దట్టమైన పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? మీ ప్రాణాలను కాపాడే సూచనలు ఇవి!
పొగమంచు సమయంలో డ్రైవింగ్ ప్రమాదకరం. లో బీమ్ లైట్లు, వేగం తగ్గించడం, రోడ్ మార్కింగ్స్ వంటి టాప్ 5 లైఫ్ సేవింగ్ సూచనలు పాటిస్తే ప్రమాదాలు తప్పించుకోవచ్చు.

Foggy Weather Driving Safety: ప్రతి సంవత్సరం చలికాలం వచ్చిందంటే చలితో పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుని వస్తుంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో, ఘాట్ రోడ్లలో ముందు వాహనం కనిపించనంతగా పొగమంచు పట్టేస్తుంది. ఇది, డ్రైవింగ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఎదుటి వాహనం నిలిచిపోయినట్లు కనిపించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనం అర్థం కాకపోవడం వంటి పరిస్థితులు ప్రాణాలకు ముప్పుగా మారుతాయి.
ఈ శీతాకాలంలో మీరు ఏ ప్రాంతంలోనైనా పొగమంచు ఉన్న సమయంలో డ్రైవింగ్ చేయాల్సి వస్తే, ఈ టాప్ 5 లైఫ్ సేవింగ్ సూచనలు తప్పక పాటించాలి.
1. లో బీమ్ లైట్లు, ఫాగ్ లైట్లు మాత్రమే వాడండి
పొగమంచులో హై బీమ్ లైట్లు ఎప్పటికీ వాడకూడదు. అవి పొగమంచులోని తేమపై పడి కళ్లకు గ్లేర్ ఏర్పడేలా చేస్తాయి. దీనివల్ల ముందు దారి మరింత కనిపించదు. లో బీమ్ లైట్లు, ఫాగ్ లైట్లు రోడ్డుపైకి కాంతిని దించి చూపిస్తాయి. ముఖ్యంగా పసుపు రంగు లైట్లు పొగమంచులో మెరుగైన విజిబిలిటీ ఇస్తాయి. బ్రైట్ వైట్ లైట్లు గ్లేర్ పెంచుతాయని గుర్తుంచుకోండి.
2. హారన్, టర్న్ ఇండికేటర్లను సరైన విధంగా వాడండి
పొగమంచులో ఇతర డ్రైవర్లు, పాదచారులు మీ వాహనం ఉందని ముందే తెలుసుకోవాలి. అవసరమైనప్పుడల్లా హారన్ ఉపయోగించండి. మలుపులు తిరుగుతున్నప్పుడు టర్న్ ఇండికేటర్లు తప్పకుండా ఆన్ చేయండి. వాహనం నడుపుతూ హాజర్డ్ లైట్లు వాడకండి. ఇవి ఇతర డ్రైవర్లను గందరగోళానికి గురి చేస్తాయి, అలాగే మీ టర్న్ సిగ్నల్స్‌ను కూడా పని చేయకుండా చేస్తాయి.
3. నెమ్మదిగా డ్రైవ్ చేయండి
పొగమంచులో వేగమే మీ మొదటి శత్రువు. దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు సుమారు 30 కిలోమీటర్ల వేగంతోనే డ్రైవ్ చేయడం మంచిది. ముందున్న వాహనంతో కనీసం 7 సెకన్ల దూరంలో ఉండండి. ఇలా చేస్తే, అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు సమయం దొరుకుతుంది.
4. రోడ్ మార్కింగ్స్‌ను గైడ్‌గా వాడండి
ముందున్న వాహనం టెయిల్ లైట్లను అనుసరించడం ప్రమాదకరం. బదులుగా రోడ్డు కుడివైపు ఉన్న తెల్ల గీతను గమనిస్తూ డ్రైవ్ చేయండి. మీరు మీ లేన్‌లోనే ఉండేందుకు ఇది గైడ్‌లా సహాయపడుతుంది. విజిబిలిటీ పూర్తిగా తగ్గితే, సురక్షితమైన పార్కింగ్ స్థలంలో వాహనం ఆపి హాజర్డ్ లైట్లు ఆన్ చేయండి.
5. కళ్ల కంటే చెవులను ఎక్కువగా ఉపయోగించండి
పొగమంచు కళ్లను మోసం చేస్తుంది కానీ చెవులను కాదు. కిటికీలను కొంచెం దించండి, మ్యూజిక్ ఆఫ్ చేయండి. హారన్ శబ్దాలు, సైరన్లు ముందే వినిపిస్తే, ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయొచ్చు.
పొగమంచులో డ్రైవింగ్ చేయాల్సి వచ్చినప్పుడు తొందర కాదు, జాగ్రత్తే మీ ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఐదు సూచనలు పాటిస్తే, మీరు మాత్రమే కాదు, మీతో పాటు రోడ్డుపై ఉన్నవారూ సురక్షితంగా ఉంటారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















