New Hyundai SUVs: వెన్యూ నుంచి క్రెటా వరకు - మార్కెట్‌లోకి తుపానులా వస్తున్న హ్యుందాయ్ కొత్త SUVలు
Upcoming Hyundai SUVs: హ్యుందాయ్, భారతదేశంలో 7 కొత్త తుపాను లాంటి లాంచింగ్‌లను ప్లాన్ చేసింది. మారుతికి గట్టి పోటీ ఇస్తున్న ఈ కంపెనీ, 7 కొత్త SUVలను తీసుకురానుంది.

Hyundai New SUV SUVs Arriving In 2025-27: హ్యుందాయ్, తన SUV లైనప్‌ను చాలా బలంగా విస్తరిస్తోంది, భారతదేశంపై తుపానులా విరుచుకుపడడానికి సిద్ధమైంది. ఫేస్‌లిఫ్ట్‌ల నుంచి పూర్తిగా కొత్త కార్ల వరకు.. మొత్తం 7 మోడళ్ల లాంచింగ్‌కు ప్లాన్ చేసింది. రాబోయే మోడళ్లలో పెట్రోల్, హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్స్ సహా వివిధ ఇంధన రకాలు ఉన్నాయి. 2025-27 కాలంలో ఇండియన్ రోడ్లపైకి కొత్త SUVలు ఇవి:
1. కొత్త హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూలో కొత్త & కీలక అప్‌డేటెడ్ వెర్షన్ రాబోతోంది, రాబోయే పండుగ సీజన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హ్యుందాయ్, ఈ రిఫ్రెష్‌డ్ వెర్షన్‌ను ఒక కొత్త డిజైన్‌తో & అప్‌డేటెడ్ ఫీచర్లతో పరిచయం చేయనుంది. ఈ కారులో మరింత ప్రీమియం క్యాబిన్‌ను తీసుకురానుంది. కొత్త వెర్షన్‌లో పవర్‌ట్రెయిన్ మాత్రం మారదని భావిస్తున్నారు.
2. 7-సీటర్ హ్యుందాయ్ ప్రీమియం SUV
అల్కాజార్ & టక్సన్ మధ్య ఉండేలా రూపొందించిన కొత్త 3-వరుసల SUV కోసం హ్యుందాయ్ పని చేస్తోంది. రాబోయే మోడల్‌లో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంటుంది. కొత్త తలేగావ్ ఫ్యాక్టరీకి ఈ కొత్త 3-వరుసల SUV తయారీ బాధ్యతలు అప్పగించారు.
3. హ్యుందాయ్ బేయాన్
అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న బేయాన్ & అద్భుతమైన స్పెసిఫికేషన్లు ఉన్న i20ని కలిపి సరికొత్త కారును ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఉమ్మడి ప్లాట్‌ఫామ్ విధానంతో హ్యుందాయ్ మల్టీలెవెల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ అందించగలదు. వాటిలో, చాలామందికి తెలిసిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉండవచ్చు.
4. కొత్త హ్యుందాయ్ క్రెటా
పాపులర్ క్రెటా SUVని నవతరానికి తగ్గట్లు మార్చడానికి హ్యుందాయ్ ఇప్పటికే పునాది వేసింది, ఈ కారు ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే మోడల్‌లో, మొదటిసారి, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంటుందని భావిస్తున్నారు. కారు బయటి భాగం & లోపలి భాగంలోనూ ప్రధాన సవరణలు ఉంటాయి.
5. హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్
విదేశీ మార్కెట్లలో ఈ కారు ఇప్పటికే చాలా అప్‌డేట్స్ చూసింది. వాటితో పాటు, కొత్తగా, ఎక్స్‌టీరియర్ మార్పులతో నూతన వెర్షన్ ఇండియన్ మార్కెట్‌లోకి రాబోతోంది. రీడిజైన్ చేసిన గ్రిల్, స్కిడ్ ప్లేట్లు, లైటింగ్ సిగ్నేచర్స్ ఉంటాయి. కొత్త అల్లాయ్ వీల్స్ జత చేయవచ్చు. క్యాబిన్‌లో కొత్త తరహా డాష్‌బోర్డ్ & వంపుతిరిగిన డిజిటల్ డిస్‌ప్లే సహా మోడర్న్ లేఅవుట్ రాబోతోంది. హ్యుందాయ్ ఇంకా అధికారికంగా ఈ కారు లాంచ్‌ను ధృవీకరించనప్పటికీ, అతి త్వరలో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు.
6. హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV
హ్యుందాయ్ భారతదేశం కోసం ప్రత్యేకంగా ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. 2026 నాటికి దీని లాంచింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని ఇన్‌స్టర్ EV నుంచి ప్రేరణతో ఈ కొత్త ప్రాజెక్ట్ చేపట్టారని సమాచారం. సబ్-4 మీటర్ డిజైన్‌తో వచ్చే SUV, టాటా పంచ్ EV వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.
7. హ్యుందాయ్ అయోనిక్ 9
ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యుందాయ్ ఐయోనిక్ 9 గురించి రివీల్ చేశారు. ఈ SUV త్వరలోనే భారతదేశంలో ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ SUVగా, డెడికేటెడ్ E-GMP ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఐయోనిక్ 9 'కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్' (CBU)గా ఇండియాలోకి దిగుమతి అవుతుంది.





















