Maoists Arrest in Mulugu: పోలీసులే టార్గెట్‌గా మందుపాతర, ఆరుగురు మావోయిస్టుల్ని అరెస్ట్ చేసిన ములుగు పోలీసులు
Maoists in Telangana | పోలీసులను టార్గెట్ గా చేసుకుని దాడులకు సిద్ధమై, వారు వెళ్లే మార్గాల్లో మందుపాతర పెట్టి పేల్చే ప్రయత్నం చేసిన మావోయిస్టులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
Mulugu Police Arrests Maoists | వరంగల్: పోలీసుల లక్ష్యంగా మందుపాతర్లు పెడుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఒక డిప్యూటీ దళ కమాండర్ ఇద్దరు దళ సభ్యులు ముగ్గురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు ములుగు ఎస్పీ శబరిష్ తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన సిపిఐ మావోయిస్టులు, మిలీషియా సభ్యులు కలిసి మందుపాతరలు పెడుతున్నారు. కర్రెగుట్టలపై మందుపాతరలు అమర్చుతుండగా మావోయిస్టుల కుట్రలను భగ్నం చేశామని ఎస్పీ శబరిష్ చెప్పారు.
కాలిబాట వెంబడి మందుపాతరలు
ప్రజలను, పోలీసులు అటవీ ప్రాతంలోకి రాకుండా చంపాలనే లక్ష్యంతో కాలిబాట వెంబడి మందుపాతరలు అమరుస్తున్నారని ములుగు ఎస్పీ శబరిష్ తెలిపారు. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా తడపాల గ్రామానికి వెళ్లే కాలిబాట దారిలో మందుపాతరలను అమర్చుతున్నారు. అందులోని కొంతమంది నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు, దళ సభ్యులు మరియు మిలిషియా సభ్యులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు ఇద్దరు మహిళలు, నలుగురు మగవారిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ఒక డిజీబిఎల్ తుపాకీ, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకి టాకీలతో పాటు ప్రేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నమని ఎస్పీ వెల్లడించారు.
ప్రమాదకర ఆయుధాలు, సామాగ్రి స్వాధీనం
అరెస్ట్ అయిన మావోయిస్టుల నుంచి డీబీబీల్ వెపన్ ఒకటి, డీబీ బీల్ మందుగుండు సామగ్రి, కార్డెక్స్ వైర్ 17 మీటర్లు, డిటోనేటర్లు 06, జెలటిన్ స్టిక్స్12, బ్యాటరీలు 20, ప్రెజర్ కుక్కర్ 1, టిఫిన్ బాక్స్1, మ్యాన్‌ప్యాక్‌లు 2, ఎలక్ట్రికల్ వైర్ 18 మీటర్లు, స్విచ్1, కత్తులు 02, ఐరన్ టూల్ 01, అమ్మీటర్-01, ఛార్జర్లు 06, కార్ కీలు 5, టార్చ్ లైట్లు 3, రేడియో 1, గుళికలు 20, పార్టీ సాహిత్యం 3, కిట్ బ్యాగ్ 1, ఐరన్ స్పైక్స్ 20 స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో కారం బుద్రి అలియాస్ రీతా వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్, సోడి కోసి అలియాస్ మోతే పాలేరు ఏరియా కమిటీ సభ్యులు, సోడి విజయ్ అలియాస్ అడుమ జోర వన్ బెటాలియన్ సభ్యులు, కుడం దసురు అలియాస్ గంగ, మిలీషాయా సభ్యులు, సోడి ఉర్ర అలియాస్ గంగయ్య, మిలీషియా సభ్యులు, మడకం భీమా మిలీషాయా సభ్యులు ఉన్నారు.