ఒక్కసారి ఛార్జ్ చేస్తే 448 కిలోమీటర్లు! కియా అతి చిన్న కారు EV2 ఫీచర్లు, రేంజ్, డిజైన్ వివరాలు
కియా అతి చిన్న ఎలక్ట్రిక్ కారు EV2 ను ప్రపంచానికి పరిచయం చేసింది. 448 కిలోమీటర్ల రేంజ్, రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఆధునిక ఫీచర్లతో యూరప్‌లో ఆవిష్కరించింది.

Kia Smallest Electric Car EV2: కియా మోటార్స్, తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించింది. బ్రస్సెల్స్ మోటార్ షోలో కియా కొత్తగా EV2 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌ను ఆవిష్కరించింది. ఇది కియా నుంచి వచ్చిన అతి చిన్న born-electric (BE) వాహనం కావడం విశేషం. ఇప్పటికే EV6, EV9 లాంటి మోడళ్లతో గుర్తింపు తెచ్చుకున్న కియా, ఇప్పుడు EV2తో ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ విభాగంలో తన దృష్టిని చూపించింది.
డిజైన్‌లో SUV స్పూర్తి
కియా EV2 డిజైన్ చూస్తే, పెద్ద ఎలక్ట్రిక్ SUVల పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. కొత్తగా రూపొందించిన ‘టైగర్ ఫేస్’ ఫ్రంట్, నిలువుగా అమర్చిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, బాక్సీ డిజైన్ ఈ వెహికల్‌కు ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి. చుట్టూ బాడీ క్లాడింగ్ ఉండటం వల్ల ఇది SUV మాదిరిగా కనిపిస్తుంది. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్స్ డిజైన్ భారత మార్కెట్లో ఉన్న సైరస్‌ను గుర్తు చేస్తుంది.
సాధారణ వేరియంట్లలో 16 నుంచి 18 ఇంచుల వీల్స్ లభిస్తే, GT లైన్ వేరియంట్లలో 19 ఇంచుల వీల్స్ అందుబాటులో ఉంటాయి. పొడవు 4,060 మిల్లీమీటర్లు, వెడల్పు 1,800 మిల్లీమీటర్లు, వీల్‌బేస్ 2,565 మిల్లీమీటర్లు ఉండటంతో నగర వినియోగానికి సరైన సైజ్‌గా కనిపిస్తుంది.
ఇంటీరియర్‌లో ఆధునిక టచ్
EV2 ఇంటీరియర్ పూర్తిగా డిజిటల్ టచ్‌తో రూపొందించారు. డాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 12.3 ఇంచుల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5.3 ఇంచుల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. ఖర్చు తగ్గించేందుకు కియా కొత్త ‘లైట్’ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించింది. అయినప్పటికీ OTA అప్‌డేట్స్ సపోర్ట్ ఉండటం గమనార్హం.
ఇందులో 4 సీటర్, 5 సీటర్ అనే రెండు సీటింగ్ ఆప్షన్లు ఉన్నాయి. 4 సీటర్ వేరియంట్‌లో స్లైడ్ అయ్యే రిక్లైనింగ్ సీట్లు ఉండగా, బూట్ స్పేస్ 403 లీటర్ల వరకు లభిస్తుంది. 5 సీటర్‌లో 362 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ముందు భాగంలో 15 లీటర్ల ఫ్రంక్ కూడా ఇచ్చారు.
ఫీచర్లు, టెక్నాలజీ
డిజిటల్ కీ 2.0, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, V2L, V2G ఛార్జింగ్ సపోర్ట్, లెవల్ 2 ADAS వంటి ఆధునిక భద్రతా, సౌకర్య ఫీచర్లు EV2లో ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్ వివరాలు
కియా EV2లో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 42.2kWh LFP బ్యాటరీతో 317 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 61.0kWh NMC బ్యాటరీతో వచ్చే లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 448 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌లో 147hp మోటార్, లాంగ్ రేంజ్‌లో 136hp మోటార్ అందుబాటులో ఉంటాయి.
400V ఛార్జింగ్ సిస్టమ్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జ్ కేవలం 30 నిమిషాల్లో పూర్తవుతుందని కియా తెలిపింది. 11kW లేదా 22kW AC ఛార్జర్ ఎంపికలు కూడా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, కియా EV2 యూరప్ మార్కెట్‌లో ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత మార్కెట్‌లోకి వస్తే, ఇది సిటీ కోసం మంచి ఎంపికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















