Red Sandal: పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీసులకు ఎలా దొరికేశారో తెలుసా?
పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా చేద్దాం అనుకున్నాడో ఏమో గానీ, ఎట్టకేలకు పోలీసులు ఆ స్మగ్లర్ల ఆట కట్టించారు.
ఎర్ర బంగారంగా పిలిచే ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడికి ఏడాది పొడవునా కూబింగ్ లు సాగుస్తుంటారు అటవీ శాఖ అధికారులు. జిల్లాకు నాలుగు వైపులా ప్రత్యేక బృందాలతో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరి వాహానాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. ఎర్రచందనం స్మగ్లర్స్ పై ప్రత్యేక నిఘా ఉంచినా, అక్రమ రవాణాను ఏం మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కానీ పోలీసులు ఎత్తులకు పై ఎత్తులతో ఎర్రచందన స్మగ్లర్స్ రోజుకొక్క ప్లాన్ తో పోలీసులను బురిడి కొట్టించి మరి బార్డర్ దాటిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. స్మగ్లర్స్ పై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించినా ఏ మాత్రం లెక్క చేయకుండా శేషాచల అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం దుంగలను బహిరంగంగానే వాహనాల్లో రాష్ట్రాలను దాటించేస్తున్నారు.
పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా చేద్దాం అనుకున్నాడో ఏమో గానీ, ఎట్టకేలకు పోలీసులు ఆ స్మగ్లర్ల ఆట కట్టించారు. పైన టమోటాలను, కింద ఎర్ర చందనం దుంగల కోసం ప్రత్యేకంగా లగేజీ ఆటోను తయారు చేసుకున్నారు స్మగ్లర్లు. పక్కా సమాచారంతో పోలీసులు ఆటోతో సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్ళితే. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, మూలపల్లి గ్రామంకు చేందిన ఓ స్మగ్లర్ పుష్ప సినిమా చూసి ప్రేరణ పొందాడేమో గానీ, ఎర్రచందనం పక్కా ప్లాన్ రూపొందించాడు. అనుకున్న విధంగానే మూలపల్లె అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు తెలిసిన వారి చేత తన వద్ద ఉన్న లగేజీ వాహనంకు ప్రత్యేకంగా సెల్ఫ్ ఏర్పాటు చేసుకుని దుంగలు రవాణాకు సిద్ద పడ్డాడు. ఎవరికి అనుమానం రాకుండా లగేజీ వాహనంలోని పై భాగంలో టమోటా ట్రేలను ఉంచాడు. దానికి క్రింద భాగంలో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు ఆటోకు మార్పులు చేసిన భాగంలో ఎర్రచందనం దుంగలను ఉంచాడు. అయితే మూలపల్లె అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి సంచరిస్తున్నట్లు స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అటవీ ప్రాంతంను జల్లెడ పట్టారు.
కానీ పోలీసులకు ఆ స్మగ్లర్ ఎక్కడా తారస పడలేదు. దీంతో గ్రామానికి నలువైపుల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడమే కాకుండా వాహనాకను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి వాహనంతో పాటు తప్పించుకునేందుకు ఆ స్మగ్లర్ ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన పోలీసులు స్మగ్లర్ వాహనంను వెంబడించారు. పోలీసుల వాహనంను చూసిన స్మగ్లర్స్ మరింత వేగం పెంచాడు. దాదాపు ఐదు కిలోమీటర్ల వరకూ పోలీసులు లగేజీ వాహనాన్ని వెంబడించారు. అయితే లగేజీ వాహనం అదుపు తప్పి ప్రక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్ళింది. దీంతో వాహనంను క్షుణ్ణంగా తనీఖి చేయగా. 14 ఎర్రచందనం దుంగల స్వాధీనం చేసుకుని, స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. లగేజీ వాహనంతో సహా దుంగలను చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. స్మగ్లర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.