Insurance Amendment Bill: బీమా సవరణ బిల్లుతో ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
FDIs in Insurance Sector: బీమా సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌తో పాటు పార్లమెంట్ ఆమోదం లభించి చట్టంగా మారితే, బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐకి కొత్త మార్గం తెరుచుకుంటుంది.

Insurance Sector In India: బీమా సవరణ బిల్లుపై భారత ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకునే వాతావరణం కనిపిస్తోంది. బీమా సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఆ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ( 100% Foreign Direct Investments) మార్గం తెరుచుకుంటుంది. దీని అర్థం.. విదేశీ పెట్టుబడిదారులు భారతీయ బీమా కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయవచ్చు లేదా ఏదైనా విదేశీ బీమా కంపెనీ భారతీయ వాటాదారు లేకుండానే నేరుగా భారతదేశంలో బీమా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు & కొనసాగించవచ్చు. ఇప్పటికే భారతీయ బీమా కంపెనీల్లో కొంతమేర పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు, మిగిలిన వాటాలను కూడా కొని ఆ బీమా కంపెనీలను పూర్తిగా కైవసం చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన & లిస్ట్ కాని బీమా కంపెనీలకు కూడా ఇది చాలా లబ్ధి చేకూరుస్తుంది.
కాంపోజిట్ బీమా లైసెన్స్ పొందడం సులువు
బీమా సవరణ బిల్లును చట్టంగా అమలులోకి వచ్చిన తర్వాత, కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ (Composite Insurance Licence) కూడా అందుబాటులోకి వస్తుంది. దీని వల్ల అన్ని బీమా కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. జీవిత బీమా కంపెనీలు ఆరోగ్య బీమా వ్యాపారంలోకి ప్రవేశించగలవు. అదే విధంగా, ఆరోగ్య బీమా కంపెనీలు జీవిత బీమా వ్యాపారం చేయగలవు.
కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అంటే ఏంటి?
కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అనేది.. ఒక బీమా సంస్థ జీవిత బీమా, ఆరోగ్య బీమా, నాన్-లైఫ్ బీమాను అందించడానికి అనుమతించే సింగిల్ లైసెన్స్. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, 2024లో, బీమా రంగంలో కాంపోజిట్ లైసెన్స్‌ను ప్రతిపాదించింది. బీమా రంగానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని 100%కి పెంచాలని కూడా ఆ ప్రతిపాదనలో ఉంది.
కాంపోజిట్ లైసెన్స్ ప్రయోజనాలు ఏంటి?
- బీమా సంస్థల కార్యకలాపాలను ఒకే వేదిక పైకి తీసుకొస్తాయి.
- బీమా సంస్థలు ఒకే లైసెన్స్ కింద వివిధ రకాల బీమా ఉత్పత్తులను అందించగలవు.
బీమా కంపెనీని బీమాయేతర కంపెనీలో విలీనం
ఈ బీమా సవరణ బిల్లు, బీమా కంపెనీని బీమాయేతర కంపెనీలో విలీనం చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా తొలగిస్తుంది. దీన్నుంచి మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MAX Financial Services Ltd) ఎక్కువ ప్రయోజనం పొందుతుందని భావిస్తున్నారు. మాక్స్ గ్రూప్‌లోని బీమా & బీమాయేతర కంపెనీల మధ్య విలీనం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఒక బీమా కంపెనీ విలీనం మరొక బీమా కంపెనీలో మాత్రమే జరుగుతుంది.
ప్రస్తుతం, ఏజెంట్లు జీవిత బీమా లేదా జనరల్ ఇన్సూరెన్స్ లేదా ఆరోగ్య బీమా కంపెనీతో మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకోగలరు. భవిష్యత్తులో ఈ అడ్డంకి కూడా తొలగిపోతుంది. ఇది LIC, SBI లైఫ్ వంటి ఇతర కంపెనీలకు పెద్ద ప్రతికూలత అవుతుంది. అయితే, ప్రైవేట్ జీవిత బీమా కంపెనీలకు సానుకూలంగా ఉంటుంది. అన్ని బీమా కంపెనీల పెట్టుబడి నిబంధనల్లోనూ మార్పులు ఉండవచ్చు, ఇది LIC వంటి కంపెనీలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ నగల కంపెనీ షేర్లు ఆల్ టైమ్ హై నుంచి పాతాళానికి పతనం - నిఘా పెంచిన స్టాక్ ఎక్సేంజీలు





















