Reliance Capital Auction: రిలయన్స్ క్యాపిటల్ కొత్త యజమాని ఖరారు, అనిల్ అంబానీ పేరు మాయం!
అహ్మదాబాద్‌కు చెందిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 8,640 కోట్ల బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
Reliance Capital Auction: అనిల్ అంబానీకి (Anil Ambani) చెందిన రిలయన్స్ క్యాపిటల్, టోరెంట్ గ్రూప్ గూటిలోకి చేరడం దాదాపుగా ఖరారైంది. ఈ కంపెనీ కోసం నిర్వహించిన వేలంలో అతి పెద్ద బిడ్డర్‌గా టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ నిలిచిందన్న సమాచారం బయటకు వచ్చింది.
భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (Reliance Capital) రిజల్యూషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం వేలం నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని (NBFC) కొనుగోలు చేసేందుకు, అహ్మదాబాద్‌కు చెందిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (Torrent Investments) రూ. 8,640 కోట్ల బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
హిందూజా గ్రూప్ రెండో అతి పెద్ద బిడ్డర్
రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేయడానికి హిందూజా గ్రూప్ (Hinduja Group) కూడా వేలంలో పాల్గొని, రూ. 8150 కోట్లను ఆఫర్ చేసింది. ఇంత కంటే ఎక్కువ రేటను టోరెంట్ గ్రూప్ కోట్ చేయడంతో, ఈ బిడ్ ఓడిపోయింది. వాస్తవానికి, తొలి రౌండ్‌లో హిందూజా గ్రూపే ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసింది. అయితే, తొలి రౌండ్ మొత్తం కంటే రెండు, మూడు రౌండ్లలో మరింత అధిక మొత్తాన్ని ఆఫర్ చేసిన టోరెంట్ గ్రూప్, ఆక్షన్ విన్నర్‌గా నిలిచింది.
వేలంలో పాల్గొనడానికి మొదట ఆసక్తి చూపి, రూ. 6,800 కోట్ల ప్రైస్‌ను కోట్ చేసిన ఓక్‌ట్రీ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (Oaktree Capital Management), వేలం తర్వాతి దశల్లో పాల్గొనలేదని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కాస్మియా-పిరామల్ ( Cosmia Piramal tie-up ) గూప్ ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలిగింది.
వేలం కోసం కనిష్ట ధర పరిమితిని రూ. 6,500 కోట్లుగా కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (CoC) నిర్ణయించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆర్డర్ ప్రకారం, జనవరి 31, 2023 నాటికి రిలయన్స్ క్యాపిటల్ రిజల్యూషన్ ప్రక్రియను విన్నింగ్ బిడ్డర్ పూర్తి చేయాలి.
టోరెంట్ గ్రూప్‌నకు ఏంటి ప్రయోజనం?
ఈ వేలంలో గెలవడం వల్ల ఆర్థిక సేవల రంగంలో టోరెంట్ గ్రూప్‌కి మంచి ప్రయోజనం ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు ద్వారా, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో పూర్తిగా 100 శాతం వాటా టోరెంట్ గ్రూప్ పరమవుతుంది. ఇతర ఆస్తులతో పాటు రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 51 శాతం వాటా కూడా దక్కుతుంది.
టోరెంట్ గ్రూప్ గురించి..
రూ. 21,000 కోట్ల విలువైన టొరెంట్ గ్రూప్, 56 ఏళ్ల సమీర్ మెహతా నాయకత్వంలో నడుస్తోంది. ఆయన మార్గదర్శకత్వంలో ఈ గ్రూప్ అనేక వ్యూహాత్మక కొనుగోళ్లు చేపట్టి కొత్త రంగాల్లోకి ప్రవేశించింది. పవర్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. టోరెంట్ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ భారతదేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఒకటి. ఇప్పుడు రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు ద్వారా, ఆర్థిక సేవల రంగంలోకి కూడా ఈ గ్రూప్ అడుగు పెట్టింది.