SSC Fake Websites: విద్యార్థులకు అలర్ట్, SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు - సైబర్‌క్రైమ్‌లో అధికారుల ఫిర్యాదు
తెలంగాణ విద్యాశాఖలో నకిలీ వెబ్‌సైట్ల ఉదంతం కలకలం రేపుతుంది. యూఆర్‌ఎల్‌లో కొద్దిపాటి మార్పులతో రెండు వెబ్‌సైట్లు నడుస్తున్నాయి. దీనిపై బోర్డు అధికారులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Fake Websites: సాంకేతికత అరచేతిలోకి వచ్చేసింది. నకిలీలు పెరిగిపోయాయి. అమాయకులను మోసం చేయడానికి రోజుకో రకంగా నేరగాళ్లు స్కెచ్‌లు వేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లతో వ్యక్తుల వ్యక్తిగత డేటాను, కార్డుల సమాచారాన్ని దొంగిలించే నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స్కామ్‌లు ప్రస్తుతం బాగా ఎక్కువయ్యాయి. తాజాగా తెలంగాణ విద్యాశాఖలో నకిలీ వెబ్‌సైట్ల ఉదంతం కలకలం రేపుతుంది. యూఆర్‌ఎల్‌లో కొద్దిపాటి మార్పులతో రెండు వెబ్‌సైట్లు నడుస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు, నకిలీ వెబ్‌సైట్లతో అసలైన బోర్డు వెబ్‌సైట్‌కు ఇబ్బందులున్నాయని, వెంటనే వాటిని తొలగించాలని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఎస్సెస్సీ బోర్డు సన్నాహాలు చేస్తోంది. దీంతో విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని www.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా సేకరిస్తోంది. ఈ వెబ్‌సైట్‌ను జిల్లా విద్యాధికారులు, సెకండరీ స్కూల్స్ హెడ్స్ వినియోగిస్తున్నారు.
ఎస్‌ఎస్‌సీ బోర్డుకు సంబంధించి కంప్యూటర్ పనుల పర్యవేక్షణ బాధ్యతను సికింద్రాబాద్‌లోని మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు అసలైన వెబ్‌సైట్లను పోలినట్లు రెండు (https://bsetelangana.co.in, https://www.bsetelanganagov.in) నకిలీ వెబ్‌సైట్లను ఆ సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని బోర్డు అధికారులకు తెలిపింది.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న డైరెక్టర్ అఫ్ ఎగ్జామినేషన్ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రావు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్‌సైట్లను తొలగించి, నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ వెబ్‌సైట్ల సృష్టి వెనుక ఇంటర్మీడియట్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పాత్రపై సైబర్‌క్రైమ్ పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు, పాస్ పోర్ట్ నకిలీ వెబ్‌సైట్లు..
డేటా చోరీకి సాధారణ వెబ్‌సైట్స్, సంస్థలే కాదు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ను కూడా వదలడం లేదు. ఈ విషయంపై స్వయంగా సర్వోన్నత న్యాయస్థానమే హెచ్చరించింది. అధికారిక సుప్రీంకోర్టు వెబ్‌సైట్ మాదిరిగా నకిలీ వెబ్‌సైట్ రూపొందించి వ్యక్తుల డేటాను దొంగిలిస్తున్నట్ల తమ దృష్టికి వచ్చిందని సుప్రీంకోర్టు రిజిస్టరీ వెల్లడించింది. సైబర్ ఎటాక్స్ గురించి హెచ్చరిస్తూ రిజిస్టరీ ఆఫ్ సుప్రీంకోర్టు ఓ అడ్వైజరీని జారీ చేసింది. అధికారిక సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ మాదిరిగా అదే విధంగా ఉండేలా వేరే యూఆర్‌ఎల్స్ క్రియేట్ చేసి మోసం చేస్తున్నారని అడ్వైజరీలో పేర్కొన్నారు. http://cbins/scigv.com , https://cbins.scigv.com/offence లాంటి ఫేక్ యూఆర్‌ఎల్స్ హోస్ట్ చేసి సైబర్ నేరగాళ్లు డేటా చోరీకి తెగబడుతున్నారని ప్రజలు ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అదేవిధంగా..ఇండియన్ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌కు నకిలీ వెబ్‌సైట్లు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు సేవలు ఉపయోగించుకునే వారికి భారత ప్రభుత్వం పలు హెచ్చరికలు జారీ చేసింది. పాస్‌పోర్ట్ సేవలను అందిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల గురించి ప్రకటన చేసింది. అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in అని తెలిపింది. ఇప్పటికి చాలా మంది పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఇతర మోసపూరిత వెబ్‌సైట్లు, యాప్‌ల కోసం పడిపోతూనే ఉన్నారని అన్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.