Bankman-Fried's FTX Falls: తెల్లారేసరికి ₹లక్ష కోట్లు పొగొట్టుకున్న క్రిప్టో మేధావి, ఇప్పుడు మీ పరిస్థితేంటో చూసుకోండి!
క్రిప్టో కరెన్సీల ద్వారా, కేవలం 30 ఏళ్ల వయస్సులోనే లక్షల కోట్ల రూపాయలు కూడగట్టాడు, గ్లోబల్ బిగ్‌షాట్స్‌లో ఒకడిగా నిలిచాడు.
Bankman-Fried's FTX Falls: గత నాలుగు రోజుల్లో క్రిఫ్టో మార్కెట్ ఎంత భారీగా పతనమైందో మీరు తెలుసుగా. గురువారం అమెరికన్ స్టాక్ మార్కెట్లలో అనూహ్య కొనుగోళ్లు కనిపించడంతో, గ్లోబల్‌గా క్రిప్టోలకు కూడా కాస్త ఊతం దొరికింది. శుక్రవారం అవి కొద్దిగా కోలుకున్నాయి. యూఎస్ మార్కెట్లు చేయి అందించి ఆదుకోకపోతే క్రిప్టో ఇన్వెస్టర్లు మరింత ఊబిలోకి దిగిపోయే వాళ్లు.
గురువారం నాటి అమెరికన్ స్టాక్ మార్కెట్ల ఓపెనింగ్‌కు ముందు, వరుసగా మూడు రోజుల పాటు క్రిప్టో మార్కెట్లు జావగారి పోయాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎంత వీలయితే అంత మేర అమ్మకాలకు దిగారు. బుధవారం నాడు కనిష్టంగా 15,500 డాలర్ల వరకు దిగిపోయిన బిట్‌కాయిన్ (Bitcoin) ఇవాళ (శుక్రవారం) కొంత కోలుకుని 17000 డాలర్ల మార్క్ పైకి తిరిగి వచ్చింది. బిట్‌కాయిన్ తర్వాత అతి పెద్ద అసెట్ అయిన ఎథీరియమ్ (Ethereum) దుస్థితి కూడా ఇదే. బుధవారం 1070 డాలర్ల వరకు పడిపోయిన ఈ అసెట్, ఇవాళ 1200 డాలర్ల పైన తచ్చాడుతోంది. మిగిలిన టోకెన్లు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఊగిసలాడుతున్నాయి.
సంపదలో 94% ఆవిరి
ఇప్పుడు అసలు వార్తలోకి వద్దాం. క్రిప్టో అసెట్స్‌లో పట్టున్నవాళ్లకు శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్ అంటే పెద్దగా తెలీదు. కానీ, SBF అనగానే ఠక్కున గుర్తు పడతారు. ఈ షార్ట్‌కట్ నేమ్‌తో సుప్రసిద్ధుడు శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్. క్రిప్టో అసెట్స్ లావాదేవీల్లో అమిత మేధావి ఈ వ్యక్తి. క్రిప్టో కరెన్సీల ద్వారా, కేవలం 30 ఏళ్ల వయస్సులోనే లక్షల కోట్ల రూపాయలు కూడగట్టాడు, గ్లోబల్ బిగ్‌షాట్స్‌లో ఒకడిగా నిలిచాడు.
క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTXకు ఓనర్ శామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్. ప్రపంచంలోనే మూడో అతి పెద్దది క్రిప్టో ఫ్లాట్‌ఫాం ఇది. ఇందులో వందల కోట్ల మంది ట్రేడింగ్ చేస్తుంటారు. లిక్విడిటీ లేక ఆ ఎక్స్ఛేంజ్ కుప్పకూలడం వల్లే గత మూడు రోజులుగా క్రిప్టో మార్కెట్ కూడా పడిపోయింది. FTX ఎక్స్ఛేంజ్ చేతిలో డబ్బు లేదన్న విషయం బయటకు రావడంతో, పెట్టుబడిదారులంతా వెర్రెత్తిపోయారు. తమ దగ్గరున్న FTT, FTX టోకెన్లను వీలైనంత వరకు వదిలించుకున్నారు.
అమ్మకాలు పెరిగి అసెట్స్ విలువ ఆవిరి కావడంతో, ఒక్క రాత్రిలో 14.5 బిలియన్ డాలర్లను (1.2 లక్షల కోట్ల రూపాయలు) SBF కోల్పోయారు. దాదాపు 15.5 బిలియన్ డాలర్ల ఆస్తి హారతి కర్పూరంలా మండి, 94 శాతం ఆవిరైంది. చివరకు 991.5 మిలియన్ డాలర్లు మాత్రం మిగిలింది. ఫలితంగా, బిలియనీర్ల లిస్ట్‌లోనూ చోటు కోల్పోయారు. FTXలో SBFకు 53 శాతం వాటా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.