Medchal Robbery: మేడ్చల్ గోల్డ్ షాపులో చోరీ, 24గంటల్లోనే దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
Medchal News: మేడ్చల్ లో జ్యువెలరీ షాప్ రాబరీ కేసును పోలీసులు చేధించారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మీడియాకు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.
Thugs Attacked Jewelry showroom Owner: మేడ్చల్ లోని గొల్డ్ షాప్ దోపిడీ కేసును పోలీసులు చేధించారు. మేడ్చల్ పోలీసులు ఈ దోపిడీకి పాల్పడిన నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నారు. జూన్ 20న జగదాంబ జ్యువెలరీ షాప్ లో బురఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి బంగారు ఆభరణాలను దొచుకున ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. జువెలరీ షాప్ ఓనర్ పై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శేషారాం అనే వ్యక్తి జగదాంబ జువెల్లరి షాప్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం కూడా దుకాణం తెరిచాడు. సరిగ్గా ఉదయం 11:15 గంటల సమయంలో షాపులో కస్టమర్లు లేని సమయం చూసి ఇద్దరు దొంగలు చొరబడ్డారు.
సీసీ కెమెరాల్లో రాబరీ దృశ్యాలు
అందులో ఒక దుండగుడు బురఖా ధరించి రాగా మరో వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. శేషారామ్ను నగదు, గోల్డ్ బ్యాగులో వేయమని కత్తితో బెదిరించి పొడిచారు. ఆపై ఆభరణాలను దోచుకుంటుండగా.. దొంగల నుంచి తప్పించుకుని.. చోర్ చోర్ అంటూ యజమాని శేషారామ్ బయటకు పరుగులు తీశారు. దీంతో భయపడిన దొంగలు వచ్చిన బైక్ పైనే పరారయ్యారు. ఈ సంఘటన అంతా అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డు అయింది. దాడి జరిగిన సమయంలో శేషారాం కుమారుడు కూడా ఆయన వెంటే ఉన్నారు. తను వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని శేషారాంను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్ ఏసీపీ, మేడ్చల్ సీఐ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా షాపులో ఉన్న సీసీకెమెరాలు పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
దొంగతనానికి ముందే రెక్కీ
ఈ కేసు విషయమై మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురి భాగస్వామ్యం ఉందన్నారు. ఈ కేసులో నిందితులు నగరానికి సంబంధించిన వారేనని తేల్చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నజీమ్ అజీజ్ కొటాడియా, షేక్ సోహెల్. వీరు దొంగతనం చేసేందుకు చోరీ చేసిన బైక్ వాడినట్లు ఆయన తెలిపారు. నిందితులు బైకును ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించారని చెప్పారు. చోరీ చేసేందుకు ముందు ఆ ఇద్దరు నిందితులు షాప్ చుట్టూ మూడుసార్లు రెక్కీ నిర్వహించారు. రాబరీకి ముందు సుమారు పదిచోట్ల రెక్కీ నిర్వహించి చివరికి మేడ్చల్లో దోపిడీకి ప్రయత్నించారని డీసీపీ తెలిపారు.
నిందితుడికి నేర చరిత్ర
నిందితులను పట్టుకోవడానికి దాదాపు 200 సీసీ కెమెరాలు జల్లెడ పట్టామన్నారు. బైక్ నెంబర్ ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టామని.. అది చోరీ చేసిన బైక్ గా గుర్తించామన్నారు. ఇటీవల చాదర్ఘాట్ లో జరిగిన చోరీలో కూడా నజీమ్ అజీజ్ కొటాడియా పాత్ర ఉందన్నారు. ముందుగా కోటాడియాను అరెస్ట్ చేశామన్నారు. అతని ద్వారా రాబరీకి సాయం చేసిన షేక్ సోహెల్ అరెస్ట్ చేశామన్నారు. వీరిద్దరికీ జైలులో పరిచయం ఏర్పడింది. ఇద్దరు నిందితులకి సహకరించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని డీసీపీ కోటి రెడ్డి చెప్పుకొచ్చారు.