యూత్ మెచ్చే ఫీచర్లు, పవర్‌తో KTM RC 160 లాంచ్ - Yamaha R15 కంటే రేటు ఎక్కువా, తక్కువా?
KTM RC 160 భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇంజిన్ పవర్, ఫీచర్లు, Yamaha R15తో పోలిక, విజయవాడ, హైదరాబాద్ ఆన్‌రోడ్ ధరల్లో తేడా ఎందుకు ఉందో పూర్తిగా తెలుసుకోండి.

KTM RC 160 On-Road Price And Specifications: కేటీఎం అభిమానులకు మరో శుభవార్త. ఇటీవల 160 Duke ను మన మార్కెట్లోకి ప్రవేశపెట్టిన KTM, ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఫుల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ KTM RC 160 ని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ KTM RC లైనప్‌లో ఎంట్రీ లెవల్ సూపర్ స్పోర్ట్స్ బైక్‌గా నిలవనుంది. RC 200, RC 390ల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రావడంతో యువతను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
KTM RC 160 - ఇంజిన్, పవర్ వివరాలు
KTM RC 160లో 164.2cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజిన్ 160 డ్యూక్‌లో కూడా ఉంది. ఈ ఇంజిన్ 9,500rpm వద్ద 19hp పవర్, 7,500rpm వద్ద 15.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా అందించారు. కంపెనీ చెప్పిన ప్రకారం, యాక్సిలేటర్ ఫుల్లుగా తిప్పితే ఈ బైక్ గరిష్టంగా 118 కిలోమీటర్ల వేగాన్ని చట్ చేస్తుంది.
సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్
సస్పెన్షన్ విషయంలో కూడా RC 160 మంచి స్పెసిఫికేషన్లతో వచ్చింది. ముందువైపు 37mm USD ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ ఇచ్చారు. 160 డ్యూక్ తరహాలోనే 110 సెక్షన్ ఫ్రంట్ టైర్, 140 సెక్షన్ రియర్ టైర్, 17 అంగుళాల వీల్స్‌పై ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందువైపు 320mm డిస్క్, వెనుకవైపు 230mm డిస్క్ ఇచ్చారు. అదనంగా సూపర్‌మోటో మోడ్‌తో డ్యుయల్ ఛానల్ ABS కూడా ఉంది.
లైటింగ్, ఫీచర్లు
KTM RC 160 పూర్తిగా ఎల్‌ఈడీ. అంటే, ఆల్ LED లైటింగ్ సెటప్ అందించారు. హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్, ఇండికేటర్లు అన్నీ LEDలే. అలాగే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇటీవల 160 డ్యూక్‌కు TFT స్క్రీన్ అప్‌డేట్ ఇచ్చినా, RC 160 కి మాత్రం ఇంకా TFT ఆప్షన్‌ను ప్రకటించలేదు. బరువును ఈ కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఫెయిరింగ్ ఉండటం వల్ల ఇది డ్యూక్ కంటే కొద్దిగా ఎక్కువ బరువు ఉండే అవకాశం ఉంది. 160 డ్యూక్ కెర్బ్ వెయిట్ 147 కేజీలు.
ధర, ప్రత్యర్థులు
KTM RC 160 ఎక్స్-షోరూమ్ ధర (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) రూ. 1.85 లక్షలు. ఇది 160 డ్యూక్ కంటే సుమారు రూ.15,000 ఎక్కువ. అలాగే, దీని ప్రధాన ప్రత్యర్థి అయిన Yamaha R15 కంటే దాదాపు రూ.19,000 అధిక ధరలో ఉంది.
హైదరాబాద్, విజయవాడ ఆన్‌రోడ్ ధరల్లో తేడా ఎందుకు?
తెలుగు రాష్ట్రాల వినియోగదారులు ఎక్కువగా అడిగే ప్రశ్న ఇదే - హైదరాబాద్, విజయవాడ ఆన్‌రోడ్ ధరల్లో తేడా ఎందుకు?. KTM RC 160 కూడా, ఆన్-రోడ్ విషయంలో, తెలుగు రాష్ట్రాల్లో సుమారు 6 వేల రూపాయల తేడా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం RTO ఛార్జీలు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి.
విజయవాడ ఆన్‌రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ ధర: ₹ 1,85,000
RTO: ₹ 23,700
ఇన్సూరెన్స్ (కాంప్రెహెన్సివ్): ₹ 11,765
మొత్తం ఆన్‌రోడ్ ధర: ₹ 2,20,465
హైదరాబాద్ ఆన్‌రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ ధర: ₹ 1,85,000
RTO: ₹ 29,250
ఇన్సూరెన్స్ (కాంప్రెహెన్సివ్): ₹ 11,833
మొత్తం ఆన్‌రోడ్ ధర: ₹ 2,26,083
కొనాలా, వద్దా?
స్పోర్టీ లుక్, ఫుల్ ఫెయిరింగ్, కేటీఎం బ్రాండ్ ఇమేజ్ కావాలనుకునే యువ రైడర్లకు KTM RC 160 ఒక మంచి ఎంట్రీ లెవల్ సూపర్ స్పోర్ట్స్ బైక్‌గా చెప్పుకోవచ్చు. Yamaha R15తో పోల్చుకుని, మీ అవసరాలకు ఏది సరిపోతుందో చూసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















