(Source: ECI/ABP News/ABP Majha)
Banking Fraud: కక్కుర్తి పడితే మీ డబ్బు దొంగలపాలు - హెచ్చరికలు పంపిన 4 బ్యాంక్‌లు
Fishing Files: ఇటీవలి కాలంలో, వివిధ తాయిలాల ఆశ చూపిస్తున్న హ్యాకర్లు, తాయిలాలు దక్కాలంటే థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయమని చెబుతూ వినియోగదార్లకు లింక్‌లు పంపుతున్నారు.
Banking Fraud: మారుతున్న సాంకేతికతతో పాటు బ్యాంకింగ్ విధానాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. డిజిటల్ బ్యాంకింగ్ ఇప్పుడు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అదే సమయంలో, సాంకేతికత వినియోగం వృద్ధితో పాటే బ్యాంకులకు సంబంధించిన డిజిటల్ మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. బ్యాంక్ పేరిట మోసాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా, దేశంలోని చాలా పెద్ద బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు పంపాయి. దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (APK) ద్వారా SBI రివార్డ్ పాయింట్లను స్వీకరించాలన్న లింక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదార్లకు సూచించింది.
ఎస్‌బీఐ ఇచ్చిన సలహా
ఇటీవలి కాలంలో, వివిధ తాయిలాల ఆశ చూపిస్తున్న హ్యాకర్లు, తాయిలాలు దక్కాలంటే థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయమని చెబుతూ వినియోగదార్లకు లింక్‌లు పంపుతున్నారు. ఆ లింక్‌లు క్లిక్ చేసిన ఖాతాదార్ల వ్యక్తిగత వివరాలను తస్కరించి బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే సమాచారాన్ని తన అధికారిక X హ్యాండిల్‌లో పంచుకున్న ఎస్‌బీఐ, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ఖాతాదార్లను అలెర్ట్ చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ (SBI Rewardz) పేరుతో కొన్ని సందేశాలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. SMS రూపంలోనూ కొందరు మొబైళ్లలోకి చేరింది. రూ.7,250 విలువైన ఎస్‌బీఐ రివార్డ్స్ వెంటనే రిడీమ్ చేసుకోవాలని, లేకపోతే ఈ రోజే అవి ఎక్స్‌పైర్ అవుతాయని ఆ సందేశంలో ఉంది. రివార్డ్ పాయింట్లు రిడీమ్ చేసుకోవడానికి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ APK కూడా అదే సందేశంతో పాటు వస్తోంది. ఆ సందేశాల వాటిపై క్లిక్ చేసి చాలామంది నష్టపోయారు. దీంతో, ఎస్‌బీఐ అప్రమత్తమైంది. SBI అటువంటి APK లింక్‌లను కస్టమర్లకు అస్సలు పంపదని స్పష్టం చేసింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని సూచించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక
ప్రైవేట్ రంగంలోని పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కూడా ఇదే విధంగా తన కస్టమర్లను అలెర్ట్ చేసింది. ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. KYC అప్‌డేట్ చేయడానికి యాప్ డౌన్‌లోడ్ చేయమని బ్యాంక్ ఏ కస్టమర్‌ను అడగదని కూడా స్పష్టం చేసింది.
అప్రమత్తం చేసిన యాక్సిస్ బ్యాంక్
ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) కూడా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పెట్టుబడి & టాస్క్ ఆధారిత మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని తన ఖాతాదార్లను హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక వివరాలను అపరిచితులతో పంచుకోవద్దంటూ ఖాతాదార్లను అప్రమత్తం చేసింది.
పీఎన్‌బీ ఇచ్చిన సలహా
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా అలెర్ట్‌లు పంపింది. నకిలీ వెబ్ లింక్‌ల నుంచి దూరంగా ఉండాలంటే అకౌంట్ హోల్డర్లను కోరింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని బ్యాంక్ తన ఖాతాదార్లకు సూచించింది.
మరో ఆసక్తికర కథనం: