Tim Cook: టిమ్ కుక్ జీతం, ఆస్తుల విలువ, ఏం చదువుకున్నాడో తెలుసా?
కంపెనీ వ్యాపార పరిస్థితులు బాగోలేకపోవడంతో ఈ ఏడాది తన జీతభత్యాలను సగానికి సగం తగ్గించుకున్నారు టిమ్ కుక్.
Tim Cook Net Worth: ఐఫోన్లను తయారు చేసే ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook), భారతదేశ పర్యటనలో భాగంగా, భారతదేశంలో మొట్టమొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ను మంగళవారం (18 ఏప్రిల్ 2023) ప్రారంభించారు. గురువారం (20 ఏప్రిల్ 2023) నాడు దిల్లీలో రెండో రిటైల్ స్టోర్ కూడా ప్రారంభించారు. ముంబైలో.. ఆపిల్ బ్రాండ్ రిటైల్ స్టోర్‌ను కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ప్రారంభించగా, దిల్లీలో.. సాకేత్ సిటీ వాక్ మాల్‌లో స్టోర్‌ను లాంచ్ చేశారు.
విశేషం ఏంటంటే.. దిల్లీ స్టోర్ విస్తీర్ణం ముంబై స్టోర్ విస్తీర్ణంలో సగం కూడా ఉండదు. అయినా రెండు స్టోర్‌ల అద్దె దాదాపు ఒకే విధంగా ఉంటుంది. దిల్లీ స్టోర్ విస్తీర్ణం 8,417.83 చదరపు అడుగులు కాగా, ముంబై స్టోర్ విస్తీర్ణం 20,000 చదరపు అడుగులు. దిల్లీ దుకాణం అద్దె నెలకు రూ. 40 లక్షలు కాగా, ముంబై దుకాణం అద్దె నెలకు రూ. 42 లక్షలు. ఆపిల్ దిల్లీ దుకాణంలో 70 మంది ఉద్యోగులు ఉన్నారు, అందులో సగానికి పైగా మహిళలు. ముంబై స్టోర్‌లో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా ఉద్యోగుల సంఖ్యే ఎక్కువగా ఉంది.
దిల్లీలో ఆపిల్ స్టోర్ ప్రారంభానికి ఒక రోజు ముందు, ప్రధాని నరేంద్ర మోదీతో టిమ్ కుక్ సమావేశం అయ్యారు. భారత్‌లో రెట్టింపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మరిన్ని పెట్టుబడులు పెడతామని కుక్ హామీ ఇచ్చారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను కూడా టిమ్ కుక్ కలిశారు. ముంబై స్టోర్ ఓపెనింగ్‌కు ముందు, ముకేష్ అంబానీ ఇంటికి వెళ్లి పలకరించి వచ్చారు. మాధురీ దీక్షిత్, అర్మాన్ మాలిక్, అనిల్ కుంబ్లే వంటి ప్రముఖులను కూడా కలిశారు.
టిమ్ కుక్ సంపద ఎంత?
ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం... 62 ఏళ్ల టిమ్ కుక్ సంపద 1.8 బిలియన్ డాలర్లు. దీనిని మన రూపాయిల్లోకి మార్చి చెప్పుకుంటే 14 వేల కోట్ల రూపాయలు. 2022 సంవత్సరంలో, కుక్ 99.4 మిలియన్ డాలర్లు లేదా రూ. 815 కోట్ల మొత్తాన్ని అందుకున్నారు, ఇందులో 3 మిలియన్ డాలర్ల జీతం కూడా కలిసి ఉంది. ఇది కాకుండా, 83 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్ & బోనస్ తీసుకున్నారు. ఇది, 2021లో వచ్చిన మొత్తం కంటే కొద్దిగా ఎక్కువ. 2021లో, టిమ్ కుక్ 98.7 మిలియన్ డాలర్లను డ్రా చేశారు.
టిమ్ కుక్ ఒక రోజు సంపాదన ఎంత?
కంపెనీ వ్యాపార పరిస్థితులు బాగోలేకపోవడంతో ఈ ఏడాది (2023) తన జీతభత్యాలను సగానికి సగం తగ్గించుకున్నారు టిమ్ కుక్. ఆదాయానికి ఇంత భారీ కోత విధించినప్పటికీ, మొత్తం పరిహారంగా 49 మిలియన్ డాలర్లు లేదా రూ. 401 కోట్లు వస్తాయి. ఈ ప్రకారం, ఐఫోన్ మేకింగ్ కంపెనీ సీఈవో రోజువారీ సంపాదన రూ. 1.10 కోట్లకు పైగానే ఉంది. టిమ్ కుక్ 2026లో పదవీ విరమణ చేయనున్నారు.
టిమ్ కుక్ ఏం చదువుకున్నారు?
టిమ్ కుక్ అమెరికాలోని ఆగ్నేయ ప్రాంతంలోని అలబామా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి షిప్‌యార్డ్ కార్మికుడు, తల్లి ఫార్మసీలో పని చేశారు. 1988లో, డ్యూక్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నడిచే ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పట్టాను కుక్ సంపాదించారు. 2011లో యాపిల్ సీఈవోగా నియమితులయ్యారు.