Samvat 2079: ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఏడాది డేట్, టైమ్ ఎప్పుడు?
ముహూరత్‌లో కొనే షేర్లు, ఆరంభించే ఆర్థిక కార్యకలాపాలు ఏడాది పొడవునా సంపదను, విజయాన్ని అందిస్తాయని నమ్ముతారు. స్టాక్ మార్కెట్‌లో దశాబ్దాల క్రితం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
Samvat 2079: దీపావళి సమయానికి వారం, పది రోజుల ముందు నుంచే, "ముహూరత్ ట్రేడింగ్" అన్న పదం స్టాక్ మార్కెట్‌లో తరచూ వినిపిస్తుంటుంది. బడా బ్రోకింగ్ కంపెనీలన్నీ ముహూరత్ ట్రేడింగ్ కోసం స్టాక్స్‌ను రికమెండ్ చేస్తుంటాయి. ఈ ఏడాది కూడా ముహూరత్ ట్రేడ్‌కు టైమొచ్చింది.
ముహూరత్ ట్రేడింగ్ అంటే?
దీపావళి రోజున స్టాక్ మార్కెట్‌కు సెలవు. అయినా, ఆ రోజు ప్రత్యేకంగా ఒక చిన్నపాటి ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. దీనినే ముహూరత్ ట్రేడింగ్ సెషన్ అంటారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ఈ సమయాన్ని ఒక శుభ సమయంగా పెట్టుబడిదారులు పరిగణినిస్తారు. ముహూరత్‌లో కొనే షేర్లు, ఆరంభించే ఆర్థిక కార్యకలాపాలు ఏడాది పొడవునా సంపదను, విజయాన్ని అందిస్తాయని నమ్ముతారు. స్టాక్ మార్కెట్‌లో దశాబ్దాల క్రితం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) 1957లో ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) 1992లో ప్రారంభించింది.
'విక్రమ్ సంవత్' పేరిట పిలిచే హిందూ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా, ప్రతి సంవత్సరం దీపావళి నాడు లక్ష్మీ పూజను పురస్కరించుకుని దేశీయ మార్కెట్‌లు ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. ముహూరత్ ట్రేడింగ్‌లో భారీ స్థాయిలో షేర్ల కొనుగోళ్లు జరుగుతాయి.
రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చా?
ఈ ట్రేడింగ్‌లో కొత్తవాళ్లయినా, పాతవాళ్లయినా ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. దాదాపుగా షేర్ల కొనుగోళ్లే జరుగుతాయి కాబట్టి మార్కెట్ బుల్లిష్‌గా ఉండి, వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి. ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ట్రేడింగ్ చేయడం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఏయే సెగ్మెంట్లలో ట్రేడింగ్?
ఈక్విటీలతోపాటు కమొడిటీ డెరివేటివ్ సెగ్మెంట్, కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్, ఈక్విటీ ఫ్యూచర్స్ & ఆప్షన్స్, సెక్యూరిటీల లెండింగ్ & బారోయింగ్ (SLB) విభాగాల్లో ట్రేడింగ్ జరుగుతుంది.
సంవత్ 2079
ఈ నెల 24న ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. అంటే, హిందూ క్యాలెండర్ ఇయర్ ప్రకారం సంవత్ 2079 సంవత్సరం ఆ రోజున ప్రారంభమవుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం, మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తీసుకువచ్చేలా అన్ని గ్రహాలు, నక్షత్రాలు అనుకూలంగా ఉండే సమయమే ముహూరత్.
ముహూరత్ ట్రేడింగ్ రోజున, అంటే దీపావళి నాడు NSE, BSEలో లక్ష్మీపూజ జరుగుతుంది. లక్ష్మీదేవిని స్వాగతిస్తూ అందమైన రంగవల్లులు దిద్దుతారు, వేలాది దీపాలు వెలిగిస్తారు. విద్యుత్ దీపాల కాంతులతో NSE, BSE భవనాలు వెలిగిపోతాయి.
దీపావళి నాడు జరిగే ముహూరత్ ట్రేడింగ్ కోసం.. ప్రతి సెగ్మెంట్‌కు ట్రేడింగ్ ప్రారంభం, ముగింపు సమయాలను స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSE ప్రకటిస్తాయి.
2022 ముహూరత్ ట్రేడింగ్ సమయం:
ఈ నెల 24న (సోమవారం) సాయంత్రం 6:15 గంటల నుంచి రాత్రి 7:25 గంటల మధ్య ఇండియన్ మార్కెట్లు ముహూర్త ట్రేడింగ్ నిర్వహిస్తాయి. BSE, NSE సర్క్యులర్స్ ప్రకారం, ముహూరత్ ట్రేడింగ్ సమయంలో నిర్వహించే అన్ని ట్రేడ్‌లకు సెటిల్‌మెంట్ ఉంటుంది.
అక్టోబరు 24న జరిగే ట్రేడింగ్, అక్టోబరు 21 (శుక్రవారం), అక్టోబరు 24 ట్రేడింగ్ తేదీల్లో జరిపే నగదు లావాదేవీలను అక్టోబరు 25న (మంగళవారం) ఉదయం 8:30 గంటలకు సెటిల్ చేస్తారని NSE సర్క్యులర్ పేర్కొంది.
ఈ నెల 24న ఈ కింది షెడ్యూల్ ప్రకారం ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది:
• మార్కెట్ ప్రారంభమయ్యే సమయం: సాయంత్రం 6:15 గంటలు
• మార్కెట్ ముగింపు సమయం: రాత్రి 7:15 గంటలు
• ట్రేడ్ మోడిఫికేషన్ ముగింపు సమయం: రాత్రి 7:25 గంటలు