LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్‌ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి
గత రెండు సెషన్లలో, ఈ ఐదు అదానీ కంపెనీల నుంచి వచ్చిన ఈ నష్టాలన్నింటినీ కలిపితే, సుమారు ₹16,580 కోట్లను LIC కోల్పోయింది.
LIC Adani Shares: అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలతో అదానీ కంపెనీల షేర్లు (Adani Companies Stocks) కుప్పకూలాయి, మార్కెట్ మొత్తాన్నీ ముంచేశాయి. కేవలం గత రెండు వరుస ట్రేడింగ్ రోజుల్లోనే (బుధవారం, శుక్రవారం) BSE సెన్సెక్స్ 1640 పాయింట్లు పతనమవగా, NSE నిఫ్టీ 400 పాయింట్లు పడిపోయింది. పెట్టుబడిదార్లు రూ. 10.73 లక్షల కోట్లు నష్టపోయారు. BSEలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ గత రెండు రోజుల ట్రేడింగ్‌లో రూ. 10.73 లక్షల కోట్లు తగ్గి రూ. 269.65 లక్షల కోట్లకు చేరుకుంది.
బుధవారం నాటి నష్టాలు కొనసాగిస్తూ శుక్రవారం కూడా అదానీ కంపెనీ షేర్లు నెత్తురోడాయి. అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన సామాన్య పెట్టుబడిదార్ల నుంచి దిగ్గజాల వరకు అందరి సంపద ఆవిరైంది. ఇలా భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన సంస్థాగత పెట్టుబడిదార్లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఒకటి. అదానీ తుపాను ధాటికి ఈ దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ రెండు రోజుల్లోనే రూ. 16,580 కోట్లను పోగొట్టుకుంది. ఇందులో ఎక్కువ నష్టం అదానీ టోటల్ గ్యాస్ వాటా నుంచే వచ్చింది. అదానీ టోటల్ గ్యాస్‌లో LICకి 5.96 శాతం వాటా ఉంది. తన పోర్ట్‌ఫోలియోలో, ఈ ఒక్క కంపెనీ నుంచే ఎల్‌ఐసీ రూ. 6,232 కోట్లు నష్టపోయింది.
షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం... 2022 డిసెంబర్ 31 నాటికి అదానీ గ్రూప్ కంపెనీల్లో LIC పెట్టుబడులు ఇవి:
అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises)
అదానీ గ్రూప్‌లోని ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో LICకి 4.23 శాతం వాటా లేదా 4,81,74,654 షేర్లు ఉన్నాయి. గత రెండు ట్రేడింగ్ రోజుల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ప్రైస్ రూ. 673.5 తగ్గింది. ఒక్కో షేర్ ధర రూ. 3,442 నుంచి రూ. 2,768.50 కు దిగి వచ్చింది. ఈ కంపెనీ ద్వారా ఎల్ఐసీ రూ. 3,245 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది.
అదానీ పోర్ట్స్ (Adani Ports)
అదానీ పోర్ట్స్‌లో LICకి 9.14 శాతం స్టేక్ లేదా 19,75,26,194 షేర్లు ఉన్నాయి. గత రెండు సెషన్స్‌లో అదానీ పోర్ట్స్ షేర్ విలువ రూ. 156.70 తగ్గింది. ఒక్కో షేర్ ధర రూ. 761.20 నుంచి రూ.604.50 కు పతనమైంది. ఈ కంపెనీ ద్వారా ఎల్ఐసీకి వచ్చిన నష్టం రూ. 3,095 కోట్లు.
అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission)
అదానీ ట్రాన్స్‌మిషన్‌లో LICకి 3.65 శాతం వాటా లేదా 4,06,76,207 షేర్లు ఉన్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్స్‌లో ఈ షేరు ధర రూ. 747.95 తగ్గింది. ఒక్కో షేర్ ధర రూ. 2,762.15 నుంచి రూ. 2,014.20 కు పడిపోయింది. ఈ కంపెనీ ద్వారా ఎల్ఐసీ రూ. 3,042 కోట్ల నష్టాన్ని భరించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy)
2022 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో LICకి 1.28 శాతం స్టేక్ లేదా 2,03,09,080 షేర్లు ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ విలువ గత రెండు రోజుల్లో రూ. 430.55 తగ్గింది. ఈ కంపెనీ ద్వారా ఎల్ఐసీ రూ. 875 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas)
అదానీ టోటల్ గ్యాస్‌లో LICకి 5.96 శాతం వాటా లేదా 2,03,09,080 షేర్లు ఉన్నాయి. అదానీ టోటల్ గ్యాస్ షేరు విలువ గత రెండు ట్రేడింగ్ రోజుల్లో రూ. 963.75 తగ్గింది. ఈ కంపెనీ ద్వారా ఎల్ఐసీ రూ. 6,323 కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చింది.
గత రెండు సెషన్లలో, ఈ ఐదు అదానీ కంపెనీల నుంచి వచ్చిన ఈ నష్టాలన్నింటినీ కలిపితే, సుమారు ₹16,580 కోట్లను LIC కోల్పోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.