AP Universities: ఏపీలోనూ తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు - ఏర్పాటుకు ప్రభుత్వ కసరత్తు
Telugu University: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీతోపాటు, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
![AP Universities: ఏపీలోనూ తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు - ఏర్పాటుకు ప్రభుత్వ కసరత్తు AP Higher Education Department is working to establish Telugu University and Ambedkar Open University in the state AP Universities: ఏపీలోనూ తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు - ఏర్పాటుకు ప్రభుత్వ కసరత్తు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/7c8052c646593e36b2c2001a688b7fe91723281935168522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telugu University and Open University in AP: తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు సాగిన ఉమ్మడి ప్రవేశాలకు జూన్ 2తో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన ఈ రెండు విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 2నాటికి పదేళ్లు పూర్తయినందున అవి ఏపీలో సేవలను నిలిపివేశాయి. ఈ క్రమంలో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు తెలంగాణ ప్రాంతానికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశాయి.
ఈ రెండు యూనివర్సిటీలలో ఈ విద్యాసంవత్సరం వరకు ప్రవేశాలను కొనసాగించాలని ఏపీ ఉన్నత విద్యాశాఖ ఇటీవల లేఖ రాసింది. దీనిపై ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనరాలేదు. దీంతో ఏపీలోనూ తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఎంత? మానవ వనరులు ఎంత అవసరమవుతాయి లాంటి అంశాలను ఉన్నత విద్యాశాఖ లెక్కలోకి తీసుకుంటుంది.
తెలుగు వర్సిటీకి ఖర్చు 50 కోట్లు..
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఏపీలో శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలలో పీఠాలు ఉన్నాయి. వీటిద్వారా 200 మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఉన్న కేంద్రానికి దాదాపు 35 ఎకరాల స్థలం ఉంది. అక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. ఏపీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలంటే దాదాపు 50 కోట్ల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వర్సిటీలో ఉన్న కోర్సులన్నింటినీ ప్రారంభించాలంటే 72 బోధన పోస్టులు, 115 బోధనేతర పోస్టులు భర్తీచేయాల్సి ఉంటుంది.
అంబేద్కర్ వర్సిటీకయ్యే ఖర్చు 60 కోట్ల పైమాటే..
ఏపీలో కొత్తగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి రూ.63.85 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయిని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వర్సిటీలో 50 బోధన పోస్టులు, 68 బోధనేతర పోస్టులు అవసరమవుతాయి. ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ ప్రారంభించాలంటే.. అద్దె భవనంలో ఏర్పాటు చేసి, నిర్వహించాల్సి ఉంటుంది. సార్వత్రిక విశ్వవిద్యాలయం తరఫున ఏపీలో 76 దూర విద్య కేంద్రాలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో కలిపి ప్రస్తుతం లక్షన్నర మంది చదువుతున్నారు. ఏటా సుమారు 16 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు. ఫీజుల రూపంలోనే వర్సిటీకి ఏపీ నుంచి రూ.21 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఏపీ స్టడీ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి జీతాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.5.40 కోట్ల వరకు చెల్లిస్తోంది.
ఆలస్యరుసుముతో దరఖాస్తుకు ఆగస్టు 19 వరకు అవకాశం..
తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2024-25 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువు ఆగస్టు 9తో ముగిసింది. అయితే రూ.100 ఆలస్య రుసుముతో ఆగస్టు 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దీనిద్వారా డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)