Beautiful Buildings: ప్రపంచంలో 7 అందమైన భవనాలు - జీవితంలో ఒక్కసారైనా వీటిని నేరుగా చూడాలి
Architecture Wonders: తాజ్‌మహల్‌ను వెన్నెల కాంతిలో చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. ఈ ఏడు అందమైన భవనాల్లో.. ప్రపంచ వింతల్లో స్థానం సంపాదించుకుంది తాజ్‌మహల్ మాత్రమే.
Most Beautiful Buildings In The World: అంతులేని సృజనాత్మకత మనిషి సొంతం. ఆ ఊహాశక్తికి ఆర్కిటెక్చర్ కూడా తోడైతే అద్భుతాలు కళ్ల ముందు నిలుస్తాయి. విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రూపరేఖల ఆధారంగా ప్రపంచంలో 7 నిర్మాణాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఒక మాస్టర్ పీస్.
తాజ్ మహల్ (Taj Mahal) - ఆగ్రా, భారత్
ప్రేమకు చిహ్నం & నిర్మాణ అద్భుతం తాజ్ మహల్. క్లిష్టమైన డిజైన్ దీని సొంతం. షాజహాన్ చక్రవర్తి, తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. ఈ తెల్లని పాలరాతి సమాధి ఇస్లామిక్, పర్షియన్, ఒట్టోమన్, భారతీయ నిర్మాణ శైలుల సమ్మిళితం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో, ప్రపంచంలోని ఏడు కొత్త వింతల్లో ఇది ఒకటి.
సగ్రడా ఫామిలియా (Sagrada Família) - బార్సిలోనా, స్పెయిన్
1882 నుంచి నిర్మాణంలో ఉన్న బాసిలికా, ప్రత్యేకమైన & విస్తృతమైన డిజైన్‌తో పాపులర్ అయింది. గోతిక్, ఆర్ట్ నోయువే రీతుల ఫలితంగా అద్భుత నిర్మాణం ఏర్పడింది. క్లిష్టమైన ముఖ భాగాలు, ఎత్తైన టవర్లు, సహజ కాంతితో మెరిసే ఇంటీరియర్‌తో కూడిన సాగ్రడా ఫామిలియాను సందర్శకులే కాదు, ఆర్కిటెక్చర్ ప్రేమికులు, విద్యార్థులు కూడా తప్పక సందర్శించాలి.
ఒపేరా హౌస్ (Opera House) - సిడ్నీ, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా ఐకానిక్ సింబల్‌గా నిలుస్తున్న కట్టడమిది. సెయిల్ లాంటి డిజైన్‌తో, వాటర్ ఫ్రంట్ లొకేషన్‌లో నిర్మించిన ఈ ఆధునిక భవనం.. మనిషి సృజనాత్మక చాతుర్యాన్ని ప్రతిబింబిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఎక్కువసార్లు ఫోటోలు తీసిన భవనాల్లో ఇది కూడా ఒకటి.
ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లెస్ (Palace of Versailles) - పారిస్, ఫ్రాన్స్
ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్‌కు, రాజరికానికి, ఐశ్వర్యానికి అద్భుతమైన ఉదాహరణ ఇది. వాస్తవానికి, వేట కోసం ఉపయోగించే విడిది నివాసం కోసం దీనిని నిర్మించారు. లూయిస్ XIV దీనిని ప్యాలెస్‌గా మార్చి, మరిన్ని సొగసులు అద్దాడు. హాల్ ఆఫ్ మిర్రర్స్, షాన్డిలియర్లు, కుడ్య చిత్రాలు, ప్రకృతి దృశ్యాలతో అలంకరించిన గార్డెన్లు, గదులు దీనిలో ఉన్నాయి.
బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) - దుబాయ్, యూఏఈ
ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు కనిపించే బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. ఆధునిక ఇంజినీరింగ్, నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. 828 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ఆకాశహర్మ్యం నుంచి దుబాయ్ అందాలను చూడొచ్చు.
సెయింట్ బాసిల్ కేథడ్రల్ (St. Basil's Cathedral) - మాస్కో, రష్యా
రెడ్ స్క్వేర్‌లో ఉన్న సెయింట్ బాసిల్ కేథడ్రల్ రష్యాలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. 16వ శతాబ్దంలో నిర్మించిన ఇది చూడడానికి అందగానే కాదు, విచిత్రంగా కూడా కనిపిస్తుంది. రంగురంగుల డిజైన్లతో, ఉల్లిపాయ రూపాన్ని పోలిన గోపురాలు దీని ప్రత్యేకత. రష్యన్ సంస్కృతి, నిర్మాణ శైలికి ఇదొక చిహ్నం.
నీలి మసీదు (The Blue Mosque) - ఇస్తాంబుల్, తుర్కియే
బ్లూ మస్క్‌గా ప్రసిద్ధి చెందిన సుల్తాన్ అహ్మద్ మసీదు ఒట్టోమన్ శిల్ప శైలికి అద్భుతమైన ఉదాహరణ. 17వ శతాబ్దపు ప్రారంభంలో దీనిని నిర్మించారు. విశాలమైన ప్రాంగణం, భారీ గోపురం, ఆరు మినార్లు, వివిధ రకాల నీలం రంగుల్లో ఇది అబ్బురపరుస్తుంది. నీలి రంగులో కనిపించే 20,000 సిరామిక్ టైల్స్‌ను చేతితోనూ తయారు చేయడం విశేషం. అద్భుతమైన ఇంటీరియర్ దీని సొంతం.
విశేషం ఏంటంటే, ఈ ఏడు అద్భుత భవనాల్లో సింపుల్‌గా, హుందాగా కనిపించేది తాజ్‌మహల్ మాత్రమే. సంక్లిష్టమైన డిజైన్లు లేకుండా చాలా నిరాడంబరంగా కనిపిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి