YSRCP News: నేడే రాప్తాడులో ‘సిద్ధం’ మూడో సభ - పది లక్షల మందితో భారీగా!
YSRCP Siddham Meeting in Rayalaseema: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు తమ కేడర్ ను సమయత్తం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సిద్ధం మూడో సభను రాయలసీమలో ఆదివారం నిర్వహిస్తోంది.
Siddham Public Meeting In Raptadu: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు తమ కేడర్ ను సమయత్తం చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సిద్ధం మూడో సభను రాయలసీమలో ఆదివారం నిర్వహిస్తోంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహిస్తోంది. 280 ఎకరాల విస్తీర్ణంలో పది లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాయలసీమ పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పది లక్షల మంది తరలి వచ్చేలా పార్టీ ఏర్పాటు చేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో వైసిపి ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. ఈ సభ కోసం వైసిపి
సరికొత్త ర్యాంప్, పార్టీ ప్రచార పాటను సిద్ధం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తొలి సిద్ధం సభను భీమిలిలో నిర్వహించిన వైసిపి.. రెండో సభను ఏలూరులో నిర్వహించింది. తాజాగా మూడో సభను రాయలసీమ పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తోంది. మొదట ఈ నెల 11న సభ నిర్వహించాలని భావించిన వైసీపీ అనుకున్న స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో 18కి వాయిదా వేసింది. నాలుగో సమావేశాన్ని పలనాడు ప్రాంతంలో నిర్వహించేందుకు వైసిపి సన్నద్ధమవుతోంది.
అతిపెద్ద రాజకీయ ర్యాలీ నిర్వహణ
సభకు ముందు భారీ ఎత్తున హాజరైన కేడర్ తో ర్యాలీ నిర్వహించేందుకు వైసిపి సమర్థమవుతోంది. ఈ ర్యాలీ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ ర్యాలీగా నిలవబోతోందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో కార్యకర్తల మధ్యకు వెళ్లి వారితో మమేకమయ్యేందుకు అనుగుణంగా ఇక్కడ అతిపెద్ద నడిచే ర్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సభ వేదిక ఏర్పాటులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి ఉషశ్రీ, స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, రాయలసీమకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రాష్ట్ర చరిత్రలోనే కనీ, వినీ ఎరుగని విధంగా సభను నిర్వహిస్తున్నామన్నారు. 55 నియోజకవర్గాల నుంచి లక్షలాదిమంది సభకు తరలి రానున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే తప్ప.. ఈ రాష్ట్రానికి ఏం చేస్తామన్న విషయాలను మాత్రం వెల్లడించడం లేదని ఆరోపించారు.
మేనిఫెస్టో విడుదల చేయనున్న జగన్
రానున్న ఎన్నికలకు సంబంధించిన కీలకమైన ప్రసంగాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారు. గత రెండు సభలతో పోలిస్తే ఈ సభలో కేడర్ ను మరింత ఉత్సాహపరిచే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉండబోతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేనిఫెస్టోలో ఇప్పుడు అమలులో ఉన్న సంక్షేమ పథకాలతోపాటు మరికొన్ని సరికొత్త పథకాలను నవరత్నాల క్రింద జోడించి ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని భావిస్తున్నారు. మేనిఫెస్టోలో ఆచరణాత్మకమైన పథకాలను మాత్రమే సీఎం జగన్ ప్రకటన చేస్తారని సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటల సమయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంది.