI (@ANI) February 4, 2022
The exam was scheduled to be held on March 12 pic.twitter.com/MPpisjbvvx
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ 2022 నిర్వహణ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ సాగనుంది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష తేదీని వాయిదా వేయాలని వారు కోరారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థుల సేవల్ని వినియోగించుకుంటున్నందుకు గానూ నీట్ పీజీ 2021 పరీక్షల్ని కనీసం నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని.. 2021 మార్చ్ 3 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను కూడా పిటిషనర్లు ఉదహరించారు. 2021లో తామంతా కోవిడ్ విధుల్లో ఉన్నామన్నారు. ఈ విషయాల్ని పరిగణలో తీసుకుని నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయడమే కాకుండా.. ఇంటర్న్‌షిప్ గడువును మే 31 నుంచి పెంచాలని కోరారు.
మరోవైపు, ఇంటర్న్ షిప్ గడువు తేదీ కూడా పెంచాలని పిటిషన్‌లో విద్యార్థులు కోరారు. ఇంటర్న్‌షిప్ వ్యవధిని పూర్తి చేయలేకపోయినందున పరీక్ష రాయలేమని విద్యార్థులు తెలిపారు. కరోనా వల్ల రోగులకు సేవలు చేస్తూ డ్యూటీలో ఉన్నందున ఇంటర్న్‌షిప్ వాయిదా పడిందనే విషయాన్ని కూడా తెలియనివ్వలేదని.. దీని ఫలితంగా పీజీ పరీక్షకు అనర్హులయ్యారని విద్యార్ధుల వాదిస్తున్నారు. నీట్ పీజీ రెగ్యులేషన్స్ ప్రకారం పీజీ కోర్సు చేసే విద్యార్ధుల యూనిట్‌కు 30 బెడ్స్ కేటాయించాల్సి ఉంది. నీట్ పీజీ రెగ్యులేషన్స్ 2000 ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. కోవిడ్ విధుల కారణంగా వందలాదిమంది విద్యార్థుల ఇంటర్న్‌షిప్ నిలిచిపోయింది. ఫలితంగా నీట్ పీజీ పరీక్ష రాయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నీట్ అనేది విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడుతూ తమిళనాడు అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేశారు.