Investment: పొదుపు మాత్రమే చేస్తే మీ డబ్బు వృథా, ఈ విధంగా విలువ పెంచండి
ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల మాత్రమే కాదు. డబ్బు విలువ పతనం అని కూడా అర్ధం.
Principles Of Investment: మన స్కూళ్లు, కాలేజీల్లో మాథ్స్, సైన్స్ గురించి చెబుతారు గానీ, పెట్టుబడి పాఠాలు మాత్రం చెప్పరు. మన దేశంలో అనాదిగా పొదుపు సంస్కృతి ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్‌లో ఇప్పటికీ కేవలం 5-6 శాతం మంది భారతీయులు మాత్రమే ఉన్నారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడమే దీనికి కారణం. భవిష్యత్ భద్రత దృష్ట్యా చాలా మంది తమ డబ్బును పొదుపు ఖాతాల్లో దాచుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ఆ ఖాతాలపై వచ్చే ఆదాయం ద్రవ్యోల్బణం రేటు కంటే చాలా తక్కువగా ఉంటుందని మాత్రం గ్రహించడం లేదు. దీనివల్ల, భవిష్యత్‌లో వాళ్ల డబ్బు విలువ తగ్గుతుంది.
అసలు పెట్టుబడి పెట్టకపోవడం ప్రమాదకరం
డబ్బు పెట్టుబడి పెట్టకపోవడం డబ్బు వృథాతో సమానం. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల మాత్రమే కాదు. డబ్బు విలువ పతనం అని కూడా అర్ధం. మీరు పెట్టుబడి పెట్టకపోతే, ఇప్పుడు మీదగ్గరున్న రూ. 1 లక్షతో, 25 ఏళ్ల తర్వాత కేవలం రూ. 22,000 విలువైన వస్తువులను మాత్రమే (వార్షిక ద్రవ్యోల్బణం రేటు 6 శాతంగా ఉంటే) కొనుగోలు చేయగలరు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, ద్రవ్యోల్బణం రేటు కంటే వేగంగా పెరిగే ఆస్తులలో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, ద్రవ్యోల్బణంలో 6 శాతం పెరుగుదలతో పోలిస్తే ఈక్విటీలు వార్షికంగా సగటున 13 శాతం వృద్ధి చెందాయి.
ప్రస్తుతం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడంలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తోంది. ఫిన్‌టెక్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు మెరుగైన & తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అయితే, అందుబాటులో ఉన్న అనేక ఎంపికలను చూసి పెట్టుబడిదార్లు గందరగోళానికి గురికావడం సహజం. పెట్టుబడి పెట్టడానికి సరైన అసెట్ క్లాస్‌ని ఎలా ఎంచుకోవాలి, మీకు ఏ మార్గం సరైనదో ఎలా తెలుస్తుంది, దీర్ఘకాలిక సంపదను ఎలా సృష్టించవచ్చు? ఇక్కడ తెలుసుకుందాం.
చిన్నదే అయినా ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి
మీరు తక్కువ మొత్తంతో అయినా, ముందు పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. దానిని దీర్ఘకాలం పాటు కొనసాగించండి. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం, తక్కువ మొత్తంతో ఎక్కువ సంపదను సృష్టించే శక్తిమంతమైన వ్యూహం. ఉదాహరణకు, మీరు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా ప్రతి నెలా రూ. 5,000 ఇన్వెస్ట్ చేస్తే, ఆ పథకం మీకు 25 సంవత్సరాల్లో 13% సగటు వార్షిక రాబడిని అందిస్తే, మీరు రూ. 1 కోటి కంటే ఎక్కువ కార్పస్ సృష్టించవచ్చు. చక్రవడ్డీకి ఉన్న శక్తి (magic of compounding) ఇది.
స్టాక్ మార్కెట్‌లో స్వల్పకాలిక ఒడిదుడుకులను పట్టించుకోవద్దు, దీర్ఘకాలిక లాభాల కోసం ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టండి. ఇండెక్స్ ఫండ్ ద్వారా, భారతదేశంలోని టాప్ 50 కంపెనీల పోర్ట్‌ఫోలియోను సూచించే నిఫ్టీ50లో పెట్టుబడి పెట్టండి. ఇండెక్స్ ఫండ్లు నిష్క్రియ ఫండ్లు, ఇవి మార్కెట్ మాదిరిగానే రాబడి ఇస్తాయి.
రిస్క్ - రిటర్న్‌పై నిఘా ఉంచండి
సాధారణంగా, పెట్టుబడిదార్లు వార్షిక రాబడి ఆధారంగా మాత్రమే ఫండ్‌లను ఎంచుకుంటారు, అయితే రిస్క్‌ను చూడటం కూడా అంతే ముఖ్యం. మీరు ఎంచుకున్న ఫండ్ మీకు ప్రతి సంవత్సరం స్థిరమైన రాబడిని ఇస్తుందా, లేదా హెచ్చుతగ్గులకు లోనవుతుందా? అన్నది చూడాలి. తక్కువ రిస్క్‌తో అధిక రాబడిని ఇచ్చే ఫండ్‌ను ఎంచుకోవాలి.
ఈక్విటీల్లో పెట్టుబడులు - పన్ను ఆదా
ELSS లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది మ్యూచువల్ ఫండ్‌ల వర్గంలోనిది. ఇది మార్కెట్ అనుసంధాన ఆదాయం ఇవ్వడం, పన్ను ఆదా చేయడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. పాత పన్ను విధానం ఎంచుకున్న పెట్టుబడిదార్లు ELSS ద్వారా సెక్షన్ 80C కింద రూ. 46,800 వరకు పన్నులు ఆదా చేసుకోవచ్చు. ఈ తరహా పెట్టుబడి సాధనాల్లో అత్యల్పంగా, కేవలం మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని ఇది కలిగి ఉంటుంది.
పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్
రిస్క్‌ను తగ్గించుకోవడానికి మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో విభిన్నత (డైవర్సిఫికేషన్) ముఖ్యం. వేర్వేరు అసెట్ క్లాస్‌లు వేర్వేరు పరిస్థితులలో విభిన్నంగా పనిచేస్తాయి. అందువల్ల, ఒకే స్టాక్, ట్రేడ్ లేదా ఒకే అసెట్ క్లాస్‌లో పెట్టుబడులను కేంద్రీకరించడం మంచిది కాదు. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్, ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్‌లు వంటి రుణ ఆస్తుల్లో మీ డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టండి. ఇది, మీ పోర్ట్‌ఫోలియోను మార్కెట్ అస్థిరత నుంచి కాపాడుతుంది.
రెగ్యులర్ ప్లాన్‌ల కంటే డైరెక్ట్ ప్లాన్‌లు ఎంచుకోండి
మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లు కొని ఎందుకు అదనంగా ఖర్చు చేస్తారు? డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం అంటే, ఉత్పత్తి కంపెనీ నుంచి వస్తువులను నేరుగా కొనుగోలు చేసినట్లే. దీనివల్ల, మధ్యవర్తులు ఉండరు, ఖర్చు నిష్పత్తి తక్కువగా ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్‌లు ఎక్కువ ఫీజులు, కమీషన్‌లను కలిగి ఉంటాయి. దీనివల్ల పెట్టుబడిదార్ల నికర రాబడి తక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్‌ను ఎంచుకోవడం వలన తక్కువ ఖర్చులు, దీర్ఘకాలంలో అధిక మొత్తం రాబడిని పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఖర్చులు, కమీషన్ల గురించి తెలుసుకోవడం ముఖ్యం.