Adani stocks: నెల రోజుల్లోనే ₹11 లక్షల కోట్లు గల్లంతు, ఎన్ని జీవితాలు నడిబజార్లో నిలబడ్డాయో?
ఈ నెల రోజుల్లో అదానీ బుల్స్ (అదానీ కంపెనీలు) ఏకంగా రూ. 11 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూశాయి. ఈ డబ్బులన్నీ చిన్న, పెద్ద పెట్టుబడిదార్ల ఖాతాల నుంచే గల్లంతయ్యాయి.
Adani stocks: బిలియనీర్ గౌతమ్ అదానీ స్టాక్స్ పతనం కొనసాగుతోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇచ్చిన బ్లాస్టింగ్ రిపోర్ట్ తర్వాత, ఒక్క నెల రోజుల్లోపే అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani group stocks) మార్కెట్ విలువ 57% పడిపోయింది.
ఈ నెల రోజుల్లో అదానీ బుల్స్ (అదానీ కంపెనీలు) ఏకంగా రూ. 11 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూశాయి. ఈ డబ్బులన్నీ చిన్న, పెద్ద పెట్టుబడిదార్ల ఖాతాల నుంచే గల్లంతయ్యాయి.
గౌతమ్ అదానీలా లక్షల కోట్లు సంపాదించలేకపోయినా, కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు నెలకు ఎంతో కొంత ఆర్జిద్దామన్న ఆశతో స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి, అదానీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు డబ్బులు పోగొట్టుకుని, ఎంత మంది బతుకులు బజార్న పడ్డాయో ఆ దేవుడికే తెలియాలి.
రూ.19.2 లక్షల కోట్లు - రూ.8.2 లక్షల కోట్లు
హిండెన్‌బర్గ్ విధ్వంసానికి ఒక రోజు ముందు, అంటే జనవరి 24న, అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 19.2 లక్షల కోట్లుగా ఉంది. నాన్‌స్టాప్ సెల్-ఆఫ్ కారణంగా అది నేటికి (మంగళవారం, 21 ఫిబ్రవరి 2023) రూ. 8.2 లక్షల కోట్లకు తగ్గింది.
ఇవాళ, మూడు అదానీ కౌంటర్లు - అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ గ్రీన్ (Adani Green), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) 5% నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
మరోవైపు, అదానీ పవర్ 5% లాభాల్లో ట్రేడవుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభానికి సంబంధించిన సానుకూల వార్తల వల్ల ACC & అంబుజా సిమెంట్స్‌లో (Ambuja Cements) కూడా కొనుగోళ్లు కనిపించాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) షేర్లు దాని 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 61% పడిపోయాయి. 'క్యాష్ కౌ' అదానీ పోర్ట్స్ (Adani Ports) కూడా దాని గరిష్ట స్థాయి నుంచి 40% పడిపోయింది.
ఫలించని భరోసా ప్రయత్నాలు
60 ఏళ్ల వ్యాపారవేత్త అదానీ, తన ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చేందుకు, వాళ్లను వెనక్కి రప్పించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ చాలా స్వల్ప ఫలితాలు మాత్రమే ఇచ్చాయని షేర్ల ప్రైస్ యాక్టివిటీని బట్టి తెలుస్తోంది.
కమ్‌బ్యాక్ ప్లాన్‌లో భాగంగా.., SBI మ్యూచువల్ ఫండ్స్‌కు బకాయి ఉన్న రూ. 1,500 కోట్లను సోమవారం చెల్లించామని, మార్చిలో చెల్లించాల్సిన మరో రూ. 1,000 కోట్లను కూడా చెల్లిస్తామని అదానీ పోర్ట్స్ నిన్న ప్రకటించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన రూ. 5,000 కోట్ల రుణాన్ని ముందుగానే చెల్లించామని, వచ్చే నెలలో గ్రూప్ 500 మిలియన్ డాలర్ల బ్రిడ్జి లోన్‌ను కూడా చెల్లిస్తామని ఈ కంపెనీ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.
గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్, 4 అదానీ గ్రూప్ సంస్థలపై ఔట్‌లుక్‌ను ఇటీవల తగ్గించింది, అదానీ పోర్ట్స్‌పై తన రేటింగ్ & ఔట్‌లుక్‌ను కంటిన్యూ చేసింది.
భారీగా రుణాలు తీసుకుని, ఆ పునాదుల మీద సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీ గ్రూప్, ఇప్పుడు తన దృష్టిని మార్చుకుంది. నగదు పొదుపు, రుణాల చెల్లింపులు, తాకట్టులో ఉన్న షేర్లను విడిపించుకోవడం వంటి ఆర్థిక స్థిరత్వ పనులపై ఫోకస్ పెంచింది. ప్రభుత్వ రంగ విద్యుత్ ట్రేడర్ PTC ఇండియాలోనూ వాటా కోసం బిడ్ వేయకూడదని, ఆ డబ్బులు మిగుల్చుకోవాలని తాజాగా నిర్ణయించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.