Reliance Industries: కంపెనీ విలీనంపై వెనక్కు తగ్గిన ముకేష్ అంబానీ, గత నిర్ణయం రద్దు
పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని RNEL కిందే నడపాలని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు తన ఫైలింగ్‌లో తెలిపింది.
Reliance Industries: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, తన అనుబంధ సంస్థ 'రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్'ను (RNEL) RILలో విలీనం చేయాలన్న గత ప్రణాళికను రద్దు చేసుకుంది. దీనిపై రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సమాచారం ఇస్తూ, న్యూ ఎనర్జీ బిజినెస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో విలీనం చేయడం లేదని కంపెనీ వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ RNEL.
న్యూ ఎనర్జీ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రక్చర్‌పై ఈ నెల 21న (శుక్రవారం) జరిగిన సమీక్ష తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పునరుత్పాదక ఇంధన వ్యాపారాన్ని RNEL కిందే నడపాలని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు తన ఫైలింగ్‌లో తెలిపింది.
న్యూ ఎనర్జీ (RNEL) వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ఆధ్వర్యంలో నిర్వహించాలని గత ఏడాది మే నెలలో కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందే డీల్స్ జరుగుతాయి, లేదా న్యూ ఎనర్జీ & ఇతర వ్యాపార పనుల కోసం RIL పేరిట నిధులు సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు, రిలయన్స్ ఆ ప్లాన్ నుంచి వెనుకడుగు వేసింది.
భారీ పెట్టుబడిని ప్రకటించిన ముకేశ్ అంబానీ
క్లీన్ ఎనర్జీ ఎంటర్‌ప్రైజ్‌గా వేగంగా స్థిరపడాలన్న కంపెనీ ప్రణాళికను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 2021లో ప్రకటించారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. మూడేళ్లలో రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా, RIL, న్యూ ఎనర్జీ కోసం రూ. 60,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. వివిధ ఇతర వ్యాపారాల కోసం రూ. 15,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది.
Q4లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభ వృద్ధి 19 శాతం
మార్కెట్ విలువ పరంగా భారతదేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ. 19,299 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది కాలంలోని రూ. 16,203 కోట్లతో పోలిస్తే 19 శాతం లాభ వృద్ధిని కనబరిచింది. 2022-23 మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం రూ. 15,792 కోట్లు. కార్యకలాపాల ద్వారా రూ. 2,16,376 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. 2021-22 నాలుగో త్రైమాసికంలోని రూ. 2,11,887 కోట్ల కంటే ఇది 2.11 శాతం ఎక్కువ.
చివరి ట్రేడింగ్ సెషన్‌లో (శుక్రవారం, 21 ఏప్రిల్ 2023) రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర BSEలో 0.14 శాతం పెరిగి రూ. 2,348.90 వద్ద ముగిసింది. గత ఒక ఏడాది కాలంలో ఈ స్టాక్ దాదాపు 13 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 4 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) చూసినా దాదాపు 9 శాతం నష్టంలో ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.