Union Budget 2024: భారతీయుల భయాలు అవే, ప్రి-బడ్జెట్ సర్వేలో ఆసక్తికర విషయాలు
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions 2024) ప్రారంభం అవుతాయి.
Union Budget Survey 2024: మరికొన్ని రోజుల్లో రాబోయే కేంద్ర మధ్యంతర బడ్జెట్‌కు (Interim Budget 2024) ముందు, భారతదేశంలో జరిగిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు, ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు తమ మనసులో మాటల్ని బయటపెట్టారు. పట్టణాల్లో నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆహారం, ఉద్యోగాల గురించి చాలా ఆందోళనగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
దేశంలో అధిక స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం, ముఖ్యంగా భారీగా పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ప్రజల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. దీంతోపాటు, వివిధ కంపెనీల్లో తరచూ లే-ఆఫ్‌ల వల్ల ఉద్యోగ భద్రత అతి పెద్ద సమస్యగా మారిందని పట్టణ భారతీయులు ఆందోళనగా ఉన్నారు.
కాంతార్ ఇండియా (Kantar India) చేపట్టిన యూనియన్ బడ్జెట్ సర్వే 2024లోఈ విషయాలు బయటకు వచ్చాయి. మధ్యంతర బడ్జెట్‌కు వారం రోజుల ముందు, ఈ ప్రి-బడ్జెట్ సర్వే రిలీజ్ అయింది. వచ్చే వారంలో, జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions 2024) ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1 గురువారం రోజున, కొత్త బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటిస్తారు. అతి త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కారణంగా పూర్తి బడ్జెట్‌కు బదులు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
కాంతార్ ఇండియా సర్వే ప్రకారం, 57% మంది భారతీయులు పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి భయపడుతున్నారు. గత ఏడాది బడ్జెట్‌కు ముందు, ఈ విషయంలో కేవలం 27% మంది భారతీయులు మాత్రమే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు, ప్రతి ఇద్దరిలో ఒకరికి ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తోంది. అందులోనూ, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంతో (Food Inflation) ప్రజలు పరేషాన్ అవుతున్నారు.
ద్రవ్యోల్బణంపై ప్రజల ఆందోళన సరైనదే. గత నెలలో, అంటే డిసెంబర్ 2023లో చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) 5.69 శాతానికి పెరిగింది. గత రెండు నెలల్లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ దాదాపు 1% పెరిగింది. ఇది, అక్టోబర్‌లో 4.87%గా, నవంబర్‌లో 5.55%గా ఉంది. ద్రవ్యోల్బణం రేటు నిరంతరం పెరగడానికి కారణం ఆహార పదార్థాల ధరలు పెరగడమే. 2023 డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం (Wholesale inflation) కూడా తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి 0.73 శాతానికి పెరిగింది.
పింక్ స్లిప్స్‌తో పరేషాన్
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపుల (Lay-offs) వార్తల నడుమ, ప్రతి ముగ్గురు పట్టణ ప్రజల్లో ఒకరు భయంభయంగా జీవితం గడుపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఉద్యోగ భద్రత వారి ప్రధాన ఆందోళనగా మారింది. కొవిడ్ దెబ్బకు అనేక ప్రసిద్ధ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, అమెజాన్ వంటి పెద్ద పేర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. టెక్నాలజీ కంపెనీలే కాకుండా, ఇతర రంగాలపైనా తొలగింపుల ప్రభావం కనిపిస్తోంది.
ఆర్థిక మందగమనం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలపైనా పట్టణ భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం, మాంద్యంపై 48% మంది; యుద్ధాలపై 45% మంది ఆందోళన చెందుతున్నారు.
మంచి విషయం ఏంటంటే... చాలా మంది భారతీయులు భారత ఆర్థిక వృద్ధిపై నమ్మకంతో ఉన్నారు. 2024లో కూడా, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలను ఓడించి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని సర్వేలో పాల్గొన్న 57% మంది విశ్వాసం వ్యక్తం చేశారు.
మరో ఆసక్తికర కథనం: స్టాక్ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు, మీ పొజిషన్స్ జాగ్రత్త!