Anantapur: వీరి వద్ద దొంగల తయారీ జరుగును, ఇంటికి తాళం వేసి ఉంటే ఇక అంతే.. కీలక వివరాలు చెప్పిన ఎస్పీ
ఆరుగురు సభ్యుల ముఠాను మడకశిర సీఐ అరెస్ట్ చేసి భారీ స్థాయిలో వారి నుంచి సొత్తు రికవరీ చేసినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.
తాళం వేసి వెళ్లిన ఇల్లే కాదు.. ఒంటరిగా ఉన్న మహిళలపై పక్కా స్కెచ్ వేసి దొంగతనాలు చేయడం వారికి అలవాటు. ఇక్కడే కాదు పక్కనే తెలంగాణ, కర్ణాటకలో కూడా వారు రికార్డు స్థాయిలో దొంగతనాలు చేశారు. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. అందరూ కూడా హిందూపురం వాసులే. కానీ పేరు మోసిన దొంగలు కావడం, స్థానికంగా చిక్కకుండా తప్పించుకోవడంలో అందరూ కూడా దిట్టలే. ఇటీవల కాలంలో మడకశిరలో ఒక దొంగతనం జరిగింది. ఆ కేసులో అనుమానితులు కూడా వీరే కావడంతో పోలీసులు సీరియస్ గా రంగంలోకి దిగారు. వారిపై నిఘా ఉంచి.. పక్కాగా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ చేశారు.
నిందితుల బంధువులను అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో పోలీసులకు దొరికిపోయారు నిందితులు. ఆరుగురు సభ్యుల ముఠాను మడకశిర సీఐ అరెస్ట్ చేసి భారీ స్థాయిలో వారి నుంచి సొత్తు రికవరీ చేసినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. 955 గ్రాముల బంగారం, రెండు కేజీల వెండి ఆభరణాలతో సహా, మూడు టూవీ లర్లను రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.వీటి విలువ రూ.50 లక్షలు అని వెల్లడించారు. ప్రస్తుతం చోరీ చేసిన కేసుల వివరాలను ఆయన తెలిపారు. మడకశిర సీఐ పరిధిలో పది కేసులు, హిందూపురం పరిదిలో ఆరు కేసులు, కియా పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక కేసును రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కీలకమైన ముఠాను అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర వహించిన మడకశిర సీఐ శ్రీరాంను, సిబ్బందిని ఆయన ప్రశంసించారు.
ఈ ముఠాలో కీలకమైన సభ్యుడు షేక్ అలియాజ్ అలియాస్ ఇల్లు అని ఈ నిందితుడు పేరు మోసిన దొంగ అని ఎస్పీ చెప్పారు. ఇతను ఎరికల దుర్గ అనే దొంగకు సహచరుడని చెప్పారు. ఇతనితో పాటు కావడి నాగేంద్ర కీలకమైన సభ్యుడిగా పోలీసులు గుర్తించారు. నాగేంద్ర బావ రామాంజినేయులతో పాటు, బలిజ బాలాజీ, ఎరికల సాకే రామాంజినేయులు, షేక్ ఇమ్రాన్, షేక్ నిజాం లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.వీరందరిది కూడా హిందూపురం అని తెలిపారు. వీరు ప్రదానంగా 18 నుంచి 25లోపు పిల్లలను దొంగలుగా మార్చి.. వారిని ప్రోత్సహిస్తుంటారన్నారు. అలాగే వీరు దొంగలించిన బంగారంను కూడా సాకే రామాంజినేయులు చెల్లెళ్లు అయిన శారద, దీప, మరదలు గంగమ్మ వీరంతా కలిసి దొంగలించిన సొమ్మును అమ్మేయడంలో కీలకపాత్ర వహించినట్లు గుర్తించామని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు ఎస్పీ ఫక్కీరప్ప.
ఎవరైనా సరే ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఎక్కడికైనా వెళ్లేముందు యాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. దాంతో ఆ ఇల్లు పోలీస్ కంట్రోల్‌లో ఉంటుందని, దీన్ని జిల్లా వాసులు వినియోగించుకోవాలని ఎస్పీ అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ యాప్ గురించి అందరికి వివరించామని అన్నారు.