Viral News: సీఎం నియోజకవర్గంలో దారుణం- మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు, అసలేం జరిగిందంటే..
Kuppam News | సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో సోమవారం దారుణం జరిగింది. భర్త అప్పు తీర్చకపోవడంతో అతడి భార్యను బలవంతంగా చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళలను చెట్టుకు కట్టేసి వేధించారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ అమానుష ఘటన జరిగింది. తల్లిని చెట్టుకు కట్టేస్తుంటే ఆమె పిల్లలు గుక్క పట్టి ఏడవడం ఎందరినో కదిలిస్తోంది. నీ భర్త వచ్చి అప్పు డబ్బులు తిరిగి చెల్లించి, నిన్ను విడిపించుకోవాలి. లేకపోతే నీ సంగతి చూస్తామంటూ ఆమెను సాటి మహిళలు సైతం కర్రతో దాడి చేసి కొట్టారు.
ఆ వివరాలిలా ఉన్నాయి..
కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష భార్యభర్తలు. భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 ఏళ్ల కిందట 80,000 వేలు రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడం, తన వద్ద డబ్బులు లేకపోవడంతో తిమ్మరాయప్ప అప్పును తీర్చలేకపోయాడు. అప్పు తీర్చలేక భార్య శిరీష, బిడ్డలను వదిలేసి గ్రామం నుంచి వెళ్ళిపోయాడు తిమ్మరాయప్ప.
కాగా, భర్త తిమ్మరాయప్ప చేసిన అప్పును కూలీ పనులు చేస్తూ తీరుస్తోంది శిరీష. కూలీ పనులతో వచ్చిన డబ్బులతోనే పిల్లల్ని పోషిస్తోంది. సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చగలరని శిరీషను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మునికన్నప్ప బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటిటో ఆగకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లి వేప చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఇది చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
భర్త ఇటీవల గ్రామాన్ని వదిలివెళ్లడంతో శిరీష సైతం పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. నారాయణపురం స్కూల్లో కుమారుడి టీసీ తీసుకునేందుకు సోమవారం వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతడి భార్య పట్టుకున్నారు. అప్పు ఇచ్చిన మునికన్నప్ప కుటుంబసభ్యులు శిరీషను బలవంతంగా చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలని వేధించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదుతో మునికన్నప్ప కుటుంబసభ్యులపై BNS 341/323/324/506/34/ IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.






















