Russia Ukraine War Impact: ఎందుకొచ్చిన యుద్ధమో! వంట నూనె మంటకు తోడు చల్లని బీరూ పెరిగే!
Russia Ukraine War impact: రష్యా-ఉక్రెయిన్ అన్ని దేశాలపై పడుతోంది. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి. చాలా వస్తువుల ధరలూ పెరగనున్నాయి!
Russia Ukraine War impact on India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని (Russia Ukraine War) చూస్తుంటే 'యెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అన్న సామెత గుర్తొస్తోంది! 21వ శతాబ్దంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంటర్ లింకై ఉన్నాయి. ఒక దేశంతో మరొక దేశం ఏదో ఒక విధంగా సంబంధాలు పెట్టుకుంటూనే ఉంటుంది. దాంతో ఈ యుద్ధ ప్రభావం (Russia Ukraine War Impact) అన్ని దేశాలపై పడుతోంది. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థను (Indian Economy) ఇబ్బందులు పెట్టబోతోంది. పెట్రోలు, డీజిల్ నుంచి రవాణా వరకు, వంటనూనె నుంచి చల్లని బీరు (Beer) వరకు అన్ని ధరలూ పెరగనున్నాయి!
మళ్లీ పెట్రోల్ ధరల మోత
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రకటించగానే ముడి చమురు ధరలు కొండెక్కాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 10౩ డాలర్లు దాటేసింది. ముడి చమురు ధరలు పదిశాతం పెరిగాయంటే భారత్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం ౦.5 శాతం, టోకు ధరల ద్రవ్యోల్బణం 1 శాతం పెరుగుతుంది. ఎన్నికల వాతావరణం ఉండటంతో మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు చేయలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మార్చి 10 నుంచి లీటరుకు రూ.8-10 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే భాజపా యేతర రాష్ట్రాల్లో దీని ప్రభావం కాస్త తక్కువే ఉండొచ్చు! ఎందుకంటే దీపావళి నుంచి ఈ ప్రభుత్వాలు ధరలు అస్సలు తగ్గించలేదు.
కూరగాయాల నుంచి వంట సరకుల వరకు
రష్యా నుంచే అధిక భాగం ముడి చమురు ఐరోపా, ఆసియాకు వస్తుంది. ఒకవేళ సరఫరా, గిరాకీలో సమతుల్యం దెబ్బతింటే ధరలు పెరగడం గ్యారంటీ. అప్పుడు సరకు రవాణాపై భారం పెరుగుతుంది. కూరగాయాల నుంచి విమాన ప్రయాణాలకు వరకు ధరల మోత మోగుతుంది! అంటే మన ఇంట్లో ఉండే పప్పులు, ఉప్పులు, కూరగాయాలు, పాలు, మాంసం, దుస్తులు సహా అన్నీ పెరుగే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడాలంటే ఓపెక్ దేశాలు చమురు ఉత్పత్తి పెంచాలి. వాళ్లిప్పుడు పెంచే ఉద్దేశంతో లేరు కాబట్టి ఇరాన్ ఒక్కటే అందరికీ దిక్కు! వారిపై ఆంక్షలు తొలగిస్తే రోజుకు పది లక్షల బ్యారెళ్ల ముడిచమురును ఆ దేశం సరఫరా చేయగలదు.
వంట.. కాదు 'మంట నూనెలే'
మన దేశంలో వంటనూనెల వినియోగం అధికంగా ఉంటుంది. దాదాపుగా మన దేశ వంటనూనెల అవసరం కోసం విదేశాల వైపు చూస్తుంటాం! భారత్‌లో పామాయిల్ తర్వాత ఎక్కువగా వినియోగించేది పొద్దు తిరుగుడు నూనెనే! మనదేశం 90 శాతం వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను (Sunflower oil) ఉక్రెయిన్, రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది. 2021లో భారత్ 1.89 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఇందులో 70 శాతం ఉక్రెయిన్, 20 శాతం రష్యా, 10 శాతం అర్జెంటీనా నుంచి వచ్చింది. ఈ రెండు దేశాల నుంచి సరఫరా ఆగిందంటే మనం ఆగమాగం కాక తప్పదు!
వంట గ్యాస్ బండ బాదుడు
వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. భారత్ తనకు అవసరమైన ద్రవరూప సహజ వాయువు (LNG)లో సగం వరకు దిగుమతి చేసుకుంటుంది. అందులో ఎక్కువగా ఉక్రెయిన్ నుంచే వస్తుంది. కొద్ది భాగం రష్యా సరఫరా చేస్తుంది. కాబట్టి దీని ధరలు పెరగొచ్చు.
ఔషధ కంపెనీలకు నష్టాలు
భారత ఔషధ కంపెనీలకూ తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత ఉక్రెయిన్ ఎక్కువ ఔషధాలు ఎగుమతి చేస్తున్నది మన దేశమే. రాన్‌బాక్సీ, సన్ గ్రూప్, డాక్టర్ రెడ్డీస్ సంస్థలకు ఉక్రెయిన్‌లో ప్రతినిధులు, కార్యాలయాలు ఉన్నాయి. భారత ఔషధ తయారీ సంస్థల సంఘాన్నీ అక్కడ స్థాపించారు. యుద్ధం వల్ల అక్కడ గిరాకీ తగ్గుతుంది.
చల్లని బీరు ధర పెంచక తప్పదు!
విచిత్రమైన విషయం ఏంటంటే ఎండాకాలంలో చల్లని బీర్ల ధరలు 30 శాతం వరకు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఎక్కువగా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. అంటే కింగ్‌ఫిషర్ బీరు ధర పెరగొచ్చు. బీరు తయారీకి ఎక్కువగా బార్లీ గింజలను ఉపయోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా బార్లీని పండించేది రష్యా. నాలుగో స్థానంలో ఉక్రెయిన్ ఉంది. ఈ యుద్ధం వల్ల సరఫరా దెబ్బతింటుంది. దాంతో బార్లీ ధరలు భారీగా పెరుగుతాయి. ఎండాకాలం కోసం తయారీ సంస్థలు అధికంగా బార్లీని దిగుమతి చేసుకొని నిల్వ చేయాల్సి రావొచ్చు. ఇలా చాలారకాలుగా వారికి తయారీ ఖర్చు పెరుగుతుంది. అది వినియోగదారుడిపైనే పడుతుంది. కానీ మధ్యం ధర పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండటం గమనార్హం.