Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం
Privatisation of PSU Banks: ప్రభుత్వ బ్యాంకులను వేగంగా ప్రైవేటీకరించేందుకు వీలు కల్పించే ఆర్థిక రంగ బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది!
Privatisation of PSU Banks: ప్రభుత్వ బ్యాంకులను వేగంగా ప్రైవేటీకరించేందుకు వీలు కల్పించే ఆర్థిక రంగ బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసింది! వర్షాకాలం సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుందని తెలిసింది. ఈ బిల్లుకు మద్దతు లభిస్తే ప్రభుత్వ బ్యాంకులను పూర్తి స్థాయిలో ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రానికి వీలవుతుంది.
బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970 ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రానికి కనీసం 51 శాతం వాటా కచ్చితంగా ఉండాల్సిందే. ప్రైవేటీకరణ ప్రక్రియలో తొలుత 26 శాతం వాటా ఉంచుకోవాలని, ఆ తర్వాత దానికి మరింత తగ్గించుకోవాలని కేంద్రం భావించింది. 'కేంద్రం వాటాలు అమ్ముకొనేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బహుశా ఈ సెషన్లోనే ప్రవేశపెట్టొచ్చు. మిగతా విషయాలు తర్వాత చూసుకుంటారు' అని ఓ అధికారి తెలిపారు. కాగా ఐడీబీఐ బ్యాంకు వాటా అమ్మకం ప్రక్రియ చేపట్టినప్పుడు ప్రభుత్వం చాలామంది ఇన్వెస్టర్లతో మాట్లాడింది. వారి ఆలోచనలకు అనుగుణంగా బిల్లును రూపొందించారు.
ప్రైవేటైజేషన్ ప్రక్రియలో నియంత్రిత వాటా గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆర్బీఐతో సంప్రదింపులు జరిపిందని తెలిసింది. ప్రస్తుతానికైతే ప్రైవేటు రంగంలో ప్రమోటర్ నియంత్రిత వాటా 26 శాతంగా ఉంటే చాలు. కాగా గతేడాది డిసెంబర్ 22తో ముగిసిన పార్లమెంటు శీతకాల సమావేశాల్లోనే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును ప్రభుత్వం నమోదు చేసినా ప్రవేశపెట్టలేదు.
'ఇన్వెస్టర్లు, మర్చంట్ బ్యాంకర్లు, పరిశ్రమ నిపుణుల సలహాలను ఇప్పటికే తీసుకున్నాం. నియంత్రణ పరమైన చిక్కులు లేకుండా వాటాల అమ్మకం ప్రక్రియ వేగంగా సాగేందుకు మేమీ మార్పులు చేస్తాం' అని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటీకరిస్తామని 2022-23 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
View this post on Instagram