Mazagon Dock Shipbuilders: ₹లక్షను ₹3 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇది, అదీ 3 నెలల్లోనే!
సరిగ్గా ఆరు వారాల క్రితం మీరు ఈ స్క్రిప్‌లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పటికి అది రెండు లక్షలై కూర్చునేది.
Mazagon Dock Shipbuilders: ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే షిప్ బిల్డింగ్ కంపెనీ 'మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్' (MDL) షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. 5 శాతం లాభపడి రూ.819.25 వద్ద కొత్త రికార్డ్ గరిష్టాన్ని తాకాయి.
వరుసగా ఐదో ట్రేడింగ్ రోజున కూడా ఈ స్క్రిప్ లాభాల్లో ట్రేడయింది, ఈ కాలంలో 29 శాతం పెరిగింది.
లక్షకు లక్ష
గత ఆరు వారాల్లోనే - సెప్టెంబర్ 27, 2022 నాటి రూ.412.25 స్థాయి నుంచి సోమవారం నాటికి MDL షేర్ ప్రైస్ దాదాపు రెట్టింపు (99 శాతం) అయింది. సరిగ్గా ఆరు వారాల క్రితం మీరు ఈ స్క్రిప్‌లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పటికి అది రెండు లక్షలై కూర్చునేది. లక్ష రూపాయల పెట్టుబడి పోను, మరో లక్ష రూపాయల లాభం మిగిలి ఉండేది.
3 నెలల్లోనే ₹లక్ష = ₹3 లక్షలు
గత మూడు నెలల కాలంలో, S&P BSE సెన్సెక్స్‌లోని 4.5 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇది 196 శాతం జూమ్ అయింది. అంటే, మూడు నెలల్లో రెండు రెట్లు పెరిగింది. మూడు నెలల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ కౌంటర్‌లో ఒక లక్ష రూపాయలు పెట్టి ఉంటే, సోమవారం నాటికి ఆ డబ్బు 3 లక్షలుగా లెక్క తేలేది. పెట్టుబడి లక్ష రూపాయలు పోను, రెండు లక్షలు లాభం మిగిలేది.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూస్తే... జనవరి 3 నాటికి రూ.283. 60గా ఉన్న షేర్ విలువ మరో రూ.525.90 లేదా 185.44 శాతం పెరిగింది.
సెప్టెంబరు 30, 2022తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను ఈ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ నెల 10న డైరెక్టర్ల బోర్డు సమావేశమై ఫలితాలను పరిశీలించి, ఆమోదం తెలుపుతుంది. అదే రోజున Q2 ఫలితాలను ఈ కంపెనీ ప్రకటిస్తుంది. ఒకవేళ, 2022-23 (FY23) ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్ ఇవ్వడానికి కూడా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపితే, అదే రోజున ఈ ప్రకటన కూడా వస్తుంది.
ఓడలు, జలాంతర్గాములు, వివిధ రకాల నౌకలను నిర్మించడం, వాటికి కావలసిన ఇంజినీరింగ్ ఉత్పత్తులను తయారు చేయడం, మరమ్మతు చేయడం వంటి పనులను 'మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్' చేస్తోంది. భారత నౌకాదళం కోసం డిస్ట్రాయర్లు, సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించి ఇస్తున్న ఏకైక షిప్‌యార్డ్ కంపెనీ ఇది.
FY23 (Q1FY23) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, MDL పన్ను తర్వాత దాని స్వతంత్ర లాభం (PAT)లో సంవత్సరానికి 134 శాతం (YoY) జంప్ చేసి రూ. 217 కోట్లుగా నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 84 శాతం వృద్ధితో రూ.2,230 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.