భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్లు గెలిచిన Tata Altroz - బడ్జెట్ రేటులోనే మీ ఫ్యామిలీకి ఫుల్ సేఫ్టీ
Tata Altroz 5 Star Safety: టాటా ఆల్ట్రోజ్ భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) క్రాష్ పరీక్షల్లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. దీంతో, ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌గా మారింది.

Tata Altroz BNCAP 5 Star Safety Rating: టాటా మోటార్స్ బ్రాండ్‌లో ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ "ఆల్ట్రోజ్", ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో "5-స్టార్ సేఫ్టీ రేటింగ్" సాధించింది. గత నెలలో, అంటే ఆగస్టు 2025లో భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) క్రాష్ టెస్ట్ జరిగింది, ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సేఫెస్ట్ కారు ప్రారంభ ధర కేవలం రూ. 6.89 లక్షలు (Tata Altroz ex-showroom price, Hyderabad Vijayawada). ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండే కారు మాత్రమే కాకుండా దేశంలోని అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది.
అడల్ట్ ప్యాసింజర్ల భద్రత
ఆల్ట్రోజ్, వయోజన ప్రయాణీకుల భద్రతలో మంచి స్కోర్‌ను సాధించింది. మొత్తం 16 మార్కులకు గాను 15.55 స్కోర్ చేసింది. ఏదైనా పెద్ద ప్రమాదంలో డ్రైవర్ & ప్రయాణీకులకు అద్భుతమైన రక్షణను ఈ స్కోర్ సూచిస్తుంది. ఆల్ట్రోజ్ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ & సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ రెండింటిలోనూ బాగా తట్టుకుంది, 16కి 14.11 స్కోర్ చేసింది. కారు చాసిస్ & ఫుట్‌వెల్‌లు స్థిరంగా & దృఢంగా ఉన్నాయని, భారీ ఒత్తిడి సైతం తట్టుకోగలవని ఈ టెస్ట్ రుజువు చేసింది.
ఈ కారు పిల్లలకు కూడా సురక్షితం
పిల్లల భద్రత పరంగా కూడా ఆల్ట్రోజ్ అద్భుతంగా నిలిచింది. మొత్తం 49 పాయింట్లకు గాను 44.90 స్కోర్ చేసింది. 18 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం నిర్వహించిన పరీక్షలలో, ఈ కారులోని ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ అద్భుతమైన భద్రతను నిరూపించుకున్నాయి. CRS ఇన్‌స్టాలేషన్ పరీక్షలో, ఆల్ట్రోజ్ 12/12 స్కోర్ చేసింది & డైనమిక్ పరీక్షలో 23.90/24 స్కోర్ చేసింది. పిల్లలతో పాటు ప్రయాణించే కుటుంబాలకు ఈ కారు అత్యంత నమ్మదగినదని ఈ స్కోర్లు రుజువు చేస్తున్నాయి.
సేఫ్టీ ఫీచర్లు
టాటా ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్లలో అవసరమైన భద్రత ఫీచర్లను ప్రామాణికంగా ఇస్తున్నారు. వీటిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్లు & లోడ్ లిమిటర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్‌లు & పాదచారుల రక్షణ వ్యవస్థ ఉన్నాయి. పిల్లల భద్రతను మరింత మెరుగుపరిచే ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా అందించారు. ముఖ్యంగా, ఆల్ట్రోజ్‌కు లభించిన భారత్ NCAP 5-స్టార్ భద్రతా రేటింగ్ పెట్రోల్, డీజిల్ & CNG - అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది.
టాటా కార్లు అంటేనే గట్టిదనానికి, భద్రతకు మారుపేరు. భారతదేశ మార్కెట్‌కు సురక్షితమైన కార్లను పరిచయం చేయడం టాటా మోటార్స్ మెరుగ్గా పని చేస్తోంది, ఎప్పుడూ రాజీ పడలేదు. తాజాగా, ఆల్ట్రోజ్ కేసుతో, డిజైన్ & ఫీచర్లలో మాత్రమే కాకుండా కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతలోనూ ఏ మాత్రం తగ్గేది లేదని ఈ కంపెనీ నిరూపించింది.
టాటా ఆల్ట్రోజ్ పోటీ కార్లు
టాటా ఆల్ట్రోజ్, ప్రధానంగా, Maruti Baleno & Hyundai i20 వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లతో పోటీ పడుతుంది. ఆల్ట్రోజ్‌ను Maruti Swift & Tata Punch వంటి కార్లతో కూడా పోలుస్తున్నప్పటికీ, ఇది కొంచెం పెద్దది & మరింత ప్రీమియం విభాగంలోకి వస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు కాగా... మారుతి బాలెనో ధర ₹6.74 లక్షల నుంచి ₹9.96 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది & ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. హ్యుందాయ్ ఐ20 ధర ₹7.51 లక్షల నుంచి ₹11.35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీ రేటింగ్ & 3-స్టార్ చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీ రేటింగ్ పొందింది.




















