News
News
X

Jawaharlal Nehru: నెహ్రూ హయాంలో భారత్- అది రాచమార్గం కాదు సవాళ్ల సవారీ!

FOLLOW US: 

Jawaharlal Nehru: 1889, నవంబర్ 14న జన్మించిన జవహర్‌లాల్ నెహ్రూ భారత్‌కు తొలి ప్రధానిగా పని చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోన్న భారత్‌కు ఎక్కువ కాలం ప్రధానిగా పని చేసిన కీర్తి ఆయనకే దక్కింది.1947 ఆగస్టు 14-15 తేదీలలో దేశాన్ని ఉద్దేశించి ప్రధానిగా ఆయన చేసిన ప్రసంగాన్ని చాలా మంది నాయకులు ఇప్పటికీ గుర్తు చేస్తారు.

" ఎన్నో దశాబ్దాలుగా కోరుకున్న క్షణాలు వచ్చాయి. కానీ స్వాతంత్ర్య పోరాటానికి సూత్రధారి అయిన మోహన్‌దాస్ గాంధీ.. దేశ స్వతంత్ర సంబరాలు జరుపుకోవడానికి ఇక్కడ లేరు. కలకత్తాలో అల్లర్లు చెలరేగడంతో శాంతిని నెలకొల్పేందుకు గాంధీ స్వయంగా అక్కడికి వెళ్లారు.                                               "
- జవహర్‌లాల్ నెహ్రూ, దేశ తొలి ప్రధాని

తీరని లోటు

మరోవైపు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య చెలరేగిన వివాదం ఎన్నో రక్తపు మరకలను వదిలి వెళ్లింది. ప్రపంచంలోనే భారీ సంఖ్యలో శరణార్థులను మిగిల్చింది. 10 లక్షల మంది ప్రజలను గాయపరిచింది. రెండు దేశాలను యుద్ధానికి కూడా పంపంది. దేశానికి స్వతంత్రం వచ్చి ఆరు నెలలు గడవక ముందే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. దీంతో దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


అప్పుడే స్వతంత్రం పొందిన దేశానికి, కొత్తగా పగ్గాలు చేపట్టిన నాయకుడికి.. ఇంత కన్నా పెద్ద సవాళ్లు ఉంటాయా? ఓ వైపు దేశాన్ని ఐకమత్యంగా ఉంచాలి. మరోవైపు బాధలో ఉన్నవారిని ఓదార్చాలి. ఇలా నెహ్రూ ముందు చాలా కఠిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచం గుర్తించిన మహానేతగా గాంధీ అప్పటికే అవతరించారు. ఆధునిక బుద్ధుడు, క్రీస్తుగా ఆయన పేరు పొందారు. ఎప్పుడూ గాంధీ సలహా తీసుకోవడం అలవాటైన నెహ్రూకు.. ఆయన అంత్యక్రియల నిర్వహణకు, తర్వాత భారత దేశ నిర్మాణానికి ఎవరి ద్వారా మార్గదర్శకం పొందాలో అర్థం కాలేదు. 

సవాళ్లు

అప్పుడు నెహ్రూ ముందున్న కర్తవ్యం చాలా పెద్దది. ఇతర వలస దేశాల నేతలకు కూడా వారి సొంత సవాళ్లు ఉన్నాయి.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నెహ్రూ హయాంలో భారత్ ఎదుర్కొన్న సవాళ్లు అంతకుమించి. 5 లక్షలకు పైగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నివసిస్తోన్న 300 మందికి పైగా భారతీయులు. అద్భుతమైన వైవిధ్యాన్ని కలిగిన దేశం. మతం, కులం, భాష, సాంస్కృతిక వారసత్వం లేదా సామాజిక-ఆర్థిక స్థితికి సంబంధించిన వైరుధ్యాలు. అంతకుమించి నిరుపేదలు, రెండు వందల సంవత్సరాలకు పైగా నిరంతర దోపిడీ పాలనకు చెరిగిపోని గుర్తులు.. ఇలా నెహ్రూ ముందున్న సవాళ్లు ఎన్నో. వీటిని మంచి.. పలు సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడానికి.. నెహ్రూ లెక్కలేనన్ని చర్చలు, సమావేశాలు చేపట్టాల్సి వచ్చింది. 

