Akshaya Tritiya: ఇలా గోల్డ్ కొంటే రూ.2000 వరకు క్యాష్ బ్యాక్, HDFC క్రెడిట్ కార్డ్‌పై తగ్గింపు
Akshaya Tritiya: దేశంలో అక్షయతృతీయ రోజున పసిడి విక్రయాలను పెంచుకునేందుకు షాపులు ఆఫర్లను ప్రకటిస్తుండగా, డిజిటల్ పెట్టుబడులపై ఫోన్ పే క్యాష్ బ్యాక్స్ అందిస్తోంది.
Gold News: దేశవ్యాప్తంగా బంగారు దుకాణాలకు నేడు పసిడి ప్రియులు క్యూ కడుతున్నారు. ఒక్క కాసైనా గోల్డ్ కొనేందుకు చాలా మంది హడావిడిగా ఉన్నారు. అయితే ఒక పక్క నేడు హఠాత్తుగా పెరిగిన గోల్డ్ రేటు వారికి షాక్ ఇచ్చినప్పటికీ దేశంలోని ప్రముఖ బంగారు దుకాణదారులు, ఆన్ లైన్ పేమెంట్ సంస్థలు కొత్త ఆఫర్లతో చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ముందుగా అక్షయతృతీయకు బంగారం కొనుగోళ్లు శుభప్రదంగా భావిస్తారు కాబట్టి.. వినియోగదారులను టార్గెట్ చేసి ప్రముఖ యూపీఐ చెల్లింపుదారు ఫోన్‌పే సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద పేటీఎం 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి డిజిటల్ కొనుగోళ్లపై రూ.2,000 వరకు తిరిగి పొందేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం కొనుగోలుదారులు కనీసం రూ.1,000 విలువైన బంగారాన్ని కొనాల్సి ఉంటుంది. దీనికి యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా గిఫ్ట్ కూపన్ ద్వారా చెల్లింపులను అనుమతిస్తోంది. ఇందుకోసం కొనుగోలుదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దే కూర్చుని ఫోన్‌పే యాప్‌లోని బిల్స్ సెక్షన్‌లో కనిపించే గోల్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి తమ కొనుగోళ్లను పూర్తి చేయవచ్చు. కొనుగోలు విజయవంతంగా పూర్తైన తర్వాత క్యాష్ బ్యాక్ అందుకుంటారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ కింద డిజిటల్ గోల్డ్ ను యూజర్లు మే 12 వరకు అంటే అక్షయతృతీయ హడావిడి తగ్గిన తర్వాత టాటా గ్రూప్ కింద పనిచేస్తున్న సంస్థ క్యారెట్ లేన్ స్టోర్లలో రిడీమ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. దీని ప్రకారం గోల్డ్ కాయిన్స్ పై 2 శాతం, స్టడ్ చేయని ఆభరణాలపై 4 శాతం, పొదిగిన నగలపై 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు జీఆర్టీ జ్యూవెలర్స్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీనికింద ఎవరైనా వినియోగదారుడు కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లకు 2 శాతం తగ్గింపును ప్రకటించింది. అలాగే బంగారు కడ్డీలు, కాయిన్లపై ఎలాంటి వ్యాల్యూ ఎడిషన్ ఉండబోదని స్పష్టం చేసింది. అలాగే ఎవరైనా కొనుగోలుదారు తొలిసారిగా జీఆర్టీ జ్యువెలర్స్ యాప్ ద్వారా సైన్ ఇన్ అయ్యి చేసే కొనుగోళ్లకు ఏకంగా రూ.1,000 తగ్గింపును అందిస్తోంది. డిజిటల్ యాప్ ద్వారా చేసే కొనుగోళ్లకు ఉచిత డెలివరీతో పాటు 30 రోజుల్లో రిటర్న్ పాలసీని సైతం అందుబాటులో ఉంచింది. ఇలాగే దేశంలోని అనేక ఇతర పసిడి విక్రయ షాపులు పెరిగిన రేట్ల సమయంలో కస్టమర్లను షాపులకు రప్పించుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తూ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలను గమనిస్తే, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.860 పెరిగి రూ.67,000 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు నిన్నటి కంటే రూ.930 పెరిగి రూ.73,090గా కొనసాగుతోంది. ఊహించని రీతిలో రెండు రోజుల స్వల్ప తగ్గింపు తర్వాత అక్షయతృతీయ రోజున గోల్డ్ రేట్లు అమాంతం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. అలాగే ఏపీ, తెలంగాణలో వెండి ధరను గమనిస్తే కేజీ రూ.1,300 పెరిగి రూ.90,000 వద్ద విక్రయించబడుతోంది.