India Economic Growth: మరో షాక్! జీడీపీ వృద్ధిరేటు కట్ చేసిన ప్రపంచ బ్యాంక్
India Economic Growth: ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాను 7.5 శాతానికి తగ్గిస్తున్నామని ప్రపంచ బ్యాంకు (World Bank) తెలిపింది.
India Economic Growth: ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు అంచనాను 7.5 శాతానికి తగ్గిస్తున్నామని ప్రపంచ బ్యాంకు (World Bank) తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులో ఆటంకాలు, ప్రాతీయ ఆర్థిక ఆందోళనలు రికవరీని ఆలస్యం ఇందుకు కారణాలని వివరించింది.
2022-23 ఆర్థిక ఏడాదిలో భారత జీడీపీ అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో అంచనాను 8.7 నుంచి 8 శాతానికి తగ్గించింది. ఇప్పుడు 7.5 శాతంగా అంచనా వేస్తోంది. కాగా 2021-22 ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతంగా ఉండటం గమనార్హం.
'ద్రవ్యోల్బణం పెరుగుతోంది. సరఫరా గొలుసులో ఆటంకాలు ఉన్నాయి. ప్రాంతీయ ఆర్థిక ఆందోళనతో కరోనా తర్వాత రికవరీ ఆలస్యం అవుతోంది. అందుకే 2022/23 ఆర్థిక ఏడాదిలో భారత జీడీపీ అంచనాను 7.5 శాతానికి తగ్గిస్తున్నాం' అని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. '2023/24లో వృద్ధిరేటు వేగం మందగించి 7.1 శాతానికి తగ్గొచ్చు' అని వెల్లడించింది.
ఏప్రిల్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.08 శాతానికి పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ఠమైన 7.79 శాతానికి చేరుకుంది. వంట నూనెలు, కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో రిజర్వు బ్యాంకు రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
భారత్ 2022 ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటును 4.1 శాతంగా అంచనా వేసింది. దాంతో వార్షిక వృద్ధిరేటు 8.7 శాతంగా ఉంటుందని భావించింది. అయితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి-మార్చిలో వృద్ధిరేటు మందగించి 5.4 శాతానికే పరిమితమైంది.
గత నెల్లో ఫిచ్, ఐఎంఎఫ్ వంటి రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 2022 క్యాలెండర్ ఇయర్‌లో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ జీడీపీ అంచనాను 9.1 నుంచి 8.8 శాతానికి తగ్గించింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ 2022-23కు 7.8 నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఫిచ్ 10.3 నుంచి 8.5 శాతానికి తగ్గించింది. ఇక ఐఎంఎఫ్ 9 నుంచి 8.2కు కట్ చేసింది.
World Bank cuts India's economic growth forecast to 7.5 pc for FY23
— Press Trust of India (@PTI_News) June 7, 2022