నెహ్రూ ప్రధానిగా ఉన్న దాదాపు పదిహేడేళ్లలో భారత దేశాన్ని ఆధునికత వైపు తీసుకెళ్లారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా నిలిపారు. ప్రధానిగా ఆయన విజయాల జాబితాతో పాటు వైఫల్యాల చిట్టా కూడా ఉంది. 1951 అక్టోబర్ 25, 1952 ఫిబ్రవరి 21  మధ్య జరిగిన దేశ తొలి సాధారణ ఎన్నికలు ఎప్పటికీ మర్చిపోలేం. అధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్‌లో తొలి సారి ఎన్నికల నిర్వహణ ఒక సవాల్‌. దాదాపు 10.6 కోట్ల మంది ప్రజలు, 45 శాతం మంది ఓటర్లు.. ఆ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1951లో భారత్‌లో అక్షరాస్యత శాతం కేవలం 18%. ఆ తర్వాత 1957, 1962లో సాధారణ ఎన్నికలు జరిగాయి. నెహ్రూ మృతికి ముందు చివరి సాధారణ ఎన్నికలు 1964 మే లో జరిగాయి.

మొత్తానికి నెహ్రూ హయాంలో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 1959లో కేరళలో నంబూదిరిపద్ నాయకత్వంలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని నెహ్రూ డిస్మిస్ చేశారు. నెహ్రూ తనపై వ్యతిరేకతను తట్టుకోలేక ఇలా చేశారని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.

మైలురాళ్లు

నెహ్రూ పాలనలో భారతదేశానికి పార్లమెంటరీ వారసత్వం వచ్చింది. బ్రిటీష్ కాలంలో వచ్చిన సంస్థలు.. నెహ్రూ హయాంలో మరింత అభివృద్ధి చెందాయి. ప్రజాస్వామ్య సంస్థలు.. స్థిరత్వాన్ని మరింత పరిపక్వతను చూపించాయి. ఉన్నత భారతీయ న్యాయస్థానాలు తమ తీర్పులతో స్వతంత్ర సామర్థ్యాన్ని రుచి చూపించాయి. పత్రికలు స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేశాయి. లోక్‌సభ చర్చలు కూడా అర్థవంతంగా సాగాయి. ఆ కాలంలో కాంగ్రెస్ పార్లమెంటులో అత్యధిక మెజారిటీని సాధించినప్పటికీ.. ప్రతిపక్షాల గళం కూడా గట్టిగానే వినిపించేది. పొరుగున ఉన్న పాకిస్థాన్, డచ్ పాలన నుంచి విముక్తి పొందిన ఇండోనేసియా మాదిరిగా కాకుండా భారత్‌లో ప్రజాస్వామ్య పాలన నడిచింది. 

కల్లోలాలు

1948 ప్రారంభంలో జరిగిన విభజన హత్యల తర్వాత నెహ్రూ హయాంలో భారత దేశం మతపరమైన కల్లోలాల నుంచి పూర్తిగా బయటపడలేదు. మైనారిటీలు భారత్‌లో సురక్షితంగా ఉంటారని నెహ్రూ హామీ ఇచ్చారు. అయితే మతపరమైన కల్లోలాలు కొన్ని చెలరేగినా అవి చిన్న ఘటనలే. 1961 వరకూ మతపరమైన కల్లోలాలు పెద్దవి ఏమీ జరగలేదు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లో జరిగిన మత ఘర్షణ కాస్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

నెహ్రూ హయాంలో దళితులు పట్ల దాడులు, చిన్నచూపు ఏ మాత్రం తగ్గలేదని విమర్శకులు ఇప్పటికీ చెబుతారు. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లను ప్రజలు అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ స్వయంగా ఊహించిన దానికంటే ఇవి నెమ్మదిగానే అమలు అయ్యాయి. 

నెహ్రూ హయాంలో సాంస్కృతిక రంగంలో భారత్ ముందడుగు వేసింది. ఉదాహరణకు కళ, సంగీతం, నృత్యం, వివిధ జాతీయ విద్యావేత్తల సృష్టి వంటి వాటిలో భారత్ పురోగతి సాధించింది. సాహిత్యం, ఉన్నత విద్యను ప్రోత్సహించే ప్రయత్నాలు నెహ్రూ చేశారు. భారత దేశాన్ని ఆధునికంగా మార్చడానికి ఆయన ఎంతో కృషి చేశారు.

విద్య

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (1951), బొంబాయి (1958), మద్రాస్ (1959), కాన్పుర్ (1959), దిల్లీ (1961) స్థాపనలు నెహ్రూ సాధించిన గొప్ప ఘనతల్లో ఒకటిగా చెబుతారు. ఈ IITలు భారత్‌కు ప్రసిద్ధ సాంస్కృతిక మూలధన రూపంగా మిగిలిపోయాయి. నేటి ఉన్నత విద్యా ప్రపంచంలో దిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (1909లో స్థాపన) వంటి సంస్థలు ఇప్పటికీ ఎంతో గొప్పగా రాణిస్తున్నాయి.

అంతర్జాతీయంగా

అంతర్జాతీయంగా మాత్రం భారత్‌ను శక్తిమంతంగా నిలపడంలో నెహ్రూ విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఐక్యరాజ్యసమింతి భద్రతా మండలిలో భారత్‌కు రావాల్సిన సభ్యత్వాన్ని చైనాకు వదిలేశారని నెహ్రూపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా 1962లో చైనా- భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారతదేశంలోని అసోం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనతను బహిర్గత పరచింది. భద్రతపై నెహ్రూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

కానీ గాంధీ హత్య తర్వాత ప్రపంచానికి భారత్ అనగానే గుర్తొచ్చే నాయకుడు నెహ్రూ మాత్రమే. ఎందుకంటే నెహ్రూ విద్యావంతుడు.. దూరదృష్టి కలిగిన నేత. అంతర్జాతీయ ప్రముఖులతో ఆయనకు స్నేహం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, రచయితలు, శాస్త్రవేత్తలు కూడా నెహ్రూను స్నేహితుడిగా చూశారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, పాల్‌, Essie Robeson, లాంగ్స్టన్ హ్యూస్ వంటి వారితో ఆయనకు స్నేహం ఉంది. దివంగత నెల్సన్ మండేలా.. నెహ్రూపై తన అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు.

ప్రస్తుతం 'గ్లోబల్ సౌత్' అని పేరుపొందిన భారత్‌ను ఉన్నతస్థాయిలో చూడాలని ఆనాడు నెహ్రూ కలలు కన్నారు.  వలసరాజ్యంలో ఉన్న ఇతర దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని, ఏర్పరచుకోవాలని నెహ్రూ తపించారు. 1955లో జరిగిన బాండుంగ్ సమావేశంలో
నెహ్రూ ప్రముఖ పాత్ర వహించారు. ఆ సమావేశంలో ఆసియా, ఆఫ్రికన్ దేశాలు పాల్గొన్నాయి. 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన సైనిక కూటములు (అమెరికా, సోవియట్ రష్యా) ఏర్పడ్డాయి. ఇవి వర్ధమాన దేశాలపై తమ తమ కూటములలో చేరాలని ఒత్తిడి చెయ్యడంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ ఒత్తిడులకు లొంగకుండా అభివృద్ధి చెందుతున్న, చిన్న దేశాల సమైక్య స్వరంగా అలీనోద్యమం (Non-Aligned Movement) ఆవిర్భవించింది. భారత్‌ను ఇందులో చేర్చి అమెరికా, సోవియట్ రష్యాలను నెహ్రూ ఆశ్చర్యపరిచారు. మొత్తానికి నెహ్రూ హయాంలో భారత్ చాలా శాంతంగా ఉండేది. ఎందుకంటే నెహ్రూ ఆలోచనల్లో ఎప్పుడూ గాంధీ నీడ ఉండేది.


 - వినయ్ లాల్, రచయిత, బ్లాగర్, కల్చరల్ క్రిటిక్, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ (యూసీఎల్ఏ)            


[నోట్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP News Network Pvt Ltd అభిప్రాయాలు, నమ్మకాలను ఇవి ఏ మాత్రం ప్రతిబింబించవు.]

 

Published at : 15 Nov 2022 01:09 PM (IST) Tags: Jawaharlal Nehru The Mentor To A Fledgling Nation India Under Nehru