TCS Q4 Results: అంచనాలు మిస్ చేసిన టీసీఎస్ - లాభం ₹11,392 కోట్లు, డివిడెండ్ ₹24
జనవరి-మార్చి త్రైమాసికంలో TCS ఆదాయం 16.9 శాతం పెరిగింది.
TCS Q4 Results: దేశంలో అతి పెద్ద ఐటీ సేవల ఎగుమతుల కంపెనీ టీసీఎస్ (Tata Consultancy Services), 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి కాలం) ఫలితాలను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో ఈ ఐటీ కంపెనీ నికర లాభం 14.8 శాతం పెరిగి రూ. 11,392 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 9,926 కోట్లుగా ఉంది.
జనవరి-మార్చి త్రైమాసికంలో TCS ఆదాయం 16.9 శాతం పెరిగింది. ఆ మూడు నెలల కాలంలో కంపెనీ ఆదాయం రూ. 59,162 కోట్లుగా లెక్క తేలింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 50,591 కోట్లుగా నమోదు కాగా, 2022-23 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (మూడో త్రైమాసికం) ఆదాయం రూ. 58,229 కోట్లుగా ఉంది.
అటు టాప్ లైన్‌లో (ఆదాయం), ఇటు బాటమ్ లైన్‌లో (లాభం) రెండింటిలోనూ మార్కెట్ అంచనాలను టీసీఎస్ అందుకోలేకపోయింది.
టీసీఎస్ డివిడెండ్
టీసీఎస్ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ. 24 డివిడెండ్ ప్రకటించింది.
TCS కొత్త MD & CEO కె.కృతివాసన్ (K. Krithivasan) సమక్షంలో ఫలితాలను ప్రకటించడంతో, మేనేజ్‌మెంట్ కామెంటరీ మీద ఈసారి ఆసక్తి మరికాస్త పెరిగింది. మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బలమైన వృద్ధి సంతృప్తికరంగా ఉందని TCS ప్రస్తుత CEO & MD రాజేష్ గోపీనాథన్ (Rajesh Gopinathan) తెలిపారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి కృతివాసన్ ఛార్జ్ తీసుకుంటారు.
నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆర్డర్ బుక్ 10 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022-23లో మొత్తం ఆర్డర్ బుక్ విలువ 34 బిలియన్ డాలర్లుగా కంపెనీ ప్రకటించింది.
"మా సేవలకు ఉన్న డిమాండ్ స్థితిస్థాపకతను మా ఆర్డర్ బుక్‌లోని బలం ప్రతిబింబిస్తుంది, మధ్యస్థ కాలంలో మరింత వృద్ధి మార్గాన్ని చూపుతోంది. కృతివాసన్, నేను కలిసి, రాబోయే కొన్ని నెలల్లో నాయకత్వ మార్పిడి సజావుగా సాగేలా, వాటాదార్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేలా కృషి చేస్తున్నాం. భవిష్యత్ అవకాశాలను చేజిక్కించుకోవడానికి టీసీఎస్ మంచి స్థానంలో ఉంది" - రాజేష్ గోపీనాథన్
తగ్గిన అట్రిషన్ - 821 కొత్త ఉద్యోగాలు
సమీక్ష కాల త్రైమాసికంలో, ఈ కంపెనీ కొత్తగా 821 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం వర్క్ ఫోర్స్ 6,14,795కి చేరుకుంది. అట్రిషన్ ట్రెండ్ (ఉద్యోగ వలసలు) ఏడాది ప్రాతిపదికన కాస్త తగ్గింది, 20.1% వద్ద ఉంది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా 4.2 శాతానికి తగ్గింది. అట్రిషన్ రేట్ తగ్గడం ఏ కంపెనీకైనా మంచి పరిణామం.
జాబ్ ఆఫర్లు ఇచ్చిన అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పిన TCS, మొత్తం FY23లో నికరంగా 22,600 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు ప్రకటించింది.
బుధవారం (12 ఏప్రిల్ 2023), టీసీఎస్ షేరు 0.87 శాతం లాభంతో రూ. 3242 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.