Elon Musk: మస్క్ మామ మస్కా కొట్టాడా! 75% బిట్‌కాయిన్లను అమ్మేసిన టెస్లా
Tesla Sells 75 Percent Of Bitcoin: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. తనవద్ద ఉన్న బిట్‌కాయిన్లలో 75 శాతం విక్రయించింది.
Elon Musks Tesla Sells 75 Percent Of Bitcoin Holdings: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. తనవద్ద ఉన్న బిట్‌కాయిన్లలో 75 శాతం విక్రయించింది. ఫియట్ కరెన్సీని కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఉపయోగించినట్టు కంపెనీ తెలిపింది.
టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు క్రిప్టో కరెన్సీ అంటే చాలా ఇష్టం! ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా క్రిప్టోలకు మద్దతుగా మాట్లాడారు. కొన్నాళ్లుగా బిట్‌కాయిన్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి 50 శాతానికి పడిపోయింది. పైగా వివిధ దేశాల ప్రభుత్వాలు క్రిప్టోలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంతో మార్కెట్ బాగాలేదు. దాంతో మెజారిటీ బిట్‌కాయిన్ హోల్డింగ్స్‌ను టెస్లా విక్రయించినట్టు తెలిసింది. డోజీకాయిన్ (DOGE) అసెట్స్‌ను మాత్రం అలాగే ఉంచుకున్నామని వెల్లడించింది.
'మా బిట్‌కాయిన్ హోల్డింగ్స్‌లో 75 శాతాన్ని విక్రయించి ఫియట్ కరెన్సీలోకి మార్చేశాం. 936 మిలియన్ డాలర్లను బ్యాలెన్స్ షీట్‌లో జతచేశాం' అని టెస్లా తన క్యూ2 ఎర్నింగ్స్ నివేదికలో పేర్కొంది. గతేడాది చివరి నుంచి టెస్లా విక్రయించిన బిట్‌కాయిన్‌ల విలువ 2 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలిసింది.
బిట్‌కాయిన్ 2021, నవంబర్‌లో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 68,000 డాలర్లను టచ్ చేసింది. ఆ తర్వాత నుంచి పతనమవ్వడం మొదలైంది. గత నెల్లో 18,000 డాలర్లకు చేరుకుంది. తాము 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నామని టెస్లా ప్రకటించడంతోనే బిట్‌కాయిన్ ఎకాఎకిన పెరగడం గమనార్హం. ప్రస్తుతం తమ వద్ద 218 మిలియన్ డాలర్ల డిజిటల్ అసెట్స్ ఉన్నాయని టెస్లా ప్రకటించింది. తొలి త్రైమాసికంలో వాటి విలువ 1.26 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండో త్రైమాసికంలో టెస్లా లాభాలు ఊహించిన దానికన్నా తక్కువగానే తగ్గాయి. వాహనాల ధరలు పెంచడమే ఇందుకు కారణం.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.