Hyderabad: గుడిలో పూజారి పాడు పని! అక్షింతలు వేస్తానని ఇనుప రాడ్‌తో చంపేసి - ఈ సంచలన విషయాలు
Malkajgiri Woman Murder: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు అనుముల మురళీ కృష్ణ అలియాస్ కిట్టూ అనే 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
మల్కాజ్ గిరిలో కొద్ది రోజుల క్రితం ఓ మహిళ వద్ద నగలను దొంగిలించి, ఆమెను చంపేసిన కేసును పోలీసులు చేధించారు. మహిళ ఒంటిపై నగలు చూసి ఓ అర్చకుడికి ఆశ పుట్టిందని, అతనే వాటిని దోచుకుపోయాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడ్ని గుర్తించి అతణ్ని శుక్రవారం అరెస్టు చేశారు.
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు అనుముల మురళీ కృష్ణ అలియాస్ కిట్టూ అనే 40 ఏళ్ల వ్యక్తి సహా, నగల వ్యాపారి జోషి నంద కిషోర్ అనే 45 ఏళ్ల వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. వీరిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
స్థానికంగా ఉన్న విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీకి చెందిన జి.ఉమాదేవి అనే 57 ఏళ్ల మహిళ సోమవారం సాయంత్రం బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఇంకా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త జీవీఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం వెతుకుతున్న పోలీసులకు గురువారం ఉదయం కాలనీ సమీపంలోనే గుడి దగ్గర ఓ శవం కనిపించింది. అది కనిపించకుండా పోయిన మహిళదే అని పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపై నగలు లేకపోవడంతో వాటి కోసమే హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా భావించి ఆ కోణంలోనే విచారణ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అదే కాలనీలో వినాయకస్వామి గుడిలో అర్చకుడు మురళీ కృష్ణ అనే ప్రకాశం జిల్లా వ్యక్తి అర్చకుడిగా పని చేస్తున్నాడు. అతను రెండేళ్లుగా తరచూ నగలు వేసుకొనే ఉమాదేవిని గమనిస్తూ ఉన్నాడు. రోజూ సాయంత్రం ఒకే సమయానికి ఆమె గుడికి వెళ్లి వస్తూ ఉంటుంది. మరోవైపు, విలాసాలకు పోయిన మురళీకృష్ణకు అప్పులు బాగా పెరిగిపోయాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉమాదేవిని చంపి ఆమె ఒంటిపై నగలు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు.
రోజులాగే ఆమె గత సోమవారం సాయంత్రం 6.30కు ఆలయానికి వచ్చి పూజలు చేసి వెళ్తుండగా అక్షింతలు వేస్తా.. ఆగమని ఇనుప రాడ్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. చనిపోయే వరకూ కొట్టి ఒంటిపై నగలన్నీ గబగబా తీసుకున్నాడు. మృతదేహాన్ని విగ్రహం పక్కనే ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి మూతపెట్టాడు. రక్తపు మరకలు కనబడకుండా గుడిలో నీళ్లతో కడిగాడు. అదే రోజు రాత్రి బంగారపు షాపులో నగలు అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు.
రెండ్రోజులుగా అందులోనే శవం
డ్రమ్ములో ఉంచిన మృత దేహం నుంచి దుర్వాసన రావటంతో నిందితుడు అప్రమత్తం అయ్యాడు. బుధవారం రాత్రి ఎవరూ చూడకుండా ఆలయం వెనుక భాగంలో చెట్ల మధ్య మృతదేహాన్ని పడేశాడు. పోలీసులు చుట్టు పక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఉమాదేవి ఆలయానికి వచ్చి వెనక్కి వెళ్లలేదని, ఆమె తన చెప్పులను ఆలయంలోనే వదిలి వెళ్లిందని గుర్తించారు. అర్చకుడి ప్రవర్తన అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తానే హత్య చేసినట్టు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.