CI Arrest : మొన్న డ్రగ్స్ కేసులో విచారణాధికారి - ఇప్పుడు లాడ్జీలో అడ్డంగా దొరికాడు ! ఈ సీఐ మామూలోడు కాదుగా
బంజారాహిల్స్ డ్రగ్స్ కేసును విచారించిన సీఐ నాగేశ్వరరావు వేరే మహిళతో లాడ్జిలో ఉండగా పోలీసులకు చిక్కారు. మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
CI Arrest : అది వనస్థలిపురం పోలీస్ స్టేషన్. వర్షంలో తడుస్తూనే ఓ వ్యక్తి హడావుడిగా లోపలికి వచ్చాడు. అతనిలో ఆవేశం కనిపిస్తోంది. ఆవేదన, ఆక్రోశం కూడా ఉంది. అతని పరిస్థితి చూసి రిసెప్షన్‌లో పోలీస్ కుర్చీలో కుర్చీబెట్టి వివరాలు కనుక్కున్నారు. ఆయన చెప్పిన వివరాలు విని ఆ రిసెప్షన్లో ఉన్న పోలీసుకు చెమటలు పట్టలేదు కానీ.. క్లిష్టమైన కేసే అనిపించింది. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు క్షణం ఆలోచించలేదు. అతని చెప్పిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడమే కాకుండా తక్షణం అతన్ని తీసుకుని బయలుదేరారు.
ఇతర వ్యక్తి భార్యతో లాడ్జిలో ఉండగా దొరికిన సీఐ నాగేశ్వరరావు !
వనస్థలిపురం పరిధిలోని ఓ లాడ్జీకి వెళ్లారు. ఓ గది తలుపు కొట్టి అందులో ఉన్న ఓ ఆడ, మగ జంటలో మగ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించారు. వారు భార్యభర్తలు కాదు. కానీ వారు వ్యభిచారం చేయడం లేదు. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నారు. అయినా ఎందుకు అరెస్ట్ చేశారంటే.. ఆ మహిళ భర్త ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మామూలుగా అయితే ఈ కేసు గురించి ఇంతగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ అక్కడ లాడ్జిలో దొరికిన వ్యక్తి ప్రముఖుడు కావడంతోనే ఇలా చెప్పుకోవాల్సి వస్తోంది. అతను ఎవరంటే పోలీసు అధికారే. మారేడ్ పల్లి సీఐగా ఉన్నారు. ఆయన పేరు నాగేశ్వరరావు.
బంజారాహిల్స్ డ్రగ్స్ కేసును విచారించిన సీఐ
ఇటీవల బంజారాహిల్స్‌లో పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసులో అప్పట్లో బంజారాహిల్స్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో ఓ టాస్క్ ఫోర్స్ సీఐకు బాధ్యతలుఇచ్చారు. ఆ సీఐనే ఈ నాగేశ్వరరావు. బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి విచారణ చేసిన అధికారిగా ఆయనకు పేరుంది. అయితే ఆ కేసులో చివరికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు.
అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
తమ డిపార్టుమెంట్‌కు చెందిన ఉన్నతాధికారి అయినా సరే పోలీసులు వచ్చిన ఫిర్యాదుపై సీరియస్‌గా స్పందించారు. కొన్నాళ్లుగా ఆ మహిళతో నాగేశ్వరరావు వివాహేతర బంధం కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై ఆ మహిళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే నాగేశ్వరరావు సీఐ కావడంతో మహిళను తరచూ లాడ్జిలకు పిలిపించుకుంటున్నారు.ఇలా పిలించుకున్న విషయం తెలిసిన భర్త చివరికి పోలీసులకే ఫిర్యాదు చేసి పట్టించారు. రాత్రి ఆ సీఐని అదుపులోకి తీసుకున్న వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. సిఐ పై అత్యాచారయత్నం, ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశారు.