NSE: బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ శుక్రవారం కాదు, గురువారమే! ప్లాన్ మార్చిన NSE
బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీని గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తామని గతంలో ప్రకటించింది.
Nifty Bank Expiry: నిఫ్టీ బ్యాంక్ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ విషయంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE) కాస్త తగ్గింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు (BSE) పోటీగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. నిఫ్టీ బ్యాంక్ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీని గురువారం నుంచి శుక్రవారానికి మార్చే ప్లాన్‌ను పక్కనబెట్టింది.
BSE - NSE పోటాపోటీ
సెన్సెక్స్, బ్యాంకెక్స్ (Bankex -బీఎస్‌ఈ బ్యాంక్ ఇండెక్స్) డెరివేటివ్ కాంట్రాక్టుల గడువును గురువారం నుంచి శుక్రవారానికి BSE మార్చింది. ఈ ఏడాది మే 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీంతో, బిజినెస్ పోటీలో వెనకబడకుండా NSE కూడా మార్పులు ప్రకటించింది. బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీని గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తామని గతంలో ప్రకటించింది. జులై నెల సగం నుంచి ఇది అమల్లోకి వస్తుందని అప్పట్లో వెల్లడించింది.
వాస్తవానికి, దేశంలో మొదటి సెక్యూరిటీస్ ఎక్సేంజ్ BSE అయినా, వ్యాపారపరంగా చూస్తే NSE చాలా పెద్దది. నిఫ్టీ బ్యాంక్‌లో ట్రేడ్ చేసే కొందరికి బ్యాంకెక్స్ ఉందని కూడా తెలీదు. NSE ఇండెక్స్‌లకు ఉన్నంత పాపులారిటీ BSE ఇండెక్స్‌లకు లేదు. తనకు పోటీగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కూడా బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్స్ గడువును మార్చేసరికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ కంగారు పడింది. ఇది తన సెన్సెక్స్/బ్యాంకెక్స్ డెరివేటివ్‌ల వృద్ధిని గట్టిగా దెబ్బకొడుతుందని భావించింది. NSEతో మాట్లాడి, డెసిషన్ వెనక్కు తీసుకునేలా ఒప్పించింది.
"మార్కెట్ అభివృద్ధిని బ్యాలెన్స్ చేయడానికి, మార్కెట్‌లో కాన్సట్రేషన్ రిస్క్‌ను తగ్గించడానికి, బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్స్ గడువును శుక్రవారానికి కాకుండా మరే ఇతర రోజుకైనా మార్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని NSEని BSE అభ్యర్థించింది" అని రెండు ఎక్స్ఛేంజీలు కలిసి జాయింట్ స్టేట్‌మెంట్ ఇచ్చాయి.
BSE రిక్వెస్ట్‌ను అంగీకరించిన NSE, మార్కెట్ అభివృద్ధి దృష్ట్యా తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
శుక్రవారం కాకుండా మరే రోజయినా ఫర్వాలేదు
నిఫ్టీ బ్యాంక్ ఎక్స్‌పైరీని శుక్రవారానికి కాకుండా మరే ఇతర రోజుకు మార్చినా తనకు ఇబ్బంది ఉండదని, సెన్సెక్స్/బ్యాంకెక్స్ డెరివేటివ్స్‌లో ట్రేడర్లు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెంచడంలో ఇది సాయపడుతుందని, తద్వారా మార్కెట్ రిస్క్‌ను తగ్గించవచ్చని BSE భావించింది.
ప్రస్తుతం, NSE నిఫ్టీ బ్యాంక్ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ గురువారమే జరుగుతోంది. దీనిని శుక్రవారానికి మార్చాలన్న నిర్ణయాన్ని NSE రద్దు చేసుకోవడంతో, ఈ ఎక్స్‌పైరీ ఇకపైనా గురువారమే ఉంటుంది. ఒకవేళ గురువారం నాడు స్టాక్ మార్కెట్‌కు సెలవు వస్తే, దానికి ముందున్న వర్కింగ్ డే ఎక్స్‌పైరీ డేగా మారుతుంది.
రికార్డ్ స్థాయిలో ఇండియన్ మార్కెట్లు
ఇవాళ (బుధవారం, 28 జూన్ 2023) ఇండియన్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. NSE నిఫ్టీ, 7 నెలల తర్వాత (1 డిసెంబర్ 2022 తర్వాత) రికార్డ్ పీక్ చేరింది. నిఫ్టీ 18,908.15 స్థాయిలో స్టార్ట్ అయింది. 142 ట్రేడింగ్ సెషన్ల తర్వాత నిఫ్టీ ఈ కొత్త ఆల్-టైమ్ హై స్థాయిని సాధించింది.
BSE సెన్సెక్స్ 1.16 శాతం లాభంతో 63,701.78 స్థాయి వద్ద ప్రారంభమైంది, 63,716 వద్ద ఈ రోజు మళ్లీ ఆల్ టైమ్ హై సృష్టించింది. కొన్నిరోజుల క్రితమే టచ్ చేసిన ఆల్-టైమ్ హైని ఇవాళ అధిగమించింది.
మరో ఆసక్తికర కథనం: ఇప్పటివరకు కోటి మంది ఐటీఆర్ ఫైల్ చేశారు, మీరెప్పుడు ఫైల్ చేస్తారు?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial