Jubileehills Accident : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్, కారులో ఎమ్మెల్యే కుమారుడు
Jubileehills Accident : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం మిస్టరీ విడింది. కారు ప్రమాదం జరిగినప్పుడు బోధన్ ఎమ్మెల్యే కుమారుడు కారులో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు.
Jubileehills Accident : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)పై రోజురోజుకీ అనుమానాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) నగరంలో లక్షల్లో సీసీ కెమెరాలు(CC Camera) ఉన్నాయని, నిరంతర నిఘా ఉంటుందని పోలీసు బాస్ లు పదే పదే చెబుతుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ప్రమాదం జరిగితే సీసీ కెమెరాలు లేవని పోలీసులు చెప్తుండడం పలు అనుమానాలు తావిస్తోంది. ఆ కారులో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎమ్మెల్యే కుమారుడిని తప్పించేందుకు మరో యువకుడు డ్రైవ్ చేసినట్లు ఒప్పుకున్నాడా? ఒప్పించారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి.
కారులో ఎమ్మెల్యే కుమారుడు
జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి ప్రశ్నించారు. సంతోష్ నగర్‌కు చెందిన అబ్నాన్, మాజిద్‌లను పోలీసులు విచారించారు. ప్రమాద సమయంలో వీరిద్దరితో పాటు కారులో బోధన్ ఎమ్మెల్యే(Bodhan Mla) షకీల్ కుమారుడు రాహిల్ కూడా ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో అతడిని నిందితుడిగా పోలీసులు చేర్చారు. కుమారుడిని తప్పించేందుకు ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కారు తన బంధువులదని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు షకీల్ కుమారుడు కారులో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేస్తారా అనే విషయంపై ఇంకా పోలీసుల నుంచి వివరాలు తెలియాల్సి ఉంది.
కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారా?
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాల లేకపోవడంతో విచారణకు ఆటంకం కలుగుతోందని పోలీసులు అంటున్నారు. ఎమ్మెల్యే కుమారుడు రాహిల్ ఎక్కడున్నారనే వివరాలు కూడా వెల్లడించలేదు. ఈ నెల 17వ తేదీ రాత్రి 7.30గంటలకు యువకులు గచ్చిబౌలిలో మెక్‌డొనాల్డ్‌లోకి వెళ్లి, అక్కడ్నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వెళ్లేందుకు కారులో బయలుదేరారు. రాత్రి 8 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద డివైడర్ దాటుతున్న మహిళలను ఢీకొట్టారు. ముగ్గురు మహిళలను కారు ఢీకొట్టగా రెండున్నర నెలల వయసున్న చిన్నారి మృతిచెందింది. మగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ మహిళలు, వారి కుటుంబ సభ్యులు సడన్ గా కనిపించకపోవడం, ఆ తర్వాత వారి సొంత రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లి పోయారని తెలియడంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులను బెదరించారా? డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకున్నారా ? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read : Kurnool Jail : కర్నూలు జిల్లా జైలు నుంచి ఒకే ఖైదీ వారంలో రెండు సార్లు పరారీ, ట్విస్ట్ ఏంటంటే?