Metro Mall: 'మాల్ ఆన్ వీల్స్' - జర్నీలో షాపింగ్, స్టేషన్‌లో దిగగానే డెలివెరీ
ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు జర్నీలోనే షాపింగ్ చేస్తే, మీ స్టేషన్‌లో దిగగానే ఆ వస్తువులు చేతికి అందుతాయి.
Metro Station Mall: ప్రపంచంలోని బెస్ట్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో దిల్లీ మెట్రో ఒకటి. ఇకపై, అక్కడి మెట్రో రైల్ జర్నీ అనుభవం మరింత అద్భుతంగా ఉండబోతోంది. దిల్లీ మెట్రో నెట్‌వర్క్, కిరాణా సామాగ్రిని, ఇతర వస్తువులను అమ్మే షాపింగ్ హబ్‌గా త్వరలో కొత్త అవతారం ఎత్తబోతోంది.
జర్నీలో షాపింగ్, స్టేషన్‌లో డెలివెరీ
దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) జులైలో వర్చువల్ షాపింగ్ యాప్‌ను విడుదల చేస్తోంది. ఆ యాప్ పేరు మొమెంటం 2.0 (Momentum 2.0). ప్రయాణీకులు, ఆ యాప్‌లో షాపింగ్ చేయవచ్చు. ప్రతి వస్తువుకు QR కోడ్ మెకానిజం యాప్‌లో ఉంటుంది. దాని ద్వారా.. వర్చువల్ స్టోర్‌లలో లీనమయ్యేలా, రియల్ టైమ్ షాపింగ్ అనుభూతిని పొందేలా యాప్ డిజైన్ చేస్తున్నారు. ఆర్డర్ చేసిన కిరాణా సామాగ్రి, వస్తువులను ప్రయాణీకులకు వాళ్ల డెస్టినేషన్ స్టేషన్‌లో అందిస్తారు. అంటే.. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడో, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడో, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడో జర్నీలోనే షాపింగ్ చేస్తే, మీ స్టేషన్‌లో దిగగానే ఆ వస్తువులు చేతికి అందుతాయి.
ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్‌ను కలెక్ట్ చేసుకునే వరకు వాటిని ఉంచే వర్చువల్ స్టోర్‌లు, స్మార్ట్ లాకర్‌లను యాప్‌లో ఇన్‌స్టాల్ చేసే పనిలో ఉన్నారు. స్మార్ట్ లాకర్ ఫెసిలిటీలో 72 లాకర్ల ఉంటాయి. తర్వాత మరో 24 లాకర్లను చేరుస్తారు.
ప్లాన్ మొదటి దశలో 21 స్టేషన్లను కవర్ చేస్తారు. జులై చివరి నాటికి యాప్‌ను లాంచ్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ విజయవంతమైతే, నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్‌లకు యాప్ సేవలను విస్తరించే అవకాశం ఉంది.
మెట్రో స్టేషన్లలోనూ వర్చువల్ స్టోర్లు
యాప్ ద్వారానే కాకుండా, మెట్రో స్టేషన్లలోని వర్చువల్ స్టోర్ల నుంచి నేరుగా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం 65 అంగుళాల స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ స్టోర్ల ద్వారా వర్చువల్ స్టోర్‌లలో వెళ్లి ప్రొడక్ట్స్ చూడవచ్చు, నచ్చితే ఆర్డర్ పెట్టవచ్చు.
మరెన్నో ఫీచర్స్
మొమెంటం 2.0 యాప్ ద్వారా షాపింగ్ మాత్రమే కాదు.. క్యాబ్‌లు, ఆటోలు, బైక్‌లు, ఇ-రిక్షాలు వంటివి కూడా బుక్ చేసుకుని స్టేషన్ నుంచి ఇంటి వరకు వెళ్లిపోవచ్చు. అలాగే.. మెట్రో స్టేషన్‌ల నుంచి ఫీడర్, DTC, క్లస్టర్ బస్సుల టైమ్ టేబుల్స్, రూట్‌లతో సహా ఇన్‌స్టంట్ ఫీచర్‌లకు యాక్సెస్ లభిస్తుంది. మెట్రో కార్డ్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం వరకు, బీమా నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం వరకు చాలా సౌకర్యాలను కూడా అందిస్తుంది.
మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉన్న సౌకర్యాల పూర్తి సమాచారం యాప్‌లో ఉంటుంది. ఎగ్జిట్ గేట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారాలు, రైళ్ల సమయాలు, కోచ్‌ల ఆక్యుపెన్సీ, ఖాళీల లభ్యత సకల సమాచారాన్ని రియల్ టైమ్‌లో యాప్ అందిస్తుంది.
దిల్లీ మెట్రో రైళ్లలో ప్రతిరోజూ నేల ఈనినట్లు జనం కనిపిస్తారు. ఏ టైమ్‌లో చూసినా బోగీలు కిటకిటలాడుతుంటాయి. ఆ రద్దీయే ఇప్పుడు సంపాదన మార్గంగా మారుతోంది. DMRC ప్లాన్‌లో భాగమైన వ్యాపారులు పెద్ద మొత్తంలో డబ్బు ఆర్జించే అవకాశం ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: స్విస్ బ్యాంకుల్లో మన వాళ్లు ఎంత డబ్బు దాచారో తెలుసా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial