Zomato: జొమాటో ఫుడ్ మరింత కాస్ట్‌లీ గురూ - ఆర్డర్‌పై రూ.5 బాదుడు
జొమాటో ప్రతి సంవత్సరం 85 నుంచి 90 కోట్ల ఆర్డర్లను సర్వ్ చేస్తుంది.
Zomato Hikes Platform Fee: ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని ఫుడ్ డెలివరీ చేసే జొమాటో, రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి.. ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచడం. రెండోది.. ఒక సర్వీస్‌ను నిలిపేయడం. మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించకముందే జొమాటో ఈ నిర్ణయాలు తీసుకోవడం విశేషం.
25 శాతం పెరిగిన ఫ్లాట్‌ఫామ్ ఫీజ్
ఈ ఫుడ్ డెలివెరీ కంపెనీ తన ప్లాట్‌ఫామ్ ఫీజును మరోమారు పెంచింది. ఈ రేటును 25 శాతం పెంచి ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ఛార్జీని 5 రూపాయలకు చేర్చింది. జొమాటో, తన ప్లాట్‌ఫామ్ రుసుమును 2023 ఆగస్టులో 2 రూపాయల నుంచి ప్రారంభించింది. కొన్ని నెలల క్రితం వరకు నష్టాల్లో కొట్టుమిట్టాడిన ఈ కంపెనీ, ఆదాయాన్ని పెంచుకుని లాభాలు ఆర్జించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ప్లాట్‌ఫామ్ ఫీజును 3 రూపాయలకు పెంచిన కంపెనీ, ఈ ఏడాది జనవరి 01న దానిని 4 రూపాయలుగా మార్చింది. ఇప్పుడు 5 రూపాయలుగా నిర్ణయించింది. ఇప్పటి నుంచి జొమాటోలో పెట్టే ప్రతి ఆర్డర్‌పై కస్టమర్లు రూ.5 చొప్పున చెల్లించాలి. పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజుల కారణంగా డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ కూడా పెరుగుతుంది. జనవరిలో ఫీజు పెంపు తర్వాత జొమాటో షేర్లు పెరిగాయి.
రూ.90 కోట్ల వరకు అదనపు రాబడి
జొమాటో ప్రతి సంవత్సరం 85 నుంచి 90 కోట్ల ఆర్డర్లను సర్వ్ చేస్తుంది. ఒక్క రూపాయి ఫీజు పెంచడం వల్ల కంపెనీకి అదనంగా రూ.85 కోట్ల నుంచి రూ.90 కోట్ల ఆదాయం వస్తుంది. అంతేకాదు, కంపెనీ ఎబిటా (EBITDA) కూడా దాదాపు 5 శాతం పెరుగుతుంది. ప్రస్తుతానికి, పెరిగిన ఫీజును కొన్ని నగరాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు.
ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ రద్దు
జొమాటో తీసుకున్న రెండో నిర్ణయానికి వస్తే.. ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్‌ను నిలిపివేసింది. ఈ సర్వీస్ కింద, ఇప్పటి వరకు, పెద్ద నగరాల్లోని టాప్ రెస్టారెంట్ల నుంచి ఇతర నగరాలు, పట్టణాలు, ప్రాంతాలకు జొమాటో సిబ్బంది ఆహారాన్ని డెలివరీ చేసే వాళ్లు. కంపెనీ తాజా నిర్ణయం వల్ల, ఇప్పుడు జొమాటో యాప్‌లో లెజెండ్స్ ట్యాబ్ పని చేయడం లేదు.
జొమాటో షేర్లు జంప్
2023 డిసెంబర్ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ కాలం) జొమాటో ఆదాయం 30 శాతం పెరిగి రూ.2,025 కోట్లకు చేరుకుంది. అనుబంధ కంపెనీ బ్లింకిట్ ఆదాయం కూడా రెండింతలు పెరిగి రూ.644 కోట్లుగా నమోదైంది. ఇటీవలి కాలంలో జొమాటో షేర్లు వేగంగా పెరగడానికి ఇదే కారణం. ఈ ఫుడ్ డెలివెరీ కంపెనీ ఏడాది క్రితం రూ.347 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఆ నష్టాల నుంచి గట్టెక్కి, డిసెంబర్ త్రైమాసికంలో రూ.138 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది.
ఈ రోజు (సోమవారం, 22 ఏప్రిల్ 2024) ఉదయం 10.55 గంటల సమయానికి జొమాటో షేర్లు 1.64% పెరిగి రూ.192.30 వద్ద కదులుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: డేటా సెంటర్ బిజినెస్‌లో అదానీ దూకుడు - తుది దశలో రూ.8000 కోట్ల డీల